అవసరంలేని టెస్టులు చేయొద్దు


Sat,September 14, 2019 03:00 AM

Etela Rajender Over Viral Fever In Telangana

-ప్రైవేట్ వైద్యులకు మంత్రి ఈటల సూచన
-డెంగీని నిర్ధారించాల్సింది ప్రభుత్వ వైద్యులే
-సర్కారు వైద్యులకు సెలవులు రద్దు
-కరీంనగర్, పెద్దపల్లిలో వైద్యశాఖపై సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అనవసర భయాలు కల్పిస్తూ, అవసరం లేని పరీక్షలు నిర్వహిస్తూ వైద్యం చేస్తున్న కొందరు ప్రైవేట్ వైద్యులను నియంత్రించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జ్వరం వచ్చిన వారికి అసలు చికిత్స చేయకుండా లేనిపోని పరీక్షలు చేస్తూ కొందరు వైద్యులు భయానికి గురిచేస్తున్నట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయనీ, ఇలాంటి వారిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ అశోక్‌తో కలిసి శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో మున్సిపల్, పంచాయతీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి కలెక్టరేట్‌లో చిన్నారులకు రోటా వైరస్ వ్యాక్సిన్ వేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలో ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ నిధులు రూ.7.8 కోట్లతో చేపట్టనున్న 50 పడకల అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయాచోట్ల మంత్రి ఈటల మాట్లాడుతూ.. డెంగీని నిర్ధారించే అధికారం ప్రైవేట్ వైద్యులకు లేదన్నారు.

ప్రభుత్వ వైద్యులు మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారించాలని, అదీ కూడా అనుమానం ఉన్నట్టుగానే స్పష్టం చేయాలన్నారు. కొందరు ప్రైవేట్ వైద్యులు అనవసరమైన వైద్య పరీక్షలు చేయిస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అలాంటిది ఉంటే వైద్యారోగ్య శాఖ అధికారులు నియంత్రించాలని సూచించారు. ప్రైవేట్ దవాఖానల నుంచి రోజూ నివేదికలు తెప్పించుకోవాలనీ, రోజూఎంతమంది జ్వర పీడితులు వైద్యం కోసం వస్తున్నారు?, అవి ఎలాంటి జ్వరాలు?, డెంగీ, మలేరియా వంటి అనుమానాలు ఉన్నాయా? అనే విధంగా ఈ నివేదికలు ఉండాలన్నారు. జ్వరాల నియంత్రణకు అవసరమైన చోట ఐఎంఏ, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ వైద్యులకు సెలవులు రద్దు చేశామని, వైద్యులు అందుబాటులో లేరని ఏ ఒక్క చోటునుంచి ఫిర్యాదులు రాకూడదన్నారు. ప్రతి పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో ఉండి జ్వర పీడితులకు చికిత్సలు అందించాలన్నారు. పరిస్థితి విషమించిన వారినే ఏరియా దవాఖానలకు పంపించాలని ఆదేశించారు. జ్వరాలను అరికట్టేందుకు ఎంబీబీఎస్ స్థాయి వైద్యులు సరిపోతారన్నారు.

ఇవి సీజనల్ వ్యాధులే..

అపరిశుభ్రత వల్ల కొన్నిచోట్ల విషజ్వరాలు వ్యాపిస్తున్నట్టు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయనీ, కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదని మంత్రి ఈటల స్పష్టం చేశారు. సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులే తప్ప, కొత్తగా ఏమీ లేదన్నారు. రాజకీయ స్వలాభం కోసమే ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకే తాను నాలుగు రోజులుగా 13 జిల్లాల్లో పర్యటించినట్టు చెప్పారు. సమీక్షలు, ఆయా కార్యక్రమాల్లో కరీంనగర్, పెద్దపల్లి జెడ్పీ చైర్‌పర్సన్లు కనుమల్ల విజయ, పుట్ట మధూకర్, కరీంనగర్, పెద్దపల్లి కలెక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్, శ్రీదేవసేన, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ దవాఖానకు పోతే.. ప్రాణం మీదికొచ్చింది

-తనను ఆదుకోవాలని మంత్రి ఈటలకు ఓ బాధితురాలి విన్నపం
Etela1
కాన్పుకోసం ప్రైవేటు దవాఖానలో చేరితే వచ్చీరాని వైద్యంతో తన జీవితాన్ని నాశనం చేశారని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన సౌజన్య వాపోయింది. శుక్రవారం పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నది. నాలుగు నెలల క్రితం పెద్దపల్లిలోని ఓ ప్రైవేటు దవాఖానలో ప్రసవం కోసం చేరగా, అక్కడి వైద్యురాలు ఇచ్చిన ఇంజెక్షన్లతో తన మెదడుతో సహా నాడీ మండలం పూర్తిగా దెబ్బతిన్నదని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది. దీంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యానని, తనకు న్యాయంచే యాలని విన్నవించింది. స్పందించిన మం త్రి ఈటల సదరు దవాఖానపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రసవ సమయంలో బాధితురాలికి ఇచ్చిన మందు ల వివరాలపై విచారణ జరిపించాలన్నారు. పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్న సౌజన్యకు దివ్యాంగుల పింఛన్‌తోపాటు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు. దవాఖాన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

1096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles