పుట్టినగడ్డకు చేయూతనివ్వండి


Sun,July 21, 2019 02:43 AM

Etela rajender and Errabelli Participated In Kmc Diamond Jubilee Closing Ceremony

-మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపు
-అట్టహాసంగా కేఎంసీ వజ్రోత్సవాల ముగింపు సమావేశాలు ప్రారంభం

వరంగల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్నవారు పుట్టిన, పెరిగిన ప్రాంతాల అభివృద్ధికి చేయూతనివ్వాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వంచేసే అభివృద్ధి కార్యక్రమాలకు తోడు.. దేశ, విదేశాల్లో ఉన్నవారు ముందుకొచ్చి పుట్టిన గడ్డ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు. శనివారం వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) వజ్రోత్సవాల ముగింపు సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కేఎంసీ ఆవిర్భవించి 60 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నాటి ప్రిన్సిపాల్ నుంచి దేశ, దేశాలనుంచి వచ్చిన వందలమంది పూర్వవిద్యార్థులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికమైన పాలన అందిస్తున్నదని అన్నారు. దేశం మొత్తం తెలంగాణవైపు ఆసక్తిగా చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పాలన సాగుతున్నదని తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజారోగ్యం పట్ల అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను మానవీయ స్పర్శతో సీఎం కేసీఆర్.. తెలంగాణలో ఆచరించి చూపుతున్నారని పేర్కొన్నారు.

దాదాపు ఇరవై నాలుగేండ్ల కింద కేఎంసీలో చదివిన విద్యార్థి లక్కిరెడ్డి హనిమిరెడ్డి.. అమెరికా వెళ్లినప్పుడు అడిగిన వెంటనే రూ.కోటి విరాళంగా ఇచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గుర్తుచేశారు. కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం దవాఖానకు హనిమిరెడ్డి మాదిరిగా ప్రముఖులు ముందుకురావాలని కోరారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ పేరు మీద బ్యాంకు ఖాతా తెరుస్తామని, విరాళాలు ఇచ్చినవారి పేర్లు, ఫొటోలు తప్పకుండా వారి సేవలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా చూసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు డాక్టర్ టీ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, నగర మేయర్ గుండా ప్రకాశ్, జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌రావు, వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, ఎంజీఎం సూపరింటెండెంట్ బీ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సత్కరించారు.

338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles