ఎన్నికల నిర్వహణ అత్యవసరం


Wed,September 12, 2018 01:52 AM

ECI team arrives in Hyderabad to a packed schedule

-ఆపద్ధర్మ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండటం మంచిదికాదు
-కేంద్ర ఎన్నికల సంఘం కమిటీకి టీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం వినతి
-సుప్రీం తీర్పునకు అనుగుణంగా చర్యలు చేపట్టండి: ఎంపీ వినోద్‌కుమార్
-ఓటర్ల జాబితా సవరణకు పండుగలు అడ్డంకి కాదు: ఎంపీ అసదుద్దీన్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికలసంఘం ఉన్నతస్థాయి బృందానికి విజ్ఞప్తిచేసింది. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఆపద్ధర్మప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండకుండా చూడాలని కోరింది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్రఎన్నికల సంఘం డిప్యూటీ చీఫ్ కమిషనర్ ఉమేష్‌సిన్హా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నది. రాత్రి 7.30 గంటలకు సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీల అభిప్రాయాలను వేర్వేరుగా సేకరించింది. ఇందులోభాగంగా ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కూడిన బృందం టీఆర్‌ఎస్ అభిప్రాయాలను తెలియజేసింది. అనంతరం ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయి కేర్‌టేకర్ ప్రభుత్వం కొనసాగుతున్ను నేపథ్యంలో త్వరగా ఎన్నికలు నిర్వహించి పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల బృందాన్ని కోరినట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న క్రమంలో పూర్తిస్థాయి అధికారం ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపామన్నారు. కాంగ్రెస్ నేతలు అభాండాలు వేయడం మానుకోవాలని, ఇన్నాళ్లు అధికారం అనుభవించిన పార్టీకి ఎన్నికల కమిషన్ నియమనిబంధనలు తెలియవా? అని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ అని, అలాంటి కమిషన్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గత ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయని, ఇప్పుడు ఎన్నికలు తెలంగాణలో మాత్రమే జరుగుతాయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను ఏపీలో కలిపింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు.

సుప్రీం తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి: ఎంఐఎం


ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడిపించకుండా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రద్దయిన అసెంబ్లీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు తెలిపారు. ఓటర్ల నమోదుకు మొహర్రం, వినాయక చవితి అడ్డంకి కాదని స్పష్టం చేశామని చెప్పారు

ఎన్నికలకు తొందరెందుకు.. : కాంగ్రెస్


రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనువుగా లేవని కేంద్ర ఎన్నికల బృందానికి చెప్పినట్టు కాంగ్రెస్ తెలిపింది. కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిసిన అనంతరం ఆ పార్టీనేత మర్రి శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు తొందర అవసరం లేదని, నాలుగువారాల్లో ఓటర్ల జాబి తా సవరణ సాధ్యం కాదని చెప్పారు. తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లిన ఏడు మండలాలను డీ లిమిటేషన్ చేయాలని, లేకపోతే 2008లో జరిగిన డీలిమిటేషన్ ప్రకారమే ఎన్నికలు జరుపాలని కేంద్ర బృందాన్ని కోరినట్టు చెప్పారు.

ఓటర్ల సవరణ జాబితాపై ప్రచారం చేయాలి: టీడీపీ


ఓటర్ల జాబితాపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఈసీ బృందాన్ని కోరామని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్, మొబైల్ యాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియ సజావుగా సాగడం లేదని ఆరోపించారు. ఎల్బీనగర్‌లో దాదాపు 6 లక్షల ఓట్లను తొలగించారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని కేంద్ర బృందాన్ని కోరినట్టు చెప్పారు.

పండుగల్లో ఓటర్ల జాబితా సవరణ ఎలా సాధ్యం: బీజేపీ


వరుసగా పండుగలు ఉన్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ సాధ్యం కాదని బీజేపీ తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఓటర్ల సవరణను వాయిదావేయాలని ఈసీ బృందాన్ని కోరామని బీజేపీ నేతలు ఇంద్రసేనారెడ్డి, మల్లారెడ్డి, వెంకట్‌రెడ్డి తెలిపారు.

బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపాలి: సీపీఐ


ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల బృందానికి విజ్ఞప్తి చేసినట్టు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. ఓటర్ల జాబితా సవరణకు సమయం పెంచాలని కోరామన్నారు.

తగ్గిపోతున్న ఓటర్ల సంఖ్య: సీపీఎం


రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నదని, గత ఎన్నికల నాటికి ఉన్న ఓటర్లకంటే దాదాపు 30 లక్షల మంది ఓటర్లు తగ్గారని సీపీఎం నేతలు డీజీ నరసింహారావు, నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. తొలగించిన ఓట్లన్నింటినీ పునరుద్ధరించాలని ఈసీని కోరామన్నారు. పోలింగ్‌బూత్‌లవారీగా మ్యాప్‌లు లేకపోవడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని చెప్పినట్టు పేర్కొన్నారు.

ముందస్తు అవసరం లేదు: వైసీపీ


రాష్ట్రంలో ఆదరాబాదరాగా ముందస్తు ఎన్నికలు అవసరం లేదని వైసీపీ నేత శివకుమార్ మీడియాతో చెప్పారు. ఓటరు లిస్టు సంపూర్ణంగా తయారు కాకుండా ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదని పేర్కొన్నారు.

ఈవీఎంలపై అనుమానాలు: బీఎస్పీ


ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని బీఎస్పీ పేర్కొన్నది. ఎన్నికల నిర్వహణకు సరిపడా యంత్రాంగం, సిబ్బంది లేరని కేంద్ర బృందానికి తెలిపినట్టు పేర్కొన్నది.

సీఎస్ జోషితో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భేటీ


ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషితో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ సమావేశమయ్యారు. కేంద్ర ఎన్నికల బృందం రాష్ర్టానికి వచ్చిన సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో బుధవారం నిర్వహించనున్న సమావేశంపై చర్చించినట్టు సమాచారం. ఎన్నికల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన బడ్జెట్ ప్రతిపాదనలను త్వరితగతిన ఆమోదించాలని సీఎస్‌ను కోరినట్టు రజత్‌కుమార్ వెల్లడించారు.

3243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles