HomeTelangana News

అమ్మ ఒడిలోనే ఎదగాలనుంది!

Published: Sat,January 13, 2018 03:16 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

తల్లిదండ్రులక్కడ.. మేమిక్కడ
సూరత్‌లోనే 30 వేల కుటుంబాలు
నాలుగు వేల మంది చిన్న పారిశ్రామికవేత్తలు
10 నుంచి 100 మగ్గాలతో ఉత్పాదక శక్తి
జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో ఇక్కట్లు
వరంగల్ టెక్స్‌టైల్‌పార్కుకోసం ఎదురుచూపులు
తెలంగాణ ప్రభుత్వ రాయితీలకు ఫిదా
సూరత్ నుంచి నమస్తే తెలంగాణ హైదరాబాద్ సిటీబ్యూరో
ప్రధాన ప్రతినిధి శిరందాస్ ప్రవీణ్‌కుమార్

Sarees
స్వీయ పాలన.. సొంత ఎజెండా.. స్థానిక వనరులు.. స్పష్టమైన అంచనా.. పక్కా ప్రణాళిక. అన్నింటికీ మించి చిత్తశుద్ధి. అలాంటి పాలన 50 ఏండ్ల కిందటి వలసలనూ ప్రశ్నిస్తున్నది. ఒకప్పుడు పొట్టతిప్పలకు దూరప్రాంతాలకు వెళ్లినవారిని తిరిగి సొంతూరికి వచ్చేయాలన్న ఆలోచనకు పురిగొల్పుతున్నది. వస్త్రపరిశ్రమలో దేశంలోనే నంబర్ వన్‌గా చెప్పుకొనే గుజరాత్‌లో స్థిరపడిన తెలంగాణకు చెందిన వేల కుటుంబాలు తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నాళ్లున్నా సవతి తల్లి ఒడిలో కష్టాలే. మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెండ్లు అక్కడ. మేమిక్కడ. చస్తే కడసారి చూపుకూ కష్టం. అందుకే కన్నతల్లి ఒడిలోనే ఎదగాలనుంది. అవకాశాలు కల్పిస్తే అక్కడికి వచ్చి పని చేయడానికి సిద్ధం. సొంత ఫ్యాక్టరీలు తెరిచేందుకు తోడ్పాటునందిస్తే సేట్లుగా పిలిపించుకుంటాం అని సూరత్, అహ్మదాబాద్‌లో స్థిరపడిన మరమగ్గాల కార్మికులు, వ్యాపారులు అంటున్నారు. వరంగల్‌లో మెగాటెక్స్‌టైల్ పార్కుకోసం వేసిన పునాది రాయి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వేలమందికి ఉపాధి దొరుకుతుందన్న విశ్వాసాన్ని కల్పిస్తున్నది. 70ఏండ్ల కాలంలో మునుపెన్నడూ ఆలోచనకు తట్టని ప్రణాళిక రూపకల్పనకు అంకురార్పణపట్ల కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఎప్పుడెప్పుడు స్వస్థలాల్లో కాలు పెడుతామా అని తహతహలాడుతున్నారు. వీవింగ్, ప్రాసెసింగ్, డైయింగ్ రంగాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులెంతో మంది ఉన్నారు. 10 నుంచి 100 మరమగ్గాలను నెలకొల్పి పలువురికి ఉపాధి కల్పిస్తున్నవారూ ఉన్నారు. అందరి నోటా ఒక్కటే మాట.. సొంత గడ్డకు వచ్చేస్తాం!

సూరత్, అహ్మదాబాద్‌లలో వేలమంది తెలంగాణవారు

గుజరాత్‌లోని నవుసారి, బిల్‌మోరి, గణదేవి, సచిన్, కీమ్, అహ్మదాబాద్, సూరత్ ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన కార్మికులు టెక్స్‌టైల్ రంగంలో పనిచేస్తున్నారు. సూరత్‌లో 30 వేలు, అహ్మదాబాద్‌లో 15 వేలకు పైగా కుటుంబాలున్నాయి. వీరంతా పాత వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలవారే. 1930లో మొదలైన వలసలు 2013 వరకు సాగాయి. ఈ మూడున్నరేండ్లలో మాత్రం వలసల వాపస్ మొదలైంది. ఇప్పటికే వేల కుటుంబాలు స్వస్థలాలకు వెళ్లాయి. మిగిలిన కుటుంబాల్లో సగానికి పైగా ఉపాధి లభ్యత కోసం ఎదురుచూస్తున్నాయి. గుజరాత్‌లో సొంత ఇండ్లు ఉన్న వారు కూడా తెలంగాణ ప్రభుత్వ పథకాలపట్ల ఆకర్షితులవుతుండడం గమనార్హం. నమస్తే తెలంగాణ ప్రతినిధి మూడు రోజుల పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనపైనే ప్రశ్నల పరంపర కొనసాగింది. ప్రతి ఒక్కరూ మంత్రి కేటీఆర్ ప్రసంగాలు, ప్రణాళికలపైనే అడగడం విశేషం.

సంపాదన తక్కువ.. పని గంటలు ఎక్కువ

గుజరాత్‌లోని జౌళి పరిశ్రమల్లో కార్మికులు రోజుకు 12 గంటలు కష్టపడాల్సిందే. ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయాలు లేవు. ప్రమాదాలు జరిగితే చికిత్స సొంత ఖర్చులతోనే. అడ్వాన్సులు, అప్పుల ఊసేలేదు. చేసిన పనికి కూలిని ప్రతి 15 రోజులకోసారి లెక్కించి ఇస్తారు. సాదా వస్త్రం మీటరుకు రూ.2.25, జకాట్ మీద నేసే వస్త్రం మీటరుకు రూ.3.50 వరకు చెల్లిస్తున్నారు. జీఎస్టీ ప్రభావంతో కూలీ పావలా తగ్గింది. ఎంత చేసినా నెలకు రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు మాత్రమే సంపాదన. ఇంటి కిరాయి రూ.3 వేల దాకా ఉంది. మిగిలిన సొమ్ముతోనే ఇల్లు నడుపుకోవాలి. 40 ఏండ్లక్రితం వలసపోయినవారికి కూడా సొంతింటి భాగ్యం కలగలేదు. ఈ మధ్యకాలంలోనే జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం మాదిరిగా గరిష్ఠంగా 600 చ.అ. ఇండ్లను నెలవారీ కిస్తులకు అప్పగిస్తున్నారు. లబ్ధిదారుడి వాటా కింద తొలుత రూ.2 లక్షలదాకా కట్టించుకొంటారు. మిగిలినది వాయిదాల్లో చెల్లిస్తేనే సొంతం. యార్న్ సబ్సిడీ, త్రిబుల్ ఆర్ వంటి పథకాలేవీ అమల్లో లేవు.
Sarees1

అతి కష్టమ్మీద ఎదిగిన కార్మికులు

50 ఏండ్ల క్రితమే వలసపోయిన కొన్ని కుటుంబాల సభ్యులు అతి కష్టమ్మీద పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. జాగలు కొనుక్కొని 10 నుంచి 100 మగ్గాలను నడుపుతున్నారు. అలాంటి వారు 4 వేల మంది ఉన్నారంటే ఆశ్చర్యమే. అయితే.. వీరంతా జాబ్ వర్క్‌కే పరిమితం. సొంతంగా వస్ర్తోత్పత్తి, మార్కెటింగ్ చేస్తున్నవారు 10 మంది వరకు సూరత్‌లో ఉన్నారు. ఇప్పుడక్కడ పనిచేస్తున్న కార్మికులందరికీ వృత్తి నైపుణ్యం ఉంది. రేపియర్ వంటి ఆధునిక టెక్నాలజీతోనూ మగ్గాలను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇక్కడేముంది? అందరూ అక్కడే!

మా తల్లిదండ్రులు ఇక్కడికొచ్చారు. మేం ఇక్కడే పుట్టాం. అయినా తెలుగుపైనే ఇష్టం. చాలా మందిమి తెలుగులోనే చదువుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలేవీ రావు. అందుకే పవర్‌లూం యూనిట్లలో పనిచేస్తున్నం. ఇంకొందరు వేర్వేరు పనుల్లో నిమగ్నమయ్యారు. ఏటా దీపావళి, దసరాకు ఊరెళ్లి వస్తే.. మళ్లీ వెళ్లేదాకా అదే గుర్తుంచుకుంటం. బంధువులు, మిత్రులంతా తెలంగాణలోనే ఉన్నారు. ఏదో ఇక్కడ పనికోసం ఉండాల్సిందే. మనసంతా అక్కడే. ఇక్కడేదో పెద్ద ఎత్తున సంపాదిస్తున్నామా అంటే అదీలేదు. ఈ మధ్య జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో సంపాదన తగ్గింది. రోజుకు 12 గంటలపాటు పనిచేస్తే నెలకు వచ్చేది రూ.15 వేలకు మించడం లేదు. గతంలో ఆరు మిషన్లు చూసుకునే కార్మికులు 12 దాకా చూడాలి. కష్టమైతుంది. ఎవరికైనా దెబ్బ తగిలితే సొంత ఖర్చులతోనే చికిత్స చేయించుకోవాలి. తెలంగాణలో సీఎం కేసీఆర్ వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుచేస్తున్నట్లు తెలుసుకున్నాం. అది పూర్తయితే పని అక్కడే చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని సూరత్‌లో నివాసముంటున్న వరంగల్ జిల్లా కొడిమెలకు చెందిన సంతోశ్, పెద్ద ముప్పారంకు చెందిన కస్తూరి రాజు, మహబూబాబాద్‌కు చెందిన దోనిపర్తి రాహుల్, వరంగల్‌కు చెందిన ముఖేశ్, ఎన్నం సాంబయ్య, గుళ్లపల్లి మల్లేశ్ చెప్పారు.

జీఎస్టీతో ఇబ్బంది పడుతున్నాం

- పొతునూరి శ్రీనివాస్, రుద్రాల, వరంగల్
Sarees2
మా నాన్న వెంకటయ్య ఇక్కడకు కార్మికుడిగా వచ్చి.. ఆ తర్వాత మాస్టర్‌గా మారిండు. ఇప్పుడు 18 మగ్గాలు పెట్టి పనికల్పిస్తున్నం. రోజూ 1000 మీటర్లకు పైగానే ఉత్పత్తిచేస్తాం. అయితే.. జీఎస్టీతో ఇబ్బంది పడుతున్నం. ముడి సరుకు దొరుకడం లేదు. గతంలో రెండు షిఫ్టుల్లో పనిచేసేవారు. సగంమంది గ్రామాలకు వెళ్లిపోయారు. మా దగ్గర ఒడిశా, యూపీ, బీహార్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తే రేపియర్ టెక్నాలజీలోనూ వస్ర్తాలను ఉత్పత్తి చేయగలం. ఇప్పుడున్న మరమగ్గం రూ.40 వేలకే దొరుకుతుంది. అదే ఆధునిక మరమగ్గానికి రూ.10 లక్షల వరకు ఉంటుంది. వాటికి రుణ సదుపాయం కల్పిస్తే చాలా మంది తిరిగి వచ్చే అవకాశం ఉంది.

నెలకు రూ.10 వేలే: ఎలగం వేణుగోపాల్, వరంగల్

15 ఏండ్ల క్రితం వచ్చిన. ప్రతి రోజూ 12 గంటలు పని చేస్తా. ఎంత చేసినా నెలకు గిట్టుబాటు అయ్యేది రూ.10 వేలు దాటదు. ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్నం. ఇంత కంటే పెద్ద పని చేయడానికి, నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా.

బిడ్డ పెండ్లికున్నది: లగిశెట్టి వెంకన్న, వరంగల్

30 ఏండ్ల క్రితం వచ్చిన. ఇదే పనిలో ఉన్న. సంపాదించిందేమీ లేదు. బిడ్డ పెండ్లికున్నది. సూరత్‌కు వచ్చి కష్టాల కడలిలోనే ఉన్నాం. ఎప్పుడెప్పుడు వరంగల్‌కు రావాలని ఎదురుచూస్తున్నం.

ఏదైనా అమ్మి యూనిట్ నెలకొల్పుతాం

- ఎలిగేటి నాగేశ్వర్, అధ్యక్షుడు, పద్మశాలి జనరల్ సమాజ్, సూరత్ జిల్లా
Sarees4
కన్నతల్లి ఒడిలో ఉండాలని అందరికీ ఉంది. పెంచిన తల్లి దగ్గర ఎన్నాళ్లుంటాం? ఊరిలో ఎవరైనా చనిపోతే 24 గంటల తర్వాత గానీ ఆఖరి చూపులు దక్కడం లేదు. కన్నవారిని సరిగ్గా చూసుకోలేకపోతున్నం. ఇప్పటికే రివర్స్ మైగ్రేషన్ ఆరంభమైంది. ఇప్పటికే 5% వెళ్లిపోయారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు మమ్మల్ని తిరిగి రమ్మంటున్నాయి. అందుకే ఏదైనా అమ్మి అక్కడ యూనిట్ నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎంతోమంది అక్కడ యూనిట్లు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మేం మడికొండలో 60 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కు స్థాపనకు సొంతంగానే కృషిచేస్తున్నాం. మంత్రి కేటీఆర్ కూడా ప్రోత్సహిస్తామన్నారు. ఇక్కడ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్లకు శిక్షణ ఇస్తున్నది. ఆ తర్వాత సర్టిఫికెట్లు జారీ చేస్తున్నది. వారికే ప్లాట్లు కేటాయిస్తారు. తెలంగాణలో కూడా అలాంటి విధానాన్ని అమల్లోకి తీసుకొస్తే బాగుంటుంది. అప్పుడు వృత్తి నైపుణ్యం కలిగిన కార్మికుడు సేఠ్ అవుతాడు.

కష్టం చేసినం.. యూనిట్ పెట్టుకున్నం

- గోనె ఉప్పలయ్య, చెట్లముప్పారం, వరంగల్
Sarees3
1978లో పదో తరగతి ఫెయిల్ అయ్యా. దాంతో ఇక్కడికి వచ్చి పనిలో చేరిన. మా అన్న సహకారంతో ఎదిగాం. ఊర్లో ఉన్న పొలాలను అమ్మినం. మూడు మగ్గాలతో మొదలుపెట్టినం. ఇప్పుడు 36 మగ్గాలు నడిపిస్తున్నం. ఎనిమిది మందికి పని కల్పిస్తున్న. చెందేరి సిల్క్ బట్ట తయారు చేస్తున్నం. ఒక్కొక్కరు ఆరు మగ్గాలు చూస్తున్నరు. ఒక్కొక్క దానిపై 30 మీటర్ల వరకు ఉత్పత్తి అవుతుంది. అంటే ప్రతి ఒక్కరు 180 మీటర్లు నేస్తారు. మా యూనిట్‌లో రెండు షిఫ్టుల్లో రెండువేల మీటర్లకు పైగా ఉత్పత్తి చేస్తాం. మేం చేసేది జాబ్ వర్క్ మాత్రమే. వరంగల్‌లో మాలాంటి చిన్న వారికి కూడా అవకాశం కల్పిస్తే యూనిట్లు నెలకొల్పి కొందరికైనా పని కల్పిస్తాం.

1699

More News