ప్రజారోగ్యానికి ప్రాధాన్యం

Sat,December 14, 2019 03:26 AM

- కార్పొరేట్‌కు దీటుగా సర్కారు దవాఖానలు
- వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
- ఎర్రగడ్డ చెస్ట్ దవాఖానలో ఆర్‌ఐసీయూ ప్రారంభం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చే కార్యక్రమాలను అమలుచేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఎర్రగడ్డ చెస్ట్ దవాఖాన లో నిర్వహించిన పల్మనాలజిస్టుల (ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి నిపుణులు) సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు చెస్ట్ దవాఖానలో ఆర్‌ఐసీయూను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, నన్నపునేని నరేందర్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబాఫసియొద్దీన్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, డీఎంఈ, టీవీవీపీ కమిషనర్ కే రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జీ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం వైద్యసేవలు, మందులు అందించడమే కాకుండా వ్యక్తుల ఆరోగ్యపరిరక్షణకు ఎంతోప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పా రు. ఇందులో భాగంగానే మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధ జలం అందించి ఆరోగ్యంగా జీవనం సాగించేలా దృష్టి సారించామన్నారు. హైదరాబాద్ లో సరఫరాచేస్తున్న విధంగానే గిరిజన తండా లు, చెంచుపెంటల్లోనూ స్వచ్ఛనీరు అందిస్తున్నామని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్‌పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అమలుచేస్తున్నదని పేర్కొన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధిపరచి వాతావరణ సమతుల్యానికి కృషిచేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో అద్భుతమైన వైద్యసేవలు అందించే దవాఖానలున్నాయని, నిజాం కాలంనుంచే ఉస్మానియా ఆర్థోపెడిక్ దవాఖాన, నిమ్స్, చెస్ట్ దవాఖాన వంటివి సేవలందిస్తున్నట్టు చెప్పారు. గ్లోబలైజేషన్ కారణంగా ఆఫ్రికాలో ఉండే రోగాలు ఇక్కడికి.. ఇక్కడ ఉండేవి ఆఫ్రికాలో వస్తున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యనిపుణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. భవిష్యత్‌లో చెస్ట్ దవాఖానలో మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందిస్తామని, ఐసోలేటెడ్, ఐసీయూ వార్డులను విస్తరిస్తామని చెప్పారు. వైద్యరంగంలో తెలంగాణ మెరుగైన సేవలను అందిస్తూ మిగిలిన రాష్ర్టాలను తలదన్నేలా ఉచితంగా వైద్యం అందిస్తున్నదని తెలిపారు. బస్తీ దవాఖానల్లో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు, గంటలోనే వ్యాధి నిర్ధారణకు అన్ని జిల్లాల్లో పాథలాజికల్ ల్యాబ్స్ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
Etela-Rajender

వైరస్‌ల గుర్తింపునకు పరిశోధన కేంద్రం

- ఎన్సీడీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు: ఈటల
ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ దేశాలు, ప్రాంతాల నుంచి వైరస్ వ్యాపిస్తున్నదని, ఈ తరుణంలో అన్నిరకాల వైరస్‌లను గుర్తించేందుకు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) ఆధ్వర్యంలో ల్యాబ్, పరిశోధనా కేం ద్రం ఏర్పాటుచేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం తో శుక్రవారం కోఠిలోని వైద్య, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర ప్రభు త్వ సలహాదారు కేఎల్ రమేశ్, కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ సీనియర్ రీజినల్ డైరెక్టర్ అనూరాధ, ఎన్సీడీసీ ప్రతినిధులు మధుమిత, జయకరణ్, ప్రజారోగ్యశాఖ సంచాలకుడు జీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ.. ఎన్సీడీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనున్న ల్యాబ్, పరిశోధన కేంద్రంలో విస్తరిస్తున్న వైరస్‌లన్నింటినీ గుర్తించి, పరిశోధిస్తారని, వారంరోజుల్లో ల్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. కొత్తగా వచ్చే వైరస్‌లను గుర్తించేందుకు ప్రస్తుతం పుణె, ఢిల్లీ ల్యాబ్‌లకు పంపాల్సి వస్తున్నదని, ఈ పరిశోధన కేంద్ర ఏర్పాటుతో ఆ అవసరం ఉండదన్నారు. ఎన్సీడీసీ ల్యాబ్, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలకు కేంద్రం సాయంచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం కోఠిలోని వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ కార్యాలయం ప్రాంగణంలోని ఒక భవనంలో తాత్కాలికంగా ఈ ల్యాబ్ సేవలు ప్రారంభిస్తామని వెల్లడించారు.

704
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles