దిశ కేసు సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు

Thu,December 5, 2019 03:07 AM

-ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
-మహబూబ్‌నగర్ సెషన్స్ కోర్టు ఎంపిక
-ప్రత్యేక కోర్టులో రోజువారీ విచారణ
-దిశ నిందితులకు ఏడు రోజుల కస్టడీ
-క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేయనున్న పోలీసులు
-డీఎన్‌ఏ, ఇతర ఆధారాల సేకరణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ సిటీబ్యూరో/ మహబూబ్‌నగర్ లీగల్: అత్యంత దారుణంగా లైంగికదాడి, హత్యకు గురైన దిశ కేసులో బాధిత కుటుంబసభ్యులకు సత్వర న్యాయం అందించేందుకు, నిందితులకు వేగంగా శిక్ష పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసింది. దిశ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాధిత కుటుంబసభ్యులకు సత్వర న్యాయం అందించడంతోపాటు నిందితులకు వేగంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైకోర్టుతో న్యాయశాఖ సంప్రదింపులు జరిపింది. హైకోర్టు ఆమోదంతో ఈ కేసులో విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఏ సంతోష్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మహబూబ్‌నగర్ ఒకటో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా గుర్తిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దిశ ఘటనపై షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 784/2019 కేసుపై ప్రత్యేకంగా రోజువారీ విచారణ జరుగనున్నది. గతంలో వరంగల్‌లో చిన్నారి హత్య ఘటనపై కూడా ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసింది. సదరు కేసులో 56 రోజుల్లోనే దోషికి శిక్షపడింది. మరోవైపు, జస్టిస్ ఫర్ దిశ కేసులో నిందితులకు షాద్‌నగర్ కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది. నిందితులను పదిరోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు.. ఈ మేరకు అనుమతి ఇచ్చింది. జైలులోనే విచారిస్తారా లేదా ఏదైనా రహస్య ప్రాంతానికి తీసుకువెళ్తారా? అనేది పోలీసుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని సమాచారం. కస్టడీ సందర్భంగా పోలీసులు క్రైం సీన్ రీకన్‌స్రక్ట్ చేయడంతోపాటు నిందితులకు డీఎన్‌ఏ పరీక్షలు చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. అఘాయిత్యానికి సంబంధించిన ఆధారాలు సేకరించనున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యక్ష సాక్షుల ముందు ఐడీ పరేడ్ నిర్వహించే అవకాశం ఉన్నది. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు క్రైమ్ సీన్ మ్యాపింగ్ చేస్తున్నారు. నిందితులు ఆరిఫ్ అలీ, చెన్నకేశవులు, శివ, నవీన్ ప్రస్తుతం చర్లపల్లి జైలులోని హై సెక్యూరిటీ బ్యారక్‌లలో ఉన్నారు.

దిశ గుర్తింపు వెల్లడిపై కేంద్ర, రాష్ర్టాలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

దిశ గుర్తింపును వివిధ మీడియా, సామాజిక మాధ్యమాలు బహిరంగంగా వెల్లడించడంపై స్పందన తెలియజేయాలని కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. లైంగికదాడి బాధితుల గుర్తింపును వెల్లడించడం చట్టప్రకారం నేరమని.. ఈ మేరకు మీడియా, సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీకి చెందిన న్యాయవాది యశ్‌దీప్‌చాహల్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ హరిశంకర్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రముఖ మీడియా సంస్థలకు, సామాజిక మాధ్యమ వేదికలకు నోటీసులు జారీచేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 16కు వాయిదావేసింది.

1177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles