తెలుగు భాషకు ప్రాధాన్యమివ్వాలిSun,August 13, 2017 01:57 AM

-పాఠశాలల్లో తప్పనిసరి చేయాలి
-కేంద్రమంత్రి దత్తాత్రేయ సూచన

dattatreya-ravva
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ ఉత్తరప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరుగాలని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించాలని కేంద్ర ఉపాధి, కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఆచార్య రవ్వా శ్రీహరి పంచసప్తతి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన శ్రీహరి సమగ్ర రచనల సాహితీ సమాలోచనం సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. రవ్వా శ్రీహరి ఆదర్శవంతమైన సాహితీవేత్త అంటూ కొనియాడారు. నిఘంటువులు, పదకోశాలు, అనువాదాలతో సాహిత్యాన్ని జన సామాన్యానికి చేరువ చేశారన్నారు. ఇంగ్లిష్ ప్రభావం పెరుగుతున్న ప్రస్తుతం తరుణంలో పత్రికలే తెలుగును సజీవంగా ఉంచుతున్నాయని పేర్కొన్నారు. విశిష్ట అతిథి తెలుగుయూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ అనే పేరెత్తలేని కాలంలోనే రవ్వా శ్రీహరి నల్లగొండ మాండలిక పదకోశాన్ని రూపొందించారని చెప్పారు.

కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు కోవెల సుప్రసన్నాచార్యులు మాట్లాడుతూ సాహితీరంగంలో ఒకప్పటి స్థాయి పండితులు ఇపుడు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీహరి శాస్త్రీయదృష్టి గల వ్యక్తి అని కొనియాడారు. నిఘంటువు రూపకల్పనలో మౌఖిక సాహిత్యం మొదలు అన్ని రకాల సాహితీ పదప్రయోగాలను స్వీకరించాల్సి ఉంటుందని, అలాంటి ప్రయత్నమే శ్రీహరి చేశారన్నారు. ఇంగ్లిషు పదాలకు సమానార్థాలకోసం సంస్కృతంపై ఆధారపడాల్సి వస్తుందని, అందుకోసమైనా సంస్కృత అభ్యాసం కొనసాగించాలని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖా మాజీ అధ్యక్షుడు కసిరెడ్డి వెంకటరెడ్డి సభకు అధ్యక్షత వహించగా తెలుగు అకాడమి పూర్వ సంచాలకుడు యాదగిరి, పిల్లలమర్రి రాములు తదితరులు పాల్గొన్నారు. రవ్వా శ్రీహరి విమర్శ - పరిశోధన గ్రంథాలపై, భాషా వ్యాకరణాలపై శ్రీరంగాచార్య, మసన చెన్నప్ప, వైద్యం వేంకటేశ్వరాచార్యులు, జీ చెన్నకేశవరెడ్డి పత్రాలను సమర్పించారు.

517

More News

VIRAL NEWS