ఈజిప్టు మమ్మీ మనకే


Sun,August 25, 2019 02:29 AM

Egyptian mummy in Telangana requires restoration

-ఆంధ్రప్రదేశ్‌కు బుద్ధుడి చితాభస్మం
-పురావస్తు ఆస్తుల విభజనకు కసరత్తు మొదలు
-1956కు ముందున్న ఎగ్జిబిట్లన్నీ ఇక్కడే
-తరువాత కొనుగోలుచేసినవి చెరిసగం
-సిద్ధమవుతున్న ఎగ్జిబిట్ల జాబితా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ఐదేళ్లు దాటినానప్పటికీ పరిష్కారంకాని సమస్యలు, విభజనకు నోచుకోని అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పురావస్తుశాఖకు చెందిన ఆస్తులు, ఎగ్జిబిట్లు కూడా ఈ కోవలోనివే. ఇటీవల వీటి పంపకాలకు కసరత్తు మొదలుపెట్టిన పురావస్తుశాఖ అధికారులు.. తమ పరిధిలోని విలువైన విగ్రహాలు, నాణేలు, అపురూపమైన వస్తువులు తదితర ఆస్తుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. 1956వ సంవత్సరం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోలుచేసిన ఎగ్జిబిట్లను వాటి విలువ ఆధారంగా విభజించి, చెరిసగం పంచనున్నారు. అంతకుముందున్న ఎగ్జిబిట్లన్నీ మన రాష్ర్టానికే దక్కనున్నాయి. హైదరాబాద్‌లోని ఆర్కియాలజీ మ్యూజియంలో ప్రదర్శిస్తున్న ప్రాచీన ఈజిప్టు మమ్మీని 1930లో ఏడో నిజాం కొనుగోలుచేసిన విషయం తెలిసిందే.

ఇది తెలంగాణకే చెందుతుందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో తవ్వకాల్లో లభ్యమైన శిల్పాలు, శాసనాలు, స్తంభాలు, నాణేలు కూడా మన మ్యూజియంలోనే ఉండనున్నాయి. ప్రస్తుతం తెలంగాణకు చెందిన కొన్ని శిల్పాలు, శాసనాలు ఏపీ మ్యూజియంలో ఉండగా, అక్కడ లభించిన కొన్ని ఎగ్జిబిట్లు ఇక్కడి మ్యూజియాల్లో ఉన్నాయి. తెలంగాణలోని ఫణిగిరి, నేలకొండపల్లిలో లభ్యమైన బుద్ధుడి విగ్రహాలను అమరావతిలో 2006లో జరిగిన కాలచక్ర ఉత్సవాల్లో ప్రదర్శించేందుకు తరలించారు. వీటిలో కొన్నింటిని తిరిగి స్టేట్ మ్యూజియానికి చేర్చినప్పటికీ మరికొన్ని అక్కడే ఉన్నట్టు తెలిసింది. నేలకొండపల్లి మహాస్థూపం వద్ద లభ్యమైన బుద్ధుడి విగ్రహాలు విశాఖపట్నం, విజయవాడ మ్యూజియాల్లో ఉన్నాయి. పురావస్తుశాఖ ఆస్తుల విభజనతో వీటిని కూడా వెనక్కి తీసుకురానున్నారు. ఏపీలోని విశాఖపట్నం శివారులో బావి కొండగుట్టపై 1980లో జరిపిన తవ్వకాల్లో మహాచైత్యం, భౌద్ధ విహారం వెలుగుచూశాయి. అక్కడ దక్షిణ దిక్కున చిన్నపాటి రాతి స్థూపం కింద లభించిన మట్టిపాత్రలో బంగారు, వెండి, ఇతర విలువైన చిన్న వస్తువులతోపాటు మరో పాత్రలో బూడిద ముక్కలు, చిన్న ఎముక లభించాయి. వీటిని అత్యంత విలువైన బుద్ధుడి చితాభస్మం, ఆయన శరీరంలోని ఎముకగా పరిశోధకులు గుర్తించి హైదరాబాద్ మ్యూజియంలో భద్రపరిచారు. విభజనలో భాగంగా వీటిని ఏపీకి తరలించనున్నారు.

2684
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles