రాష్ర్టానికి మూడు వైద్యకాలేజీలు ఇవ్వాలి

Wed,November 20, 2019 02:36 AM

-కేంద్రానికి మంత్రి ఈటల ప్రతిపాదన
-సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్
-రెండు సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌ల మంజూరును కోరాం
-ఢిల్లీలో మీడియాతో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కొత్తగా రెండు లేదా మూడు ప్రభుత్వ వైద్యకళాశాలలను ఏర్పాటుచేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కలిసి రాష్ట్రం తరఫున ప్రతిపాదనలు చేసినట్టు ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో వైద్యరంగం పురోభివృద్ధి కోసం ఆరోగ్యశ్రీ, మెడికల్ కాలేజీలు, ట్రామా కేర్ సెంటర్, రీజినల్ క్యాన్సర్ సెంటర్లు, సూపర్‌స్పెషాలిటీ బ్లాక్ వంటి ఐదు అంశాల్లో సాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.

దేశవ్యాప్తంగా 75 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేస్తామని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం (భద్రాచలం), భూపాలపల్లి, వికారాబాద్ (తాండూరు) జిల్లాల్లో కనీసం రెండు లేదా మూడు వైద్యకళాశాలలను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశామని, కనీసం మూడు వైద్యకళాశాలలను తెలంగాణకు ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. త్వరలోనే డీపీఆర్ తయారుచేసి పంపిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. ఆదిలాబాద్, వరంగల్‌లో రెండు రీజినల్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటుచేయాలని కోరినట్టు తెలిపారు.
etella1
రాష్ట్రంలో రెండు సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లు మంజూరుచేయాలని.. వాటిని గాంధీ, నిలోఫర్, ఉస్మానియాలో ఎక్కడైనా ఏర్పాటుచేస్తామని తెలిపినట్టు చెప్పారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై 11 ప్రాంతాల్లో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటుచేయాలని విన్నవించామన్నారు. తెలంగాణలో పేదల ఆరోగ్యం కోసం సంవత్సరానికి రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ పథకాన్ని మంచిగా అమలుచేస్తున్నా.. కేంద్రప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలుచేయాలని చెప్తున్నదని తెలిపారు. రాష్ర్టాల అవసరాల దృష్ట్యా సహకరించాలని కోరినట్టు ఈటల వివరించారు. వైద్యరంగంలో గొప్ప గొప్ప కార్యక్రమాలు అమలుచేయడంలో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో ఉన్నదని, రాష్ర్టానికి అనేక అవార్డులు వచ్చాయని ఆయన తెలిపారు. దేశానికి ఆదర్శంగా ఉన్న రాష్ర్టాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని కోరినట్టు పేర్కొన్నారు. ఆధునిక ల్యాబ్‌లు, స్కాన్‌సెంటర్లు ఏర్పాటుచేస్తేనే అందరికీ ఆరోగ్యం సాధ్యమవుతుందని కేంద్రమంత్రికి తెలియజేశామని మంత్రి ఈటల తెలిపారు.

1352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles