ముమ్మరంగా స్మగ్లర్ల వేట


Tue,January 22, 2019 03:11 AM

Deputy mayor held for smuggling timber

-ప్రత్యేక బృందాలతో అడవుల జల్లెడ
-సామిల్లులపై అధికారుల ఆకస్మిక దాడులు
-ఇప్పటివరకు 249 మంది అరెస్ట్
-సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు
-నేటినుంచి కార్డన్‌సెర్చ్ తరహాలో సోదాలు
-స్మగ్లర్లతో చేతులు కలిపిన ముగ్గురు అధికారుల అరెస్ట్
-ఎస్పీని అభినందించిన సీఎం కేసీఆర్, పోలీసు ఉన్నతాధికారులు

ప్రత్యేక ప్రతినిధి/నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/నిర్మల్ క్రైం: కలప స్మగ్లర్లు, వన్యప్రాణుల వేటగాళ్లను పట్టుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా అటవీ, పోలీస్ అధికారులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. మంగళవారంనుంచి కార్డన్ సెర్చ్ తరహా లో అడవులను జల్లెడ పట్టాలని నిర్ణయించారు. అటవీ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ఈనెల 10 నుంచి దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు 499 గ్రామాల్లో దాడిచేసి, 249 మంది నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వేటగాళ్లపై 13 కేసులు బుక్‌చేశారు. అడవులను లూటీ చేసే స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని ఆదివారం శాసనసభలో సీఎం పునరుద్ఘాటించారు. దీంతో అటవీనేరాలను పూర్తిగా అదుపుచేయడానికి కార్డన్ సెర్చ్ తరహాలో మెరుపుదాడులు చేయనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 450 మంది కరడుగట్టిన నేరగాళ్లను గుర్తించారు. 310 సామిల్లులపై దాడిచేసి 480 మంది కార్పెంటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేని 294 దూగడ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. అటవీనేరాలకు అలవాటుపడ్డ 30 మంది నేరగాళ్లను (హ్యబిచువల్ అఫెండర్స్)ను అదుపులోకి తీసుకున్నా రు. మరోవైపు అటవీప్రాంతాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రచారం నిర్వహిస్తున్నట్టు అటవీశాఖ విజిలెన్స్, ఐటీ పీసీసీఎఫ్ రఘువీర్ తెలిపారు. ఇప్పటివరకు 555 గ్రామాల్లో ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రూ.70 లక్షల విలువచేసే కలపను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముమ్మర దాడులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలప స్మగ్లర్లు, వన్యప్రాణుల వేటగాళ్లపై అధికారులు ఉక్కుపాదం మొపుతున్నారు. ఉమ్మడి జిల్లా లో 7 లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉండగా.. ఇందు లో 2,01,500 హెక్టార్లలో కవ్వాల్ పులుల రక్షితప్రాంతం ఉన్నది. ప్రస్తుతం స్మగ్లర్లు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న టైగర్ రిజర్వ్‌ను లక్ష్యంగా చేసుకొని కలప అక్రమరవాణా చేస్తున్నారు. స్మగ్లర్లతోపాటు రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, పలువురు అధికారుల సమన్వయంతోనే ఈ దందా సాగుతున్నదనేది బహిరంగరహస్యం. మరోవైపు పెద్దపులులు, చిరుతలు, నీలుగాయిలు వంటి అటవీ జంతువులను హతమారుస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు పెద్దపులులు, రెండు చిరుతలు ఉచ్చులకు బలయ్యాయి. వీరి ఆగడాలను అడ్డుకునేందుకు అటవీశాఖ విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి.

స్మగ్లర్లతో చేతులుకలిపిన అధికారులపై కన్నెర్ర

అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నా రు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ నుంచి ముధోల్ వరకు అటవీశాఖ అధికారులు సినీఫక్కీలో వెంబడిం చి కలపను పట్టుకున్నారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెం ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆవరణలో నిల్వచేసిన రూ.50 లక్షలు విలువైన కలపను గత ఏడాది జూన్ 24న స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లతో చేతులు కలిపిన డీఎఫ్‌ఆర్‌వో ప్రవీణ్ మహాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. డీఎఫ్‌ఆర్‌వోను సస్పెండ్‌చేశారు. ఖానాపూర్ డివిజన్ సత్తెనపల్లి సెక్షన్‌లో కలపను తరలిస్తుండగా బీట్ ఆఫీసర్, ఎఫ్‌ఎస్‌వో స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు వాహనంతోసహా పారిపోవటంతో ఇద్దరు అధికారులను బాధ్యులను చేస్తూ సస్పెండ్‌చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో గతంలో వెదురు బొంగులను అక్రమంగా సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఓ అధికారిపై విచారణ చేపట్టారు.

వేటగాళ్లతో చేతులు కలిపిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటున్నారు. స్మగ్లర్లు నిర్మల్ జిల్లా కోటపల్లి మండలం ఇన్నా రం వద్ద విద్యుత్ తీగలు అమర్చగా 2015 డిసెంబర్ 3న పెద్దపులి మృతిచెందింది. ఈ ఘటనలో చెన్నూర్ బీట్ ఆఫీసర్ అంజారి, సెక్షన్ ఆఫీసర్ నరేశ్‌ను సస్పెండ్‌చేశారు. 2018లో పెంబి మండలం పుల్గంఫాండ్రి వద్ద విద్యుత్ తీగలకు చిక్కి మరో పెద్దపులి చనిపోయింది. వేటగాళ్లు చర్మాన్ని విక్రయించేందుకు వెళ్తుండగా ఇచ్చోడ వద్ద పట్టుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు గుగ్లావత్ ప్రకాశ్ ఇంట్లో అటవీశాఖ అధికారులు గత ఏడాది డిసెంబర్ 31న పది కిలోల నీలుగాయి మాంసం పట్టుకున్నా.. కేసు నమోదు చేయలేదని తేలింది. ఈ వ్యవహారంలో పెంబి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హఫీజుద్దీన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎంఏ రషీద్, బీట్ ఆఫీసర్ వసంత్‌పై సస్పెన్షన్ వేటు వేసి, క్రిమినల్ కేసులు నమోదుచేశారు. నిందితులను అరెస్టు చేశారు. తాజాగా మంచిర్యాలలో అడవి జంతువులను వేటాడుతున్న 9 మందిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.

నిర్మల్‌లో అక్రమ కలప పట్టివేత

ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్‌కు ఐషర్ వాహనం లో అక్రమంగా తరలిస్తున్న కలపను నిర్మల్ జిల్లా పోలీసులు సోమవారం చేజ్‌చేసి పట్టుకున్నారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకోవడంతోపాటు కలప స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉన్న ఇద్దరు అటవీ అధికారులు, ఓ పోలీసు అధికారిని అరెస్ట్‌చేశారు. నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు తెలిపిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రాంతంనుంచి నిజామాబాద్‌కు ఐచర్ వాహనంలో కలపను అక్రమంగా తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు నిర్మల్ పట్టణ, రూరల్ సీఐలు జాన్ దివాకర్, శ్రీనివాస్‌రెడ్డి, రూరల్ ఎస్సై రాజు వాహనాల తనిఖీ నిర్వహించారు. కలప తరలిస్తున్న వాహనంతోపాటు అందులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఐషర్‌కు ముందు వెళ్తున్న ఓ కారులో ఆరుగురు స్మగ్లర్లు వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించి వెంబడించారు. దుండగులు పోలీసు జీపును ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నంచేసి.. చివరికి పట్టుబడ్డారు.

ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. కారులో స్మగ్లర్లు మహ్మద్ వాజిద్, సమద్, జబ్బర్ ఖాన్, షేక్ ఇబ్రహీం, రఫూతోపాటు ఏఆర్ ఎస్సై షకీల్ పాషా ఉన్నట్టు గుర్తించారు. వీరందరినీ అరెస్ట్‌చేశారు. 15 మంది స్మగ్లర్లతోపాటు కలప అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్న ఉట్నూర్ ఎఫ్‌ఎస్‌వో రాజేందర్, నిర్మల్ జిల్లా సోన్ చెక్‌పోస్టు సిబ్బంది సద్దాం, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏఆర్ ఎస్సై షకీల్‌పై పీడీ యాక్టు నమోదుచేశామని ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ రూ.16.52 లక్షలు ఉంటుందన్నారు. స్మగ్లర్లను అదుపులోకితీసుకున్న ఎస్పీ శశిధర్‌రాజుతోపాటు సిబ్బందిని సీఎం కేసీఆర్, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

1666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles