జూబ్లీహిల్స్‌లో పేలిన డిటోనేటర్లుTue,February 13, 2018 02:26 AM

-మహిళకు గాయాలు
-పేలుడు ధాటికి కుప్పకూలిన గది
-దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు
-98 డిటోనేటర్లు స్వాధీనం
denotator
బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటి స్థలంలో సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. బండరాళ్లను తొలిగించేందుకు ఉపయోగించే డిటోనేటర్లను అక్రమంగా గదిలో నిల్వఉంచగా పేలినట్టు గుర్తించారు. పేలుడు ధాటికి గదిగోడలు కూలిపోగా ఓ మహిళకు గాయాలయ్యాయి. సమీపంలోని ఇండ్లపై రాళ్లు పడటంతో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-48లో సిద్ధార్థ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు స్థలం ఉన్నది. ఇక్కడ బండరాళ్లను తొలిగించేందుకు ఆశిష్ అనే వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చారు. అతడు స్థానికంగా బండరాళ్లు కొట్టే మహేశ్, నవీన్‌కు సబ్ కాంట్రాక్టు ఇచ్చాడు. వారు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను నెల కిందట తీసుకొచ్చి సైట్‌లో ఉన్న ఓ గదిలో భద్రపర్చారు. వాటిల్లో కొన్ని సోమవారం ఉదయం పేలాయి. ఈ ధాటికి గది కుప్పకూలడంతోపాటు రాళ్లు తగిలి వాచ్‌మన్ భార్య భగవతి(36)కి స్వల్ప గాయాలయ్యాయి.
denotator2
ఆమెను జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌తోపాటు బాంబు స్కాడ్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన డిటోనేటర్లలో దాదాపు 25 పేలినట్టు నిర్ధారించారు. మిగిలిపోయిన 98 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ ఉంచిన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేస్తామని డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. బ్లాస్టింగ్‌కు ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వెంకన్న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌జోన్ కమిషనర్ రఘుప్రసాద్, సర్కిల్ 18 డీఎంసీ సత్యనారాయణ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

1494

More News

VIRAL NEWS