ఠాణాల తనిఖీలు మెరుగైన సేవలకే


Sun,July 21, 2019 02:49 AM

DGP Mahender Reddy Visits Narayanguda Police Station With CP Anjani Kumar

-కమిషనరేట్ల తర్వాత జిల్లాల్లోనూ పర్యటన
-నమస్తే తెలంగాణతో డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి
-ఠాణాలను ఆకస్మికంగా తనిఖీచేస్తున్న డీజీపీ
-సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్, అంశాల అమలుపై ఆరా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఏకరూప పోలీస్ సేవలే లక్ష్యంగా చేపట్టిన సంస్కరణలు, ప్రజాహిత పోలీసింగ్ చర్యల తీరును డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. స్వయంగా కొన్ని పోలీస్‌స్టేషన్లకు వెళ్లి స్టేషన్‌హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో), సబ్ ఇన్‌స్పెక్టర్ల పనితీరుపై, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై ఆరాతీస్తున్నారు. పోలీస్‌స్టేషన్ల తనిఖీ ఉద్దేశం సిబ్బంది తప్పులు ఎంచడం కాదని, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలందించడమే లక్ష్యమని చెప్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో పౌరులకు ఒకే తరహా సేవలు అందించే లక్ష్యంతో పోలీసుల విధులను ఇప్పటికే 17 వర్టికల్స్ (అంశాలవారీగా)గా విభజించారు. అంశాలవారీగా సి బ్బంది పనిచేస్తున్నారా? ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఇంకా మెరుగుపర్చేందుకు ఏయే చర్యలు తీసుకోవాలి.. అనే విషయాలపై డీజీపీ ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్‌స్టేషన్లను మహేందర్‌రెడ్డి సందర్శించారు. పంజాగుట్ట, ఎల్బీనగర్, చందానగర్ పోలీస్‌స్టేషన్లలో రికార్డులను పరిశీలించారు. డీజీపీ ఒక్కో ఠాణాలో మూడుగంటలకుపైగా ఉంటూ సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. టెక్నాలజీ వాడకాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అంశాలవారీగా రాష్ట్రస్థాయిలో సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం వాటిఅమలు తీరును తెలుసుకుంటూ.. రెండోదశలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించనున్నారు. తాజాగా శనివారం నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. కమిషనరేట్ల తర్వాత ఉమ్మడి జిల్లాల పరిధిలోని కొన్ని పోలీస్‌స్టేషన్లను పరిశీలించనున్నట్టు నమస్తే తెలంగాణతో డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు.

dgp-mahender-reddy2

ఇంకా మెరుగైన సేవలే లక్ష్యం

పోలీస్‌స్టేషన్ల తనిఖీ ఉద్దేశం సిబ్బంది తప్పులు ఎంచడం కాదు. మెరుగైన సేవలందించేందుకు ఏం చేయాలన్నది చెప్పడమే లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో పోలీస్ సేవలందించే లక్ష్యంతో వర్టికల్స్ విధానాన్ని తీసుకొచ్చాం. నేరరహిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకొనేందుకు పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేస్తున్నాం. తొలుత మూడు కమిషనరేట్ల పరిధిలో ఎంపికచేసిన ఠాణాలను పరిశీలించి, మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏం చేయాలన్నది నేరుగా సిబ్బందికి వివరిస్తున్నాం. పాత పది జిల్లాల ప్రాతిపదికన కొన్ని పోలీస్‌స్టేషన్లను త్వరలోనే పరిశీలిస్తా.
- ఎం మహేందర్‌రెడ్డి, డీజీపీ

302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles