కిడ్నాపులపై వదంతులు నమ్మొద్దు


Sun,June 16, 2019 03:24 AM

DGP Mahender Reddy Responds On Missing Cases And Fake news

-ఫేక్ మెసేజ్‌లతో భయాందోళనలు
-మార్ఫింగ్ ఫొటోలతో ఆకతాయిల ఆటలు
-కిడ్నాప్‌గ్యాంగ్‌లు, నరహంతకులు వచ్చారంటూ అభూతకల్పనలు
-తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు డీజీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తున్న ఫేక్‌మెసేజ్‌లు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. మార్ఫింగ్ ఫొటోలతో ఆకతాయిలు పెడుతున్న పోస్ట్‌లు అదంతా నిజమేనేమోనన్న భ్రాంతిని కలుగజేస్తున్నాయి. కిడ్నాప్ గ్యాంగ్‌లు, నరహంతకముఠాలు రాష్ట్రంలో చొరబడ్డాయం టూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచా రం అబద్ధమని.. అలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై కఠినచర్యలు తప్పవని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఒడిశా నుంచి ఈ రోజే అందిన సమాచారం.. బీహార్ నుంచి జార్ఖండ్ మధ్యలో బిచ్చగాళ్ల వేషంలో 500 మంది బయలుదేరారు.. ఒంటరిగా దొరికినవాళ్లను చంపి కిడ్నీల దందాలకు సరఫరాచేస్తున్నారు. వీరిలో ఏడుగురు పట్టుబడ్డారు. వాళ్లను విచారిస్తే.. 500 మంది ముఠా ఉన్నట్టు ఒప్పుకున్నారు. ఎంతవీలైతే అంతమందికి ఈ మెసేజ్‌ను వాట్సాప్ ద్వారా చేరవేయగలరు- ఇది శనివారం వాట్సాప్‌లో వైరల్‌గా మారిన మెసేజ్. వాస్తవానికి ఇలాంటి ముఠాలేవీ లేవు. ఎవరో ఆకతాయిలు సృష్టించిన ఈ సందేశం ఇప్పుడు ఎంతోమందిని కలవరానికి గురిచేస్తున్నది. పిచ్చివాళ్లు, బిచ్చగాళ్లపై అనుమానంతో దాడులుచేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటిని సీరియస్‌గా తీసుకున్న పోలీస్‌శాఖ ఇలాంటి వదంతులు వ్యాప్తిచేసేవారిపై దృష్టిపెట్టింది.

తప్పుడు పోస్టులతో రాజకీయాలు

ఎక్కడో జరిగిన ఘటనలను మనదగ్గరే జరిగినట్టు మార్ఫింగ్‌చేసి జనంపైకి కొందరు వదులుతున్నారు. ప్రభుత్వాన్ని, పోలీసులను బద్‌నాంచేయాలనే ఇలా చేస్తున్నారన్న చర్చ సోషల్‌మీడియాలో జోరుగా జరుగుతున్నది. తాజా ఉదాహరణ చూస్తే.. హర్యానాలో అత్తింటి వేధింపులతో గాయపడిన మహిళ ఫొటోలను మార్ఫింగ్‌చేసి, పాతబస్తీలో జైశ్రీరాం అన్నందుకు ఒక యువతిపై ముస్లిం యువకులు దాడిచేశారంటూ తెలంగాణ ఆంధ్ర ట్రెండింగ్ అప్‌డేట్స్ అనే ఫేస్‌బుక్ పేజ్‌లో పెట్టిన పోస్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పెరిగిన సోషల్ మీడియా వాడకంతోనూ అనర్థాలు

తప్పుడు వార్తలు ప్రచారం కావడానికి ఒకరకంగా టెక్నాలజీ కూడా కారణమవుతున్నది. వాట్సాప్ చాటింగ్‌లు, ఫేస్‌బుక్ పోస్టింగ్‌లు, లైక్‌లు, కామెంట్లు రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. తమకు వచ్చిన పోస్టింగ్‌ల్లో ఏది నిజం.. ఏది తప్పు అన్నది నిర్ధారించకుండానే ఫార్వర్డ్ చేస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నది. దొంగలు, కిడ్నాపర్లు, హంతకముఠాలు వంటి మెసేజ్‌లు చూసిన వెంటనే వాటిని ఫార్వర్డ్ చేస్తుండటంతో అవి వైరల్‌గా మారుతున్నాయి. ఆరునెలల కిత్రం కూడా ఇదే తరహా మెసేజ్‌లు హల్‌చల్‌చేశాయి. కొత్తవాళ్లు కనిపిస్తే దాడులు చేసిన ఘటనలు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఫేక్ వార్తలను నమ్మవద్దని, ఏదైనా అనుమానాలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

కిడ్నాప్‌ల వదంతులను నమ్మొద్దు: డీజీపీ మహేందర్‌రెడ్డి ట్వీట్

Facebookphoto
కిడ్నాప్‌లపై వదంతులను నమ్మొద్దని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోకి కిడ్నాపర్లు, హంతకముఠాలు చొరబడ్డట్టు వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో వస్తున్న ఫొటోలు, వీడియోలు అవాస్తవమని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్‌చేశారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా 100కు ఫోన్ చేయవచ్చని.. లేదంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయాలని సూచించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, తప్పుడు వార్తలు ప్రచారంచేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో ఏదైనా వార్త వచ్చినప్పుడు నిర్ధారించుకున్నాకే ఫార్వర్డ్‌చేయాలని కోరారు.

2421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles