బకాయి 457 కోట్లే


Tue,August 20, 2019 04:07 AM

Etela Rajender condemns doctors statements on Aarogyasri

-ఆరోగ్యశ్రీపై కొన్నివర్గాల అబద్ధపు ప్రచారం
-రూ.1500 కోట్ల బకాయిలంటూ వదంతులు
-నాలుగున్నర నెలల్లోనే రూ.412.9 కోట్లు చెల్లింపులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్యపథకాలను అమలుచేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రజారోగ్యంపై నిబద్ధతను చాటుకుంటున్నారు. అందులోభాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తున్నది. ప్రతిష్ఠాత్మకమైన ఈ పథకానికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ. 457 కోట్లు మాత్రమే ఉండగా.. రూ.1500 కోట్లు బకాయిలున్నాయంటూ కొన్నివర్గాలు అబద్ధపు ప్రచారం కొనసాగిస్తున్నాయి. పనిగట్టుకొని పుకార్లు సృష్టిస్తున్నాయి. దీంతో చిన్న దవాఖానలు కొన్ని ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించే ముఖ్యమైన దవాఖానల్లో ఆటంకం లేకపోయినప్పటికీ.. నిరంతరాయంగా కొనసాగే ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్ పథకాల నిర్వహణకు సంబంధించి బకాయిలను మూడింతలు పెంచి అబద్ధపు ప్రచారం చేస్తుండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి వైద్య పథకాల నిర్వహణకు సంబంధించిన నిధుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరుగడంలేదు. ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నది. అయితే, ఈ ఏడాది వరుసగా శాసనసభ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల కోడ్, తదితర కారణాలతో కొంత జాప్యం ఏర్పడింది. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగున్నర నెలల్లోనే రాష్ట్రప్రభుత్వం రూ.రూ.412.9 కోట్లు చెల్లించింది. ఆరోగ్యశ్రీ నిరంతరాయంగా కొనసాగే పథకం. పేదలు ఎప్పటికప్పు డు సేవలు పొందుతూనే ఉంటారు. దీంతో ప్రభుత్వం నిధుల చెల్లింపు జరుపుతున్నప్పటికీ బకాయిలు ఏర్పడుతుండటం సహజం. వాస్తవంగా చూస్తే వైద్యసేవలకు సంబంధించిన చెల్లింపునకు సంబంధించి ప్రైవేటు దవాఖానలకు రూ.457.74కోట్లు మాత్రమే బకాయి ఉన్నది. ఆ మొత్తంలో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 344.17 కోట్లు, ఈజేహెచ్‌ఎస్ పథకం కింద రూ.113.57కోట్లు ఉన్నట్లు వైద్య విభాగాలు నిర్ధారించాయి. వాస్తవ పరిస్థితులను ప్రజలు గుర్తించాల్సిందిగా సంబంధిత విభాగాలు సూచించాయి.

మానవీయ కోణంలో ఆలోచించాలి

రాష్ట్రంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్లలో ఆరోగ్యశ్రీ సేవలు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి సమస్యా లేదు. వైద్యులు వ్యాపార ధోరణితో కాకుండా మానవీయ కోణంలోనూ ఆలోచించాలి. ఆరోగ్యశ్రీ కింద రూ.1500 కోట్లు బకాయి ఉన్నట్టు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ప్రైవేటు దవాఖానలకు రూ.457.74 కోట్లు మాత్రమే బకాయి ఉన్నది. అందులో ఆరోగ్యశ్రీ కింద రూ.344.17 కోట్లు, ఈజేహెచ్‌ఎస్ కింద రూ.113.57 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఈ బకాయిలను విడుతలవారీగా చెల్లించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ప్రజలు ఆందోళనకు గురికావద్దు.
e-rajender3
- వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రాజేందర్

dr-nagendhar

ఆరోగ్యశ్రీపై చింతించాల్సిన అవసరం లేదు: డాక్టర్ నాగేందర్

కొన్ని ప్రైవేటు దవాఖానల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సలు అందకపోవడంతో రోగులు చింతించాల్సిన అవసరం లేదని, ఉస్మానియాతోపాటు, అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని ఉస్మానియా దవాఖాన సూపరిండెంట్ డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లోనూ మెరుగైన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎప్పటిలాగే రోగులకు 24 గంటలు చికిత్సలు అందుబాటులో ఉంటాయని సూచించారు.
e-rajender2

1388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles