పారని రవిప్రకాశ్ పాచిక


Sat,May 25, 2019 02:50 AM

Cyberabad Police 41A Notice To TV9 Ravi Prakash

-ఎన్సీఎల్టీలో చుక్కెదురు
-ఏబీసీఎల్, సైఫ్ మారిషస్ కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం
-ఒప్పందాన్ని అంగీకరించిన ఎన్సీఎల్టీ
-శివాజీ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో టీవీ9 యాజమాన్యానికి (ఏబీసీఎల్) వ్యతిరేకంగా సైఫ్ మారిషస్ ఫైనాన్స్ కంపెనీ వేసిన పిటిషన్‌ను ఆధారం చేసుకొని యాజమాన్య బదిలీని అడ్డుకోవాలని ఆ చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ వేసిన పాచిక పారలేదు. షేర్ల కొనుగోలుకు సంబంధించిన వివాదాన్ని తాము పరిష్కరించుకుంటామని ఎన్సీఎల్టీలో సైఫ్ మారిషస్, ఏబీసీఎల్ తెలియజేయడంతో వివాదం సద్దుమణిగింది. రెండు కంపెనీల మధ్య సయోధ్య కుదరడంతో ఏబీసీఎల్‌పై సైఫ్ మారిషస్ తాను వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఇందుకు ఎన్సీఎల్టీ ఆమోదం తెలుపడంతో రవిప్రకాశ్ వ్యూహానికి బ్రేక్ పడింది. మరోవైపు తాను కూడా టీవీ9లో షేర్లు కొన్నానంటూ.. ఈ వివాదంలో తనను కూడా చేర్చాలని సినీనటుడు శివాజీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ (ఇంటర్ లొకేటరీ అప్లికేషన్-ఐఏ)ను ఎన్సీఎల్టీ తిరస్కరించింది.

రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధం..!

మరోవైపు రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సీఆర్పీసీ 160, సీఆర్పీసీ 41(ఏ) సెక్షన్ కింద రెండుసార్లు కలిపి మొత్తం మూడుసార్లు సైబరాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీచేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కూడా చట్ట ప్రకారం నడుచుకోవాలని రవిప్రకాశ్‌కు సూచించిప్పటికీ, ఆయన అజ్ఞాతం వీడకపోవడంతో పోలీసులు అరెస్టుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. రవిప్రకాశ్ కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టిన సైబరాబాద్ పోలీసులు.. ఆయన జాడకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. రవిప్రకాశ్ ఏపీలోని కొందరు రాజకీయనాయకుల అండతో అక్కడి రిసార్టుల్లో తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

ఆ మేరకు గాలింపు ముమ్మరంచేశారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఏపీలో ఫలితాల తర్వాత రవిప్రకాశ్ ఆంధప్రదేశ్ నుంచి పలాయనం చిత్తగించి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో తలదాచుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. కేసులో అత్యంత కీలకమైన రవిప్రకాశ్‌ను అరెస్టు చేస్తేనే కీలక విషయాలు బయటపడుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే సేకరించిన హార్డ్‌డిస్క్‌లు, ఇతరపత్రాలను ఎఫ్‌ఎస్సెల్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ) కు పంపామని, ఆ నివేదికలు వస్తేనే మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు నమస్తే తెలంగాణకు తెలిపారు.

3803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles