బంద్‌లేదు.. రందీలేదు

Thu,October 10, 2019 03:43 AM

-ఐదోరోజు యథావిధిగా తిరిగిన బస్సులు
-రాష్ట్రవ్యాప్తంగా కనిపించని ఆర్టీసీ సమ్మె ప్రభావం
-ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు
-అధికారులతో రవాణాశాఖ మంత్రి అజయ్ సమీక్ష

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్ : ప్రజలకు పండుగ వేళ ప్రయాణ కష్టాలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. సమ్మె ప్రభావం కనిపించకుండా మంగళ, బుధవారాలు సైతం బస్సులు నడిచాయి. పండుగ పూర్తవడంతో తిరుగు ప్రయాణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అన్నిరూట్లలో ఎప్పటికప్పుడు సరిపడా బస్సులను పంపించింది. సక్రమంగా గమ్యస్థానాలకు చేరవేయడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

- కరీంనగర్ రీజియన్‌లోని నాలుగు జిల్లాల్లో బుధవారం యథావిధిగా నడిచాయి. బుధవారం 346 ఆర్ట్టీసీ, 203 అద్దె బస్సులు నడిపారు. 32 పాఠశాల, 50 కాం ట్రాక్టు క్యారియర్ బస్సులు, 245 మ్యాక్స్‌క్యాబ్‌లు తిరిగాయి. ఉదయం పదింటికే 530 బస్సులు డిపోల నుంచి బయలుదేరి వివిధ రూట్లలో నడిచాయి. ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ, ఆర్టీఏ, పోలీసు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. బ్రీత్ ఎనలైజర్ మిషన్లతో పరీక్షలు నిర్వహించి మరీ తాత్కాలిక డ్రైవర్లకు బస్సులు ఇస్తున్నారు. అలాగే, వివిధ రూట్లలో నడుస్తున్న ఆర్టీసీ, అద్దె బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలకు దిగుతున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తే తదుపరి విధుల్లోకి తీసుకోబోమని ఆర్‌ఎం పీ జీవన్‌ప్రసాద్ స్పష్టం చేశారు.. మంచిర్యాల జిల్లాలో బుధవారం 179 వాహనాలు నడిచినట్టు కలెక్టర్ భారతి హోళికేరి వెల్లడించారు.

bus-strike5

ఐదో రోజు యథావిధిగా..

సమ్మె ఐదోరోజు అన్ని జిల్లాల్లో బస్సులు యథావిధిగా తిరిగాయి. వరంగల్ రీజియన్ పరిధిలో 530 బస్సులు రోడ్డెక్కాయి. దాదాపు 69.28 శాతం ప్రయాణికులకు ఆర్టీసీ చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందుబాటులోకి వచ్చాయి. 309 మంది డ్రైవర్లు, 530 మంది కండక్టర్లతో 530 బస్సుల్ని ఆర్టీసీ నడిపింది. బస్సులకు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు డిపోల వద్ద ముందస్తు చర్యలు తీసుకున్నారు.

bus-strike3

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైట్‌రైట్

భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం, మణుగూరు డిపోల పరిధిలో బస్సులు నడిచాయి. పండుగపూట ప్రజలందరినీ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలన్న లక్ష్యంతో ఉదయం నుంచే వాహనాలు రోడ్డెక్కాయి. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వెళ్తుండటంతో 500 వాహనాలను నడిపింది. ఇందులో 119 ఆర్టీసీ బస్సులతోపాటు 65 అద్దెబస్సులున్నాయి. రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, ఎస్పీ సునీల్‌దత్, ఆర్‌టీవో రవీందర్, డీవీఎం శ్రీకృష్ణలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోలతోపాటు ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతూ ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చాయి. బుధవారం వివిధ డిపోల నుంచి ఉదయం 4 గంటలకు బస్సులు బయటికి వచ్చాయి. ఖమ్మం డిపోలో 79 సంస్థ, 57 అద్దె, సత్తుపల్లి డిపోలో 64 సంస్థ, 31 అద్దె, మధిర డిపోలో 32 సంస్థ 21 అద్దె బస్సులను ఆర్టీసీ అధికారులు పోలీసుల సహకారంతో విజయవంతంగా నడిపారు.

bus-strike4

ఉమ్మడి నల్లగొండలో 276బస్సులు

నల్లగొండ జిల్లాలో 276 బస్సులు ప్రయాణికులను ఆటంకం లేకుండా గమ్యస్థానాలకు చేరవేశాయి. నల్లగొండ డిపో నుంచి 42 ఆర్టీసీ, 35ప్రైవేటు, దేవరకొండ డిపో నుంచి 36 ఆర్టీసీ, మరో 26 ప్రైవేటు బస్సులు, నార్కట్‌పల్లి డిపో నుంచి 40 ఆర్టీసీ, 14 ప్రైవేటు, మిర్యాలగూడ డిపో నుంచి 46ఆర్టీసీ, 37ప్రైవేటు బస్సుల చొప్పున మొత్తం 276బస్సులు నడిపించారు. సూర్యాపేట, కోదాడ రెండు డిపోల పరిధిలో ఆర్టీసీ, హైర్ బస్సులు 210 బస్సులు ఉండగా 171 బస్సులు తిరుగుతున్నాయి. సూర్యాపేట డిపోలో 119 బస్సులకు గాను 53 ఆర్టీసీ, 45 అద్దె బస్సులు.. కోదాడలో 91 బస్సులకుగాను 42 ఆర్టీసీ, 31 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల్లో దాదాపు 80 వేల మంది ప్రయాణించారు. వీటికి తోడు జిల్లాలో 45 స్కూల్ బస్సులు, 10 కాంట్రాక్ట్ క్యారియర్ వాహనాలు, 152 మ్యాక్సీ క్యాబ్‌లు, 250 వరకు మోటార్ క్యాబ్‌లు నడుస్తున్నాయి.

యాదగిరిగుట్టలో నిరాంటంకంగా..

పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వస్తున్న భక్తులకు ఇక్కట్లు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యాదగిరిగుట్ట డిపోలో 95 బస్సులు, మరో15 బస్సులు అద్దె బస్సులు నడుస్తుండగా బుధవారం 45 ఆర్టీసీ బస్సులు, 15 అద్దె బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలతో కలిపి మొత్తం 155 వాహనాలు నడిపించారు.

6934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles