యువతులకు వలవేసిన డ్రగ్ డాన్


Mon,July 17, 2017 01:45 AM

Drugs Mafia SIT Officials Interrogates Prime Accused Kelvin

-కెల్విన్ విచారణలో వెల్లడవుతున్న వివరాలు
-ఎక్కువ వ్యాపారం సినిమారంగం నుంచే
-గోవా నుంచి మాదకద్రవ్యాల దిగుమతి
-డీహెచ్‌ఎల్, ఇండియా పోస్టు ద్వారా తరలింపు
-బయటికొస్తున్న పెద్ద తలల పేర్లు
-పూర్తిస్థాయి విచారణకు కస్టడీ కోరే అవకాశం

drugs
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు కెల్విన్ విచారణలో అబ్బురపరిచే విషయాలు వెల్లడయినట్లు తెలిసింది. విచారణలో బడాబాబుల మూలాలు బయటపడినట్లు సమాచారం. కెల్విన్‌ను రెండురోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు ఆదివారం సాయంత్రం వరకు విచారించి కోర్టుకు అప్పగించారు. అతని నుంచి సేకరించిన సమాచారంతో లింకులు, పెద్దతలల వివరాలపై ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇంజినీరింగ్ పూర్తిచేసిన కెల్విన్ వ్యక్తిగత కారణాలతో తీవ్రమైన మానసిక ఒత్తిడికు గురయ్యాడు. వాటి నుంచి బయటపడేందుకు గంజాయికి బానిసయ్యా డు. తర్వాత అజ్ఞాత వ్యక్తుల ద్వారా డ్రగ్స్ రూట్స్ తెలుసుకున్నాడు. అడ్డదారుల్లో డ్రగ్స్ సంపాదించిన అతను ఆ మత్తులో పలువురు యువతులకు వల వేశాడు. వారిని వాడుకోవడంతోపాటు మత్తుకు అలవాటు చేశాడు. వారిని బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా మరికొంతమందితో లింకులు పెంచుకుంటూ వ్యాపారాన్ని విస్తరింపజేశాడు. ఇలా అంచెలంచెలుగా హైదరాబాద్ డ్రగ్ డాన్‌గా ఎదిగాడు.

తీగ లాగితే..

మూడునెలల కింద ఎైక్సెజ్ పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఎైక్సెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆ ఫోన్‌కాల్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఫోన్‌కాల్ ఆధారంగా ఆరా తీయగా తొలుత గంజాయి, తర్వాత డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే ఎైక్సెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం కెల్విన్‌ను పట్టుకుంది. కెల్విన్ వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు కాల్‌డాటాను పరిశీలించారు. 50సార్లకుపైగా కెల్విన్ మాట్లాడిన నంబర్లను పరిశీలించడం ద్వారా అతను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. కెల్విన్ ఇచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకునేందుకు అతడు తన వ్యాపారం కోసం వాడుకున్న యువతులను కూడా విచారించేందుకు సిట్ బృందం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. విచారణలో కెల్విన్ కొత్త పేర్లు బయటపెట్టినట్లు సమాచారం.మరింత సమాచారానికి మరో రెండురోజులు అతన్ని కస్టడీకి కోరాలని అధికారులు నిర్ణయించారు.

యువతే లక్ష్యంగా డ్రగ్స్ దందా

విద్యాసంస్థల్లో చదివే టీనేజీ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా ప్రారంభించి అనతికాలంలోనే సినీ పరిశ్రమకు వ్యాపారాన్ని విస్తరించినట్లు కెల్విన్ చెప్పాడు. ప్రధానంగా యువతను టార్గెట్‌గా చేసుకున్న అతను పెద్దపెద్ద విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు వాటిని విక్రయించాడు. సినీపరిశ్రమలోని కొంతమంది వ్యక్తులు పరిచయం అయిన తర్వాతే తాను ఎక్కువ వ్యాపారం చేసినట్లు కెల్విన్ వివరించినట్లు తెలిసింది. గోవా కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం సాగిందని, పెద్దమొత్తంలో ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ మాదకద్రవ్యాలను తెప్పించి సరఫరా చేశామని విచారణలో వెల్లడించినట్లు సమాచారం. డీహెచ్‌ఎల్, ఇండియా పోస్టు కొరియర్ సంస్థ ద్వారా గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసకున్నట్లు తెలిపాడు.

చైన్ సిస్టం ద్వారా విక్రయాలు

మొదట టీనేజ్ విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు చేసి వ్యాపారాన్ని విస్తరించిన కెల్విన్ విద్యాసంస్థల ప్రాంగణాల వద్ద అడ్డాలను ఏర్పాటు చేసుకుని అమ్మకాలు సాగించాడు. పేరు మోసిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల ద్వారా సినిమా పరిశ్రమతో సంబంధాలు ఏర్పడ్డాయి. చైన్ సిస్టం ద్వారా దాదాపు 10 వేల మందిని వినియోగదారులుగా చేర్చుకున్నట్లు సమాచారం. నిత్యం అనేకరకాల ఒత్తిళ్లను ఎదుర్కొనే సినిమా రంగానికి డ్రగ్స్ సరఫరా చేయడం వల్లే ఎక్కువ సంపాదించినట్లు కెల్విన్ ఒప్పుకొన్నట్లు తెలిసింది. నాలుగేండ్లుగా సినిమారంగానికి సరఫరా జరుగుతున్నదని, డ్రగ్స్‌ను ప్రముఖుల డ్రైవర్ల ద్వారా సరఫరా చేసేవాళ్లమని, ప్రముఖులు మాత్రం తమ వద్దకు వచ్చే వారుకాదని చెప్పాడు. పెద్దపెద్ద పార్టీలకు, ఈవెంట్లకు మత్తు పదార్థాలను సరఫరా చేశామని, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ డ్రగ్స్‌ను గోవా నుంచి తెప్పించినట్లు వెల్లడించాడు. గోవాలో ఎవరు ఇంతమొత్తంలో డ్రగ్స్ సరఫరా చేశారని సిట్ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. గోవా బాబు అనే వ్యక్తి నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, ప్రస్తుతం అతను కాంటాక్టులో లేడని కెల్విన్ వెల్లడించినట్లు సమాచారం. గోవాలోని బీచ్‌లలో మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా విక్రయిస్తారని, అక్కడి నుంచి రైలుమార్గం లేదా కొరియర్ సంస్థల ద్వారా దిగుమతి చేసుకుంటామని వెల్లడించాడు. కాగా తన కాల్‌డాటా గురించి కెల్విన్ సరైన సమాధానాలు చెప్పలేదు. కెల్విన్ వందలసార్లు ఫోన్ చేసిన వ్యక్తులు ఎవరు? వారితో ఎందుకు మాట్లాడాడు? ఎంతమేర డ్రగ్స్ సరఫరా చేశాడు? అనే ప్రశ్నలకు ఆశించిన మేరకు సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది.

హయత్‌నగర్ పీఎస్‌లో విచారణ

కెల్విన్‌ను హయత్‌నగర్ ఎైక్సెజ్ పోలీస్‌స్టేషన్‌లో విచారించినట్లు సమాచారం. మొదట ఎైక్సెజ్ ప్రధాన కార్యాలయంలోనే విచారించాలని భావించిన సిట్ అధికారులు మీడియా హడావిడితో అతన్ని హయత్‌నగర్‌కు తరలించారు. విచారణ పూర్తయిన వెం టనే అక్కడి నుంచి తీసుకొచ్చి కోర్టుకు అప్పగించారు. కస్టడీలో కెల్విన్ వెల్లడించిన అంశాలపై సిట్ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌తో పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. అలాగే రిమాండ్‌లో ఉన్న మరికొంతమందిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

విచారణకు కొరియర్ సంస్థలు!

కెల్విన్ చెప్పిన ఇండియా పోస్ట్, డీహెచ్‌ఎల్ కొరియర్ సంస్థలకు నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు తదుపరి విచారణ సిద్ధమవుతున్నారు. డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా సరఫరా చేసేందుకు ఎవరు బుక్ చేశారు? ఎవరు పార్సిల్‌ను తీసుకున్నారు? అనే అంశాలపై సిట్ బృందం ఆరా తీయనున్నది.

3105

More News

VIRAL NEWS