మంత్రి ఈటల గొప్ప మనసు


Tue,September 11, 2018 01:42 AM

etela rajender help to jharkhand people

-జార్ఖండ్‌వాసులకు ఆపన్నహస్తం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. జార్ఖండ్‌కు చెందిన దంపతులకు ఆపన్నహస్తం అందించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న నమస్తే తెలంగాణ సీనియర్ జర్నలిస్టు సలీముద్దీన్‌ను మంత్రి ఈటల రాజేందర్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడే జార్ఖండ్‌కు చెందిన దంపతులు తమ కొడుకును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలుసుకొని చలించిపోయారు. వాళ్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారు జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన చిరువ్యాపారులు. కొడుకు విశాల్ కొరియా (26)కు కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నగరంలోని పలు దవాఖానల చుట్టూ తిరిగారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో ఆగస్టు 9న సోమాజిగూడ యశోద దవాఖానలో చేర్చారు. ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో ఆ యువకుడు సోమవారం మృతిచెందాడు.

ఆ దంపతులు రాంచీలోని తమ ఇల్లు అమ్మగా వచ్చిన రూ.30 లక్షలను కొడుకు వైద్యం కోసం ఖర్చుచేశారు. చివరికి దవాఖాన బిల్లు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. దవాఖానలో రూ.5 లక్షల వరకు బిల్లు పెండింగ్‌లో ఉన్నది. ఈ విషయాన్ని వారు మంత్రి ఈటల రాజేందర్‌కు వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి దవాఖాన యాజమాన్యంతో మాట్లాడారు. పెండింగ్ బిల్లు తాను చెల్లిస్తానని, విశాల్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు. దీంతో దవాఖాన యాజమాన్యం మృతదేహాన్ని ఆ దంపతులకు అప్పగించింది. ఆపద సమయంలో మీరు చేసిన సాయం జన్మలో మరిచిపోలేమంటూ విశాల్ తల్లిదండ్రులు, బంధువులు మంత్రి ఈటలకు కృతజ్ఞతలు తెలిపారు. ముక్కూమొఖం తెలియకున్నా, మన రాష్ట్రం కానివారైనా ఆపదలో ఉన్నారని తెలసుకొని చేయూతనందించిన మంత్రి ఈటల గుణాన్ని దవాఖానకు వచ్చినవారు మెచ్చుకున్నారు.

1582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS