మహానగరానికి జలశోభFri,April 21, 2017 02:38 AM

హైదరాబాద్‌లో నాలుగు రిజర్వాయర్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
గడువుకన్నా ముందే పట్టణ భగీరథ ఫలాలు.. వేసవిలోనూ మెరుగైన నీటి సరఫరా
ఈసారి వర్షాలు బాగా పడితే నగరంలో రోజూ నీటి సరఫరా

ktr
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఒక్కోవ్యక్తికి రోజుకు 150 లీటర్ల చొప్పున మంచినీటిని అందజేయటం లక్ష్యంగా హైదరాబాద్ నగరంలో నీటిసరఫరాను మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారని, ఈ మేరకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్యను సవాల్‌గా తీసుకున్నామన్నారు. దీంట్లోభాగంగానే శివారు ప్రజలకు మెరుగైన నీటి సరఫరా కోసం రూ.1900 కోట్లతో 56 భారీ రిజర్వాయర్ల నిర్మాణాన్ని, 1800 కి.మీ.ల పైపులైన్ విస్తరణ పనులను చేపట్టామని, వీటిద్వారా అదనంగా లక్ష నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయనున్నామని తెలియజేశారు. అనుకున్నదానికన్నా 11 నెలలు ముందుగానే 12 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యిందని, వీటిలో నాలుగింటిని ప్రస్తుతం ప్రారంభిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో తొలి విడతగా గోపన్‌పల్లి, నలగండ్ల, కేపీహెచ్‌బీ ఫేజ్-4, హుడా మియాపూర్ ప్రాంతాల్లోని రిజర్వాయర్లను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. నిర్ణీత గడువుకన్నా ముందే పట్టణ భగీరథ పథకం ఫలాలు ప్రజలకు అందుతున్నాయని చెప్తూ, జలమండలి, ఏజెన్సీల పనితీరును కేటీఆర్ ప్రశంసించారు. హైదరాబాద్‌లో 160 బస్తీలలో రోజూ తాగునీటిని సరఫరా చేస్తున్నామని, ఈసారి సమృద్ధిగా వర్షాలు పడితే ఈ సంవత్సరం చివరి నుంచి నగరవ్యాప్తంగా ప్రతిరోజూ నీటిని సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్ జనాభా ఐదు రెట్లు పెరిగినా సరిపోయేలా 20 టీఎంసీల సామర్థ్యంతో శామీర్‌పేటలోని కేశవాపూర్ దగ్గర రూ.7700 కోట్లతో భారీ రిజర్వాయర్ నిర్మిస్తున్నామని చెప్పారు.

రిజర్వాయర్ల ప్రారంభోత్సవంతోపాటు నలగండ్ల, ముల్కం చెరువులను కేటీఆర్ తనిఖీ చేశారు. కూకట్‌పల్లిలో రూ.3 కోట్లతో నిర్మించిన నాలాబ్రిడ్జ్ పనులను ప్రారంభించారు. అన్ని రంగాల్లో హైదరాబాద్ నగరం సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి రూ.1000 కోట్లు, జలమండలికి రూ.1400 కోట్లను కేటాయించామన్నారు. వీటితోపాటు ప్రత్యేక రుణాలను సమకూర్చుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్ల వ్యయంతో నగరంలోని రోడ్లను, మూసీని అభివృద్ధి చేయనున్నామన్నారు. వివిధ అంశాలపై కేటీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ప్రజల భాగస్వామ్యంతోనే పురపాలన


పురపాలన అంటేనే ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలన. కోటి జనాభా ఉన్న నగరం ప్రజల భాగస్వామ్యం లేకుండా.. కేవలం కొన్ని వేలమంది ఉద్యోగులతో బాగుపడుతుందని అనుకోవద్దు. నగరాభివృద్ధి అన్నది జీహెచ్‌ఎంసీకో, జలమండలికో మాత్రమే పరిమితమైన అంశం కాదు. కాలనీ, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు వంటివన్నీ తమవంతు పాత్రను నిర్వర్తించాలి. ప్రభుత్వానికి తోడుగా కలిసి రావాలి. అందరం కలిసికట్టుగా హైదరాబాద్‌ను సేఫ్ అండ్ క్లీన్ సిటీగా మార్చుకుందాం.

నిరసనలు లేని కొత్త దృశ్యం


ఎండాకాలం వచ్చిందంటే ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయం ముందు ప్రతిపక్ష పార్టీలు ఖాళీబిందెలు, కుండలతో నిరసన ప్రదర్శనలు చేపట్టేవారు. క్యాలెండర్ మాదిరిగా ఒకరోజు కాంగ్రెస్, మరొకరోజు బీజేపీ, ఇంకోరోజు టీడీపీ.. రోజుల వారీగా ధర్నాలు జరిగేవి. నిరసనకారులపై లాఠీ చార్జీలు, మంచినీటికి తిప్పలంటూ పత్రికల్లో వార్తలు.. ఇది ఒకనాటి పరిస్థితి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మంచినీటి సరఫరాను గణనీయంగా మెరుగుపర్చి, నిరసనలు చేపట్టాల్సిన అవసరమే లేని పరిస్థితులను తీసుకొచ్చాం. శేరిలింగంపల్లి ఒక మినీ భారతదేశం. ఇక్కడ పలు రాష్ర్టాలకు చెందిన ప్రజలు స్థిరపడ్డారు. తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో ఇక్కడ అనేక అపోహలు సృష్టించారు. తెలంగాణ వస్తే ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ బురద జల్లేందుకు ప్రయత్నించారు. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, హోంమంత్రి నాయిని పర్యవేక్షణలో నగరంలో నేరాలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశమే గర్వపడేవిధంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పటిష్ఠంగా అమలవుతున్నాయి.
ktr1

ఆరునెలల్లోనే కరెంటు సమస్యను అధిగమించాం


ఉమ్మడి ఏపీ హయాంలో హైదరాబాద్ నగరంలో రెండు ప్రధాన సమస్యలు ఉండేవి. ఎండాకాలం వచ్చిందంటే కరెంటుకోతలు లేని రోజంటూ ఉండేది కాదు. ఇండ్లల్లో ఉక్కపోతకు తట్టుకోలేక చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చదువుకోవటానికి కరెంటు లేక సతమతమయ్యేవారు. చిన్న జ్యూస్ సెంటర్ల నుంచి పెద్ద దుకాణాల వరకూ వ్యాపారస్థులు జనరేటర్లు పెట్టుకోక తప్పని పరిస్థితి ఉండేది. ఆఖరుకు పరిశ్రమల యజమానులు తమ వద్ద పని చేసే కార్మికులకు ఉపాధి కల్పించలేని విధిలేని పరిస్థితిలో కరెంట్ ఇవ్వండి మహాప్రభో అంటూ ధర్నాలు చేశారు. ఈ నేపథ్యంలో, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ కరెంట్ సమస్యను అధిగమించటానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన కార్యదక్షత కారణంగానే మూడు సంవత్సరాల్లో పోతుందనుకున్న కరెంట్ సమస్యను కేవలం ఆరు నెలల్లోనే పరిష్కరించగలిగాం. ప్రస్తుతం ఎర్రటి ఎండల్లో కూడా నిరంతర విద్యుత్‌ను అందించగలుగుతున్నాం. రాష్ట్రమంతటా ప్రతీ ఇంటికి నాణ్యమైన కరెంట్‌ను సరఫరా చేస్తున్నాం. మనందరికీ అన్నం పెట్టే రైతన్నల కోసం ఏ రాత్రిపూటో కాకుండా పట్టపగలే తొమ్మిది గంటల నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నాం.

జీవన ప్రమాణాలు పెంచుతాం


హైదరాబాద్‌లో జీవన ప్రమాణాలు పెంచేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. నాణ్యమైన కరెంట్, మంచినీటి సరఫరాతోపాటు శాంతిభద్రతలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కరెంట్, మంచినీరు, శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులతోనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలుంటేనే ఇండ్ల కొనుగోళ్లు జరుగుతాయి. అప్పుడే నిర్మాణరంగం బాగుంటుంది. ఆ రంగంపై ఆధారపడే సిమెంట్ తదితర పరిశ్రమలు నడుస్తుంటాయి. ఇదంతా ఒకదాంతో ఒకటి ముడివేసుకున్న అంశం కాబట్టే.. సీఎం కేసీఆర్ సమగ్రమైన ప్రణాళికతో కరెంట్, మంచినీరు, శాంతిభద్రతలపై దృష్టి పెట్టి విజయం సాధించారు.

ఇంటింటికీ తాగునీరు ఘనత కేసీఆర్‌దే: నాయిని


మిషన్ భగీరథ కింద ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగరంలో గతంలో మంచినీటి సరఫరా అధ్వాన్నంగా ఉండేదని, ప్రస్తుతం గోదావరి, కృష్ణా, మంజీరాలతో మెరుగైన సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, జలమండలి ఎండీ దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు వెంకటేశ్వరరావు, జగన్, గంధం రాములు, చలపతిరావు, నాగేందర్‌గౌడ్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

1666

More News

VIRAL NEWS