ప్రకృతికి రంగులద్దిన ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాశ్ కన్నుమూత


Thu,May 23, 2019 01:54 AM

Eminent artist Surya Prakash passes away in Hyderabad

-కొంతకాలంగా అనారోగ్యం.. గుండెపోటుతో తుదిశ్వాస
-ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం.. పలువురు చిత్రకారుల నివాళి
-జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు

బంజారాహిల్స్/హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ కుంచె పనితనాన్ని ప్రపంచానికి చాటిన కళాకారుడు ఇక లేడు! తన రంగులతో ఒక కొత్త ప్రకృతిని సృష్టించిన వర్ణ నిపుణుడు సెలవన్నాడు! అనేక అంతర్జాతీయ నగరాల్లో ప్రత్యేక వ్యక్తిగత ప్రదర్శనలతో ఆకట్టుకున్న తెలంగాణ బిడ్డ.. ప్రఖ్యాత చిత్రకారుడు సీహెచ్ సూర్యప్రకాశ్ (80) అస్తమించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ప్రభ, కుమార్తె ఉన్నారు. సూర్యప్రకాశ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయస్థాయి ఖ్యాతిని ఆర్జించిపెట్టిన చిత్రకారుడిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.

సూర్యప్రకాశ్ కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సూర్యప్రకాశ్ మరణవార్త తెలుసుకున్న పలువురు చిత్రకారులు, ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఎల్వీ ప్రసాద్ దవాఖాన చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావు, ఎండీ రమేశ్‌ప్రసాద్, ప్రముఖ చిత్రకారులు లకా్ష్మగౌడ్, ఏలె లక్ష్మణ్, కవితా దేవస్కర్, అంజనీరెడ్డి, రాజేశ్వర్‌రావు, నగేశ్‌గౌడ్ తదితరులు సూర్యప్రకాశ్ మృతదేహానికి నివాళులర్పించినవారిలో ఉన్నారు. సాయంత్రం ఆరుగంటలకు సూర్యప్రకాశ్ పార్థివదేహానికి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.

SURYA-PRAKASH2

దేశవిదేశాల్లో ప్రదర్శనలు

ఖమ్మం జిల్లా మధిరలో జన్మించిన సూర్యప్రకాశ్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఫైనార్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో ఫైనార్ట్స్ చదివారు. 1961 నుంచి 1964 దాకా ఏపీ సమాచారశాఖలో ఉద్యోగం చేశారు. చిత్రకళపై ఉన్న మక్కువతో ఉద్యోగానికి రాజీనామాచేసిన సూర్యప్రకాశ్ ఢిల్లీకి వెళ్లి, ప్రఖ్యాత చిత్రకారుడు శ్రీరాంకుమార్ వద్ద ఆరునెలలు శిక్షణ పొందారు. అనంతరం దేశవిదేశాల్లో అనేక చిత్రకళా ప్రదర్శనలను ఏర్పాటుచేశారు. సూర్యప్రకాశ్ కృషికి గుర్తింపుగా పలు సంస్థలు అనేక అవార్డులతో ఆయనను గౌరవించాయి. 1971-1996 మధ్యకాలంలో ప్యారిస్, వాషింగ్టన్, టోక్యో, లండన్ తదితర నగరాల్లో సూర్యప్రకాశ్ తన పెయింటింగ్స్‌తో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలు ఎంతగానో అకట్టుకున్నాయి. సూర్యప్రకాశ్ జీవితంపై ఒక డాక్యుమెంటరీ ఫిలిమ్ కూడా వచ్చింది. ఏ జర్నీ బియాండ్ కలర్స్ అనే పుస్తకాన్ని సూర్యప్రకాశ్ రచించారు. ఈ పుస్తకం మంచి ప్రాచుర్యం పొందింది.

ఈ పుస్తకం రచించినందుకు న్యూఢిల్లీలోని ఆలిండియా ఫైనార్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వారు కళావిభూషన్ అవార్డును ప్రదానంచేశారు. సీసీఎంబీతోపాటు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ దవాఖానలో రెసిడెంట్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన సమయంలో సూర్యప్రకాశ్ వేసిన చిత్రాలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు ఎంఎఫ్ హుస్సేన్‌తోపాటు అనేకమందిని నగరానికి తీసుకువచ్చి, వర్ధమాన చిత్రకారులకు శిక్షణ ఇప్పించిన ఘనత సూర్యప్రకాశ్‌కు దక్కింది. ఆయన వేసిన అనేక చిత్రాలను సీసీఎంబీ, ఎల్వీ ప్రసాద్ దవాఖానలో ఏర్పాటుచేశారు.

544
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles