ఏపీలో రవిప్రకాశ్!


Wed,May 15, 2019 02:08 AM

Cyberabad police serves third notice to TV9 Ravi Prakash

-నేటి ఉదయం విచారణకు రావాలంటూ సైబర్‌కైమ్ పోలీసుల నోటీసులు
-హాజరుకాకపోతే అరెస్ట్ తప్పదు!
-ముందస్తు బెయిల్ యత్నాల్లో రవిప్రకాశ్?

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: టీవీ9 యజమాన్య వివాదంలో ఫోర్జరీ కేసులో ఇరుక్కున్న మాజీ సీఈవో రవిప్రకాశ్.. ఏపీలో తలదాచుకుంటున్నారని తెలుస్తున్నది. బుధవారం ఉదయం పదకొండు గంటలకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల ఎదుట రవిప్రకాశ్ హాజరుకావాల్సి ఉన్నది. అయితే.. ఆ సమయానికి ఆయన వస్తారా? రారా? అనే విషయంలో చర్చ జరుగుతున్నది. సంతకాల ఫోర్జరీపై పక్కా ఆధారాలతో ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదుచేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారని సమాచారం. ఫిర్యాదుదారుడు అందించిన ఆధారాలను వాటితో సరిపోల్చడంతోపాటు.. రవిప్రకాశ్ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టాలనే అంశాలపై ఇప్పటికే సైబర్‌క్రైమ్ పోలీసులు ప్రశ్నావళిని సిద్ధంచేసుకున్నారని తెలుస్తున్నది. విచారణలో ఆయన వెల్లడించే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

రవిప్రకాశ్ ఫోర్జరీ చేశాడని చెప్తున్న సంతకంతోపాటు ఫోర్జరీకి గురైన వ్యక్తి అసలు సంతకాన్ని పోలీసులు ఇదివరకే సేకరించారు. ఆ రెండింటినీ పోల్చటంతోపాటు వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, ప్రాథమిక నివేదిక కూడా తెప్పించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటే పోలీసులకు దొరుకడం ఖాయమని రవిప్రకాశ్ భావించి, ఏపీకి వెళ్లిపోయారని చెప్తున్నారు. అక్కడి ప్రస్తుత అపద్ధర్మ ప్రభుత్వ పెద్దలతో తనకున్న సత్సంబంధాలతో అక్కడే కొన్నాళ్లు తలదాచుకోవాలని రవిప్రకాశ్ భావిస్తున్నారన్న చర్చ నడుస్తున్నది. దీనితోపాటు ముందస్తు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలను కూడా మొదలు పెట్టినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో విచారణకు రవిప్రకాశ్ హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పోలీసులు సైతం చర్చించుకుంటున్నారు.

అరెస్ట్‌కు అవకాశాలు..

రవిప్రకాశ్‌తోపాటు సినీనటుడు శివాజీకి సీఆర్పీసీ 160 సెక్షన్ కింద సైబరాబాద్ పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. వీటికి ఇద్దరూ స్పందించలేదు. దీంతో సోమవారం రాత్రి మరోసారి సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీచేశారు. తాజా నోటీసుల ప్రకారం విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే. అప్పటికీ విచారణకు రాకుంటే అరెస్టు చేసేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు. బుధవారం రవిప్రకాశ్ విచారణకు హాజరుకాకుంటే, పోలీసులు న్యాయసలహా తీసుకొని, అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెప్తున్నారు.

4982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles