అంతా డబుల్


Mon,January 21, 2019 02:05 AM

Electoral identity cards of two states in 12 villages

-12 గ్రామాల్లో రెండు రాష్ర్టాల ఎన్నికల గుర్తింపు కార్డులు
-రెండుసార్లు పంచాయతీ ఎన్నికలు.. ఇద్దరేసి సర్పంచ్‌లు
-తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద గ్రామాల్లో వింత పరిస్థితి

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సాధారణంగా ఒక గ్రామానికి ఒకే సర్పంచ్ ఉంటాడు.. ఐదేండ్లకు ఒకసారి సర్పంచ్ ఎన్నికలు జరుగుతుంటాయి.. ఓటర్లకు ఒకే రాష్ర్టానికి చెందిన ఓటర్‌ఐడీ ఉంటుంది.. కానీ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న 12 గ్రామాల్లో మాత్రం అంతా డబుల్. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ రెండు రాష్ర్టాల ఓటర్ గుర్తింపు కార్డులు ఉంటాయి. రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాయి. ఓటర్లు రెండుసార్లు ఓటేసి తమ సర్పంచ్‌లను ఎన్నుకుంటారు. ఇలా ఆ గ్రామాల్లో 40 ఏండ్లుగా ఇద్దరు సర్పంచ్‌ల పాలన సాగుతున్నది. ప్రస్తుతం తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఇక్కడి ఓటర్లు సిద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడ అంతాపూర్, పరంధోళి అనే రెండు గ్రామ పంచాయతీలు ఉండేవి.

తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పునర్విభజన చేయడంతో అంతాపూర్, పరంధోళితోపాటు ముకద్ధంగూడ, బోలాపటార్ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. అంతపూర్‌లో 462 మంది ఓటర్లు, పరంధోళిలో 605 మంది, ముకద్ధంగూడలో 482 మంది, బోలాపటార్‌లో 632 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ రెండు రాష్ర్టాలకు చెందిన ఓటరు కార్డులు ఉన్నాయి. ఈ పంచాయతీలకు మూడో విడుతలో పోలింగ్ జరుగనుంది.

రెండు రాష్ర్టాల సంక్షేమ పథకాలు అమలు

కెరమెరి మండలంలోని ఈ 12 గ్రామాల పరిధిలో తెలంగాణకు చెందిన భూములు ఉండగా, ఇక్కడ నివసిస్తున్న గిరిజనులు, ఇతర జాతుల వారు మహారాష్ట్రకు చెందిన వారు. 1952లో భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు సమయంలో మహారాష్ర్టాలోని తెలుగు మాట్లాడేవారిని ఆంధ్రప్రదేశ్‌లో (ప్రస్తుత తెలంగాణ) కలుపగా.. ఇక్కడ హిందీ మాట్లాడే వారిని మహారాష్ట్రలో కలిపారు. ఈ సమయంలో రెండు రాష్ర్టాల మధ్య భౌగోళికంగా సరిహద్దు ఎక్కడివరకు ఉన్నదో స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ 12 గ్రామాలు నేటికీ సమస్యాత్మకంగానే మిగిలిపోయాయి.
Votor-cards
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ వివాదాస్పద గ్రామాలు తెలుగు రాష్ర్టానికి చెందినవేనని తీర్పు చెప్పింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది. ఈ గ్రామాలు రెండు రాష్ర్టాల పరిధిలోకి వస్తుండటంతో రెండు ఓటరు గుర్తింపుకార్డులతోపాటు మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమ పథకాలు కూడా పొందుతున్నారు. అంతేకాదు ఇక్కడ రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు నిర్వహించే పాఠశాలలు నడుస్తున్నాయి. తమకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని, ఏదో ఒక రాష్ట్రంలో కలుపాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

రెండు ఓట్లు, ఇద్దరు సర్పంచ్‌లు

ఇక్కడ అందరికీ తెలంగాణ, మహారాష్ట్ర ఓట్లు ఉన్నాయి. రెండుసార్లు ఓటుహక్కు వినియోగించుకుంటాం. ప్రతి పంచాయతీకి ఇద్దరు సర్పంచ్‌లు ఉన్నారు. రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను వినియోగించుకుంటున్నాం. మమ్మల్ని తెలంగాణలో కలుపాలని అనేకసార్లు విన్నవించాం.
- కాంబ్లె లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరంధోళి

తెలంగాణలోనే కలపాలి

మా 12 గ్రామాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి. కాబట్టి మమ్మల్ని తెలంగాణలోనే కలపాలని కోరుతున్నాం. మా గ్రామాల్లో అనేక కార్యక్రమాలు అమలవుతున్నా ఆశించినవిధంగా అభివృద్ధి జరుగడంలేదు. తెలంగాణలో కలిపితేనే మాకు లాభం.
- కాంబ్లె ప్రభు, బోలాపటార్, మాజీ సర్పంచ్

2140
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles