ఓటు మరువొద్దు వృథా చేయొద్దు


Fri,December 7, 2018 02:26 AM

Do not forget the vote

మనం వేసే ఓటు సమర్థుడికి పడితే మనకు ప్రయోజనం కలుగడంతోపాటు దీర్ఘకాలికంగా మన తరువాతి తరాలకు మేలు చేస్తుంది. అసమర్థుడికి పట్టం కడితే క్షమించలేని నేరం అవుతుంది. అందుకే ఓటు అత్యంత విలువైనది. దాన్ని సమర్థులకే వేయడం ఎంత ముఖ్యమో.. వృథాకాకుండా చూడటం అంతే ముఖ్యం. పూర్తిగా పోలింగ్‌కే దూరంగా ఉండటం వల్ల అసమర్థులకు పట్టం కట్టే అవకాశాన్ని ఇచ్చిన వాళ్లమవుతాం కాబట్టి అందరం ఓటేద్దాం. సమర్థులనే గెలిపిద్దాం.

ఎలక్షన్ డెస్క్, నమస్తే తెలంగాణ, హైదరాబాద్ : ఓటు.. మన భవిష్యత్తుకు పునాది. మన తర్వాతి తరాల కు మార్గదర్శి. మనం సమర్థుడిని ఎన్నుకుంటే మనతో పాటు మన తర్వాతి తరాలు బాగుంటాయి. మొత్తంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అసమర్థులు, అవకాశవా దులు, ఇతరుల ముందు సాగిలపడే వారికి ఓటేస్తే మనం ముందడుగు వెయ్యలేం.. సరికదా మన భవిష్యత్తు తరా లు కూడా మనల్ని క్షమించవు. అందుకే ప్రతి ఒక్కరం ఓటేద్దాం.. మనం నమ్మిన.. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయగలిగే పార్టీని గెలిపిద్దాం. ఓటేసే ముందు ప్రతి ఒక్కరికీ అంతర్మథనం అవసరం. ఎవరు మనల్ని బాగుచేశారు? ఎవరు మన కష్టాలను తీర్చారు? ఎవరు మన ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశారు?.. ఎవరైతే మన సమస్యలను పరిష్కరించగలరు.. ఇలాంటివన్నీ బేరీజు వేసుకొని ఓటేయాలి. అప్పుడే ఓటుకు సార్థకత.

ఓటు వృథా కావొద్దు..

మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు. మనకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఓటుతోనే సాధ్యం. మనల్ని అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడికి మరోసారి పట్టం కట్టే అవకాశం ఓటుతోనే కలుగుతుంది. ఇంత విలువైన ఓటు వృథా అవుతున్నది. ఇందులో ప్రధానమైనది పోలింగ్‌కు దూరంగా ఉండటం. ప్రతి ఎన్నికల్లో లక్షల మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ.. ఓటును వృథా చేయడం అంటే సమర్థుడిని చట్టసభలకు దూరం చేయడమే. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఎన్నికల రోజు సెలవు ప్రకటిస్తున్నాయి. అయినా చాలామంది ఇంటి నుంచి కదలడం లేదు.

అనాలోచితంగా వేయొద్దు

ఓటు వృథాలో మరో కోణం.. ఎవరికో ఒకరికి ఓటే యడం. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడం, అభ్యర్థులు ఎవరూ నచ్చకపోవడం వేరే ఇతర కారణాల వల్ల కొందరు ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటేద్దాం లే.. అనే భావనలో ఉండిపోతారు. కండ్లు మూసుకొని బటన్ నొక్కేస్తుంటారు. ఇది కూడా ఓటును వృథా చేయడమే.

నోటా.. ప్రయోజనం ఎంత?

నోటా.. ఓటరు చేతికి అందిన మరో అస్త్రం. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నాకెవరూ నచ్చలేదు.. అని స్వేచ్ఛగా చెప్పే అవకాశం కల్పించింది. కొన్నేండ్ల పోరాటం తర్వాత ఫలించిన హక్కు ఇది. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం నోటాకు వేసే ఓట్ల సంఖ్య ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. పోటీలో ఉన్న అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కన్నా.. నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చినా ఫలితంలో మార్పురాదు.

1.1 శాతం మంది నోటాకే

మన దేశంలో 2014 సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి నోటా పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. అదేసమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ నోటా వినియోగించారు. దాదాపు 60 లక్షల మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. ఇది మొత్తం పోలింగ్‌లో 1.1 శాతం. దీంతో కొందరు అభ్యర్థుల తలరాతలే మారిపోయాయి. 2014లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లు 3,08,286. ఇది మొత్తం ఓట్లలో 0.6 శాతం. పోలైన మొత్తం ఓట్లు 4,84,00,406. కొందరు అభ్యర్థులు కేవలం 100-2,000 ఓట్ల మెజార్టీ మాత్రమే సాధించారు. నోటా ఓట్లు వారికి పడి ఉంటే మెజార్టీ మరింత పెరిగేది. లేదా అవతలి వ్యక్తికి పడి ఉంటే ఫలితాలే మారిపోయి ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 42 లోకసభ నియోజకవర్గాలలో కలిపి మొత్తం 0.7 శాతం ఓట్లు నోటాకు పడ్డాయి. కాబట్టి ఓటును ఏ మార్గంలోనూ వృథా చేయకుండా పోటీలో వున్న మొత్తం అభ్యర్థులకు అంశాల వారీగా ప్రాధాన్యం ఇచ్చి టాప్‌లో ఉన్న అభ్యర్థికి ఓటు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి చివరి అవకాశంగా మాత్రమే నోటా వాడాలని కోరుతున్నారు. భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచే పరిస్థితులు రావాలంటే సమర్థులకు పట్టం కట్టడంతోపాటు ఓటు వృథా చేయకుండా ఉండటమూ ముఖ్యమే.

1198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles