ఆధారాలు లేకుండానే పేరు మార్పు


Mon,June 17, 2019 01:48 AM

Elderly Farmer suffer Revenue Officer Neglect For Land Registration

-సమాచారమివ్వకుండానే ఇతరులకు పట్టా
-న్యాయం చేయాలంటూ వృద్ధ రైతు ఆవేదన

యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారం గ్రామానికి చెందిన ఆది రామస్వామికి ఏకైక కూతురు మల్లమ్మను 1957లో బీబీనగర్ మండలంలోని వెంకిర్యాలకు చెందిన మార్త యాదగిరికి ఇచ్చి పెండ్లిచేశారు. ఆది రామస్వామికి గుండాల మండలం అనంతారం లో 7.07 ఎకరాల భూమి ఉన్నది. సర్వే నంబర్ 46/ఇలో 2.39 ఎకరాలు, 45/ఆలో 17 గుంటలు, 44/ఇలో 18 గుంటలు, 38/ఇలో 2.06 ఎకరాలు, 46/ఉలో 2.39 ఎకరాలు, 46/ఇ/1లో 1.07 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని కూతురైన మల్లమ్మ పేరిట రిజిస్టర్‌చేసి ఇచ్చాడు. మల్లమ్మ 2013లో మృతి చెందారు. నాటినుంచి 2017 వరకు 1-బీ నమూనాలో మల్లమ్మ పేరు కొనసాగుతూనే ఉన్నది. అయితే సర్వే నంబర్ 46/ఇ/1లోని 1.07 ఎకరాల భూమిని మల్లమ్మ నుంచి ఆది సాయిలు పేరుపై మార్చారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూమిని సాయిలు పేర ఎలా చేశారని మల్లమ్మ భర్త మార్త యాదగిరి తాసిల్దార్‌ను వివరణ కోరినా ఎలాంటి స్పందన రాలేదు. హైకోర్టుకు వెళ్లినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. ముగ్గురు తాసిల్దార్లు మారినా మల్లమ్మ కుటుంబం సభ్యుల సమస్య పరిష్కారం కానేలేదు. తాజాగా గుండాల తాసిల్దార్‌కు 46/ఇ/1లో గల 1.07 ఎకరాలను ఎలా బదిలీ చేశారో అడుగగా ఎటువంటి పత్రాలు లేకుండానే భూమి పట్టా బదిలీ అయినట్టు తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న పట్టా మార్పుపై పూర్తి ఆధారాలు ఇవ్వాలని కోరితే పట్టించుకోలేదు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి భూమిపై తగు విచారణ జరిపి తమకు న్యాయంచేయాలని మల్లమ్మ భర్త మార్త యాదగిరి ధర్మగంటను ఆశ్రయించారు.

సాదాబైనామా ఆధారంగా పట్టామార్చాం

మల్లమ్మ బతికున్నప్పుడు ఆ భూమిని ఆది సాయిలు సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసినట్టు ఆధారాలున్నాయి. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా సాదాబైనామా సమస్యలను అధిగమించాలన్న ఉద్దేశంతో మల్లమ్మ పేరిట సర్వే నంబర్ 46/ఇ/1లో ఉన్న 1.07 ఎకరాల వ్యవసాయ భూమిని సాదాబైనామా ఆధారంగా ఆది సాయిలు పేరిట మార్చాం.
- గంగాభవాణి, తాసిల్దార్ గుండాల మండలం
238
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles