-పదిగంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం
-రేపు సీఎం కేసీఆర్ సమాధానం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నాలుగు రోజుల సెలవుల తరువాత అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. ఉదయం పదిగంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభంకానున్నది. ఆశ్రమ పాఠశాలలు, ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జీహెచ్ఎంసీలో మురుగునీటి శుద్ధికేంద్రాల సామ ర్థ్యం పెంపు, సంచార పశువైద్యశాలలు, హైదరాబాద్‌లో ఐదురూపాయల భోజనకేంద్రాల పెంపు, గొర్రె పాకల మంజూరు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనం, వ్యవసాయ వాహనాలపై పన్ను మినహాయింపు, కల్యాణలక్ష్మి పథకాలపై సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనున్నది. అనంతరం జీరో అవర్ ఉంటుంది. ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రులు చెరుకు ముత్యంరెడ్డి, ముఖేశ్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే సోమగోపాల్‌కు సభ సంతాపం తెలుపనున్నది. అనంతరం బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది. బడ్జెట్‌పై అన్ని పక్షాలసభ్యులు ప్రసంగించే అవకాశముంది. టీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, గండ్ర వెంకటరమణారెడ్డి ప్రసంగిస్తారని తెలుస్తున్నది. బడ్జెట్‌పై చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సమాధానమిస్తారు.
మండలిలో..
మండలి కూడా పదిగంటలకు ప్రారంభంకానున్నది. ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ ప్రారంభిస్తారు. టీఆర్ఎస్ తరఫున పురాణం సతీశ్ మాట్లాడతారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆదివారం బడ్జెట్‌పై మండలిలో సమాధానమిస్తారు.