పల్లె ప్రగతి పరుగులు


Wed,September 11, 2019 03:40 AM

Donation spree at 30 day village development programme

-ప్రజాప్రతినిధుల పల్లెబాట
-ఐదోరోజు దిగ్విజయంగా 30 రోజుల ప్రణాళిక
-చేయిచేయి కలిపి ఊళ్లను చక్కదిద్దుకొంటున్న ప్రజలు
-ఉల్లంఘించినవారికి చెత్తరాజు, చెంబురాజు బిరుదులు
-పాల్గొంటున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
-ముందుగా శ్రమదానం.. ఆ తర్వాతే కార్యక్రమాలు
-రోజువారీగా ఆన్‌లైన్‌లో ప్రగతి పనులు
-గ్రామాల అభివృద్ధికి భారీగా విరాళాలు

పల్లెలను ప్రగతిబాటలో పరుగులు పెట్టించేందుకు.. గ్రామసీమలన్నీ పచ్చదనం, పరిశుభ్రతలతో విలసిల్లేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ అత్యద్భుతంగా కొనసాగుతున్నది. గ్రామగ్రామాన ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములై తమ ఊళ్లను చక్కదిద్దేందుకు పూనుకొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారికి చెత్తరాజు, చెంబురాజు బిరుదులిచ్చి వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జరిమానా విధిస్తున్నారు. ఐదోరోజు మంగళవారం సూర్యాపేట జిల్లాలో జరిగిన గ్రామసభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్: పల్లెల ప్రగతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలు వేగవంతమైంది. ఐదోరోజైన మంగళవారం ఆయా జిల్లాల్లో మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాత్రినిధులు, కలెక్టర్లు, ఆయాశాఖల అధికారులు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మంగళవారం ప్రత్యేకంగా శ్రమదానం కార్యక్రమాలను చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పరిసరాలను పరిశుభ్రంచేసి స్థానికుల్లో స్ఫూర్తి నింపారు. ప్రజాప్రతినిధులను ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే అంతకుముందు 40 నిమిషాలు గ్రామంలోని మహిళా, స్వచ్ఛందసంఘాలు, యువతీ, యువకులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు శ్రమదానం చేయాలని షరతు విధిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి విరాళాలు సైతం భారీగా వస్తున్నాయి. కొందరు నగదు, మరికొందరు భూములను, మరికొందరు వస్తు రూపేణా సహకారాన్ని అందిస్తున్నారు.

palle-pragathi

ఐదోరోజు ఇలా..

30 రోజుల కార్యాచరణపై మంగళవారం సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ దీపికాయుగంధర్‌రావు, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు, కలెక్టర్ అమయ్‌కుమార్, సర్పంచ్ శంకర్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రతినెలా గ్రామపంచాయతీలకు రూ. 339 కోట్ల నిధులు అందిస్తున్నట్టు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంవహిస్తే బాధ్యులపై వేటుతప్పదన్నారు. 30 రోజుల ప్రణాళిక అమలు పూర్తయిన తర్వాత నిబంధనలు అతిక్రమిస్తే కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా గ్రామస్థులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామసభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లగొండ, భువనగిరి యాదాద్రి జెడ్పీ చైర్‌పర్సన్లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి శ్రమదానం

పల్లెప్రగతిలో భాగంగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరు గ్రామాన్ని సందర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతోకలిసి శ్రమదానంలో పాల్గొన్నా రు. మంత్రి స్వయంగా రోడ్డుకిరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను తొలగించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయాలని, లేనిపక్షంలో సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శుల పదవులు పోవడం ఖాయమని హెచ్చరించారు.

marr-janardhan-reddy

ఉమ్మడి పాలమూరులో..

ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 మండలాలపరిధిలోని 441 గ్రామాల్లో మంగళవారం శ్రమదానం చేశారు. మూసాపేట మండలం నిజాలాపూర్‌లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శ్రమదానం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండ లం పాలెం గ్రామంలో ఎంపీ రాములు, జెడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వీధులను శుభ్రం చేశారు. నారాయణపేట జిల్లాలోని 280 పంచాయతీల్లో నిత్యం పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నారాయణపేట మండలం అప్పక్‌పల్లిలో జెడ్పీచైర్‌పర్సన్ వనజ, జెడ్పీటీసీ అంజలి, ధన్వాడ మండలం పస్పుల, మాదారం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో జెడ్పీ వైస్ చైర్మన్ గౌని సురేఖ పాల్గొన్నారు.

దాతలకు బిరుదులు

మా ఊరి రాజు: రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు విరాళమిచ్చే వారిని ఈ బిరుదుతో సత్కరించి వారి పేర్లను గ్రామంలోని నోటీసు బోర్డుపై వారం, పది రోజులు ప్రదర్శనగా ఉంచుతారు.
మా ఊరి మహారాజు : రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు డబ్బు లేదా ఇతర రూపంలో ఇచ్చిన దాతల పేర్లను నెలరోజులపాటు నోటీసు బోర్డుపై ఉంచనున్నారు.
మా ఊరి మహారాజ పోషకులు: లక్ష రూపాయలకుపైగా ఇచ్చే దాతలను గ్రామంలో ఏడాదిపాటు నోటీసు బోర్డుపై ఉంచడంతోపాటు వారి పేర్లను శిలాఫలకంపై నమోదు చేయనున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే..
చెంబు రాజు : బహిరంగ మలవిసర్జన చేసిన వారికి ఈ బిరుదు ఇవ్వడంతోపాటు జరిమానా విధిస్తారు.
చెత్తరాజు : బహిరంగ స్థలాల్లో చెత్త వేసిన వారిని ఈ పేరుతో జరిమానా విధిస్తారు.
దొంగ రాజు : విద్యుత్తు చౌర్యం చేసిన వారికి ఈ పేరుతో జరిమానా వేస్తారు.

చెత్తవేస్తే రూ.300 జరిమానా

మంత్రుల సమక్షంలో మేళ్లచెర్వు గ్రామసభ తీర్మానం
తమ గ్రామంలో రోడ్డుపై లేదా రోడ్డు పక్కన ఎవరైనా చెత్త వేస్తే రూ.300 జరిమానా విధించి కచ్చితంగా వసూలు చేయడంతోపాటు చెత్తను వేసిన వారితోనే తొలగించేలా సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు గ్రామ సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా మంగళవారం మేళ్లచెర్వు జరిగిన గ్రామ సభకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. వారి సమక్షంలోనే ప్రతి ఊరు పరిశుభ్రత, పచ్చదనంతో వెల్లివిరియాలి..మన ఊరును మనమే బాగు చేసుకుందాం అంటూ గ్రామస్థులు చెత్తపై జరిమానా విధించే అంశంపై తీర్మానం చేశారు.

s-ashok-teja

గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి

ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ
తల్లాడ: గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు 30 రోజుల ప్రణాళిక అద్భుతమైన కార్యక్రమమని ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా తల్లాడకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 30 రోజుల కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని తమ గ్రామాలను బాగు చేసుకోవాలని కోరారు. ప్రతివారం ఒక గంట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సమయాన్ని కేటాయించాలన్నారు. అంతరించిపోతున్న అడవులను విస్తరింప చేసేందుకు చేపట్టిన హరితహారంలో భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.

ఆన్‌లైన్‌లో ప్రగతి

30 రోజుల ప్రణాళిక సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో ప్రణాళిక సందర్భంగా చేసిన పనులు, ప్రత్యేకాధికారుల పర్యటనలు, చేయాల్సిన పనులు, గుర్తించిన పనులన్నీ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇందులో కొన్ని గ్రామాల నుంచి ఇప్పటికే రోజువారీ కార్యక్రమాలు నమోదవుతున్నాయి. ప్రగతి పనుల వివరాలన్నీ రోజువారీగా విడుదల చేసేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.

951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles