మూగబోయిన సాహిత్యనిధి


Sun,October 14, 2018 02:20 AM

Eminent Vedic scholar Nallan Chakravarthula Raghunatha Charyulu passes away

-రఘునాథాచార్యులు అస్తమయం
-ఆధ్యాత్మిక ప్రపంచానికి ఇది తీరని లోటు
-సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
-ఉభయ వేదాంత పండితులు శ్రీరఘునాథాచార్యులు అస్తమయం
-జీయర్‌స్వాములతోపాటు ఎందరో శిష్యులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది

ఖిలావరంగల్: ప్రముఖ పండితుడు, ఆధ్యాత్మిక, సామాజిక, సాహిత్య అంశాలపై అనేక రచనలుచేసిన సాహిత్యనిధి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరఘునాథాచార్యులు(92) శనివారం కన్నుమూశారు. అధీతి బోధ, ఆచరణ ప్రసారణములు, అనుచతురుర్వర్గాన్ని ఎక్కువతక్కువలు లేకుండా పా టించి, అద్భుత పాండిత్యాన్ని కలిగిన మహనీయు లు రఘునాథాచార్యులు ఇకలేరు. మహామహోపాధ్యాయ, కవిశాబ్దికకేసరి, శాస్త్రరత్నాకర, ఉభయవేదాంత పండితులు తదితర బిరుదులతో భూషితులైన శ్రీరఘునాథాచార్యుల మరణవార్త తెలిసి అశే ష భక్తజనవాహిని, శిష్యకోటి వరంగల్ శివనగర్‌లోని ఆయన స్వగృహానికి తరలివచ్చారు.ఆయన భార్య సీతమ్మ, కూతుళ్లు శ్రీదేవి, నీలాదేవి, గోదాదేవి, శేషమ్మలను పరామర్శించారు. శ్రీ రఘునాథాచార్యులు కృష్ణాజిల్లా గుడివాడకు సమీపంలోని మోటూరు గ్రామంలో 1 మే 1926న జన్మించారు. తండ్రి వద్ద సంస్కృతం, దివ్యప్రబంధాలు, సాంప్రదాయిక తదితర విషయాలను 1942 వరకు అభ్యసించారు.

1942-45 వరకు హైదరాబాద్ సీతారాంబాగ్‌లోని శ్రీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో విద్యనభ్యసించారు. 1966 వరకు వరంగల్‌లోని వైదిక కళాశాలలో ప్రధానాధ్యాపకులుగా, వరంగల్ శ్రీ విశ్వేశ్వర సంస్కృత ఆంధ్ర కళాశాలలో సంస్కృతోపన్యాసకులుగా పనిచేశారు. వివిధ భాషల్లో అరవైకిపైగా గ్రంథాలను, వ్యాసాలను రచించారు. ఉత్తరరామ చరిత్రకు శ్రీకుమార తాతాచార్యవ్యాఖ్య, శ్రీ కృష్ణ బ్రహ్మతంత్ర పరకాల మునీంద్రుని అముద్రిత వ్యాఖ్య తదితర అపూర్వ సంస్కృత గ్రంథాలపై పరిశోధనలు చేశారు. జీయర్‌స్వాములతోపాటు ఎందరో శిష్యులను మహోన్నతులుగా తీర్చిదిద్దారు. రఘునాథాచార్యుల భౌతికకాయానికి వరంగల్‌లోని శిరంగి రాజారాం తోటలోని శ్మశానవాటికలో శనివారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పెద్ద కూతురు శ్రీదేవి కుమారుడు శ్రీనివాసాచార్యులు (సీనప్ప) అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

raghunatha-charyulu2

ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరనిలోటు: సీఎం కేసీఆర్

ప్రముఖ సంస్కృత పండితులు కవిశాబ్దిక కేసరి మహామహోపాధ్యాయ శ్రీరఘనాథాచార్య మర ణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటని సీఎం కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలా, సంప్రదాయ పరంపరను కొనసాగిస్తూ జీయర్‌స్వాములతోపాటు ఎందరో శిష్యులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఆచార్యులవారు సత్సంప్రదాయ పరిరక్షణకు ఆహర్నిశలు కృషిచేశారని శ్లాఘించారు. ఆజన్మాంతం విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారంచేసి, తన ప్రవచన పరంపరతో ప్రతీ ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనీషి అంటూ నివాళులర్పించారు. రఘునాథాచార్య కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

2098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles