అందరికీ నాణ్యమైన విద్య

Fri,February 22, 2019 02:21 AM

-ప్రభుత్వ పాఠశాలల్లో.. గురుకుల తరహా విద్యాబోధన
-ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం
-నమస్తే తెలంగాణతో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రతి విద్యార్థి తన చదువు ముగించుకొని కళాశాల నుంచి బయటకు వెళ్లే సమయానికి.. ప్రపంచంలోనే ఎవరితోనైనా పోటీపడి తలెత్తుకుని నిలబడేలా దీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ విద్యావిధానానికి రూపకల్పన చేశారని చెప్పా రు. రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో గురుకుల తరహా బోధన అందుబాటులోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందేలా కృషిచేస్తానని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో తనకు రెండోసారి అవకాశం కల్పించడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..

జాతిని ముందుకు నడిపే బాధ్యత

విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉన్నది. వాస్తవానికి ఇప్పుడు నా బాధ్యత పెరిగింది. ఒక తరానికి పూర్తిగా వంద శాతం నాణ్యమైన విద్యను అందించగలిగితే ఆ జాతి ముందుకుపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యారంగాన్ని నాశనం చేశారు. గత ఐదేండ్లలో దానిని గాడిలో పెట్టే ప్రయత్నం చేసినం. ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమిస్తూ అందరికీ నాణ్యమైన విద్య అంది స్తాం. గురుకుల విద్యాలయాల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉన్నది. ఆ ఉద్దేశంతోనే కేసీఆర్ నాకు ఈ శాఖను అప్పగించారు.

సంక్లిష్టతలను తొలిగిస్తాం

విద్యారంగంపై సీఎంకు ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి. గత పాలకులు విద్యారంగంలో అవసరం లేకపోయినా వందలు.. వేల సంఖ్యలో జీవోలు తీసుకొచ్చారు. ఒక ఉపాధ్యాయుడు జీవితకాలంలో చదువలేనన్ని జీవోలు ఉన్నాయి. వీటిని మార్చాలని సీఎం భావిస్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖ పరిధిలో ఉన్న వేల సంస్థలను గాడిన పెట్టే ప్రయ త్నం జరుగుతున్నది. చదువు పూర్తయిన తర్వాత పిల్లలు ఇండ్లకుపోయి తల్లిదండ్రులకు భారం కాకూడదు. ఒకసారి కాలేజీ నుంచి బయటకు వెళ్తే.. ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడి తలెత్తుకొని నిలబడేలా తెలంగాణ యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతున్నది.

రాజీపడే ప్రసక్తే లేదు

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించే చర్యలు గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి. చట్టం ముందు అందరూ సమానులేనని సీఎం కేసీఆర్ నిరూపించారు. ఇంజినీరింగ్ కాలేజీల విషయంలో సొంత పార్టీ నాయకుల విద్యాసంస్థలనూ మూసివేసినం. ఎక్కడా రాజీపడలేదు. ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత విద్యాసంస్థల వరకు ప్రక్షాళన ప్రారంభమైంది. ఈ ప్రక్రియ కొనసాగుతుం ది. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులకు సంబంధించిన అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ప్రభు త్వ విద్యారంగాన్ని ప్రైవేట్‌కన్నా బలోపేతం చేయడం వల్ల ప్రజలంతా సర్కారు విద్యాసంస్థల్లో ప్రవేశాలకే మొగ్గుచూపుతారు. గతంలో మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం మంత్రుల దగ్గరికి సిఫారసుల కోసం వచ్చేవారు.. కానీ మూడేండ్లుగా గురుకులాల్లో సీట్లు ఇప్పించాలంటూ తల్లిదండ్రులు వస్తున్నారు. సీఎం కేసీఆర్ అమలుచేసిన పలు సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాయి. దీనిని కొనసాగిస్తూనే.. మరింత నమ్మకం పెంచేలా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతాం.

త్వరలో ప్రైవేటు వర్సిటీలు ఏర్పాటు

ప్రైవేటు వర్సిటీలు త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నది. వీటివల్ల నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది. అదేసమయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలను కూడా బలోపేతం చేస్తాం.

అవసరమైనచోట్ల నియామకాలు

టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అవసరమైనచోట్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటి విడుతలోనే విద్యాశాఖలో, గురుకులాల్లో అవసరమైన పోస్టులు భర్తీ చేసింది. భాషా పండితులకు, పీఈటీలకు పదోన్నతులు ఇచ్చి వారి దీర్ఘకాల సమస్యను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిష్కరించింది. దీనిని కొనసాగిస్తూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా అన్ని రకాల చర్యలూ తీసుకుంటాం. సర్వీస్ రూల్స్ సాధనపైనా చర్యలు కొనసాగుతున్నాయి.

1759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles