చట్టం తనపని తానుచేసింది

Sat,December 7, 2019 03:15 AM

-ఆధారాల సేకరణలో ఎదురు తిరిగిన నిందితులు
-పోలీసులపై కాల్పులు జరుపడంతో ఎన్‌కౌంటర్
-తెల్లవారుజామున అరగంటపాటు ఎదురుకాల్పులు
-నలుగురు నిందితులూ హతం
-నిందితులదాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు
-మీడియాకు వెల్లడించిన సీపీ సజ్జనార్

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దిశ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోయిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ చెన్నప్ప సజ్జనార్ అన్నారు. దిశ కేసులో నలుగు రు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఘటన వివరాలను ఘటనాస్థలం వద్దే ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. చటాన్‌పల్లి బైపాస్ వద్ద దిశను దహనం చేసిన ప్రాంతంలో క్రైమ్‌సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితులు పోలీసులపై దాడికి దిగారని, తుపాకులను గుంజుకొని కాల్పులు జరిపారని తెలిపారు. ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు హతమయ్యారని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజాము 5.45 నుంచి 6.15 గంటల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలిపారు. ఆ సమయంలో నిందితుల చేతులకు బేడీలు లేవని, పోలీసుల వద్ద ఉన్న తుపాకులు కూడా అన్‌లాక్ చేసి ఉన్నాయని చెప్పారు. కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలో విచారించిన క్రమంలో బాధితురాలి సెల్‌ఫోన్, పవర్‌బ్యాంక్, వాచ్, ఇతర వస్తువులను దాచిన స్థలంతోపాటు మరిన్ని ఆధారాలు చూపుతామని నిందితులు చెప్పారన్నారు. దీంతో వారిని తెల్లవారుజామున పదిమంది సాయుధ స్పెషల్ పార్టీ సిబ్బంది.. చటాన్‌పల్లిలో దిశను నిందితులు దహనంచేసిన స్థలానికి తీసుకెళ్లారని వివరించారు.

నలుగురు ఒక్కటయ్యారు.. తిరగబడ్డారు

ఘటనాస్థలికి తీసుకెళ్లిన తర్వాత.. సెల్‌ఫోన్‌ను ఫలానచోట దాచిపెట్టామంటూ పోలీసులను తికమకపెట్టేందుకు ప్రయత్నించారని సజ్జనార్ తెలిపారు. ఒక సమయంలో ఆరిఫ్, చెన్నకేశవులు సెల్‌ఫోన్ దాచిన ప్రదేశం గురించి ఒకవైపు.. నవీన్, శివ మరోవైపు చూపించారన్నారు. పోలీసులు గాలిస్తున్న సమయంలో ఆ నలుగురు ఒక దగ్గరకు చేరారని, మహ్మద్ పాషా, చెన్నకేశవులు పోలీసుల వద్ద ఉన్న తుపాకులను లాక్కొని పారిపోగా, మిగిలిన ఇద్దరూ వారివెంట పరారయ్యారని చెప్పారు. పారిపోతున్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా నవీన్, శివ రాళ్లు, కర్రలతో దాడికి దిగారని వివరించారు. దీంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, తుపాకులు అక్కడే వదిలేసి లొంగిపోవాలని పోలీసులు వారిని పదేపదే హెచ్చరించారని చెప్పారు. సుమారు 300 మీటర్ల దూరం పారిపోయారని, ఈ సమయంలో వారిని వెంబడించిన పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ దశలో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎదురుకాల్పులు జరిపారని వివరించారు. అరగంటపాటు సాగిన కాల్పుల్లో నలుగురు నిందితులు మృతి చెందారని చెప్పారు. రాళ్లు, కర్రలతో నిందితులు జరిపిన దాడిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవిందగౌడ్ తలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వీరు హైదరాబాద్‌లోని కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్నారన్నారు. నిందితులు నలుగురూ కరడుగట్టిన నేరస్థులని, తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల్లో వీరిపై ఏమైనా దిశ తరహా కేసులు నమోదయ్యాయా? అనే విషయంలో ఆరా తీస్తున్నామని తెలిపారు.

శాస్త్రీయంగా అనేక ఆధారాలు సేకరించాం

దిశ ఘటనలో నలుగురు నిందితులను గుర్తించేందుకు అనేక శాస్త్రీయ ఆధారాలను సేకరించామని సీపీ సజ్జనార్ చెప్పారు. నిందితుల డీఎన్‌ఏ నమూనాలు కూడా తీసుకున్నామని తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై వస్తున్న విమర్శలు, ఎన్‌హెచ్చార్సీ నోటీ సు తదితర అంశాలను మీడియా ప్రస్తావించగా.. చట్టం తన పని తాను చేసిందని మాత్రమే తాను చెప్పగలనని అన్నారు. ఎన్‌కౌంటర్ విషయంలో ప్రభుత్వానికి, ఎన్‌హెచ్చార్సీకి నివేదికలు పంపుతామని, వారి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్తామని తెలిపారు. నిందితులను తెల్లవారుజామున ఘటనాస్థలానికి ఎందుకు తీసుకువెళ్లారన్న ప్రశ్నకు.. షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని ప్రస్తావిస్తూ.. నిందితులు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారని, అందుకే తెల్లవారుజామున తీసుకెళ్లాల్సి వచ్చిందన్నారు.

తొలుత దిశ ఘటన పూర్వాపరాలు వెల్లడిస్తూ.. గతనెల 27న సాయంత్రం దిశ.. గచ్చిబౌలి వెళ్లే క్రమంలో తన బైక్‌ను తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద పార్క్‌చేశారని, తిరిగి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వచ్చారని తెలిపారు. ఆ సమయంలో అక్కడే మాటువేసిన దుండగులు మహ్మద్ పాషా, చెన్నకేశవులు, నవీన్, శివ.. పథకం ప్రకారం ఆమె బైక్ టైర్‌లో నుంచి గాలి తీసేశారని, బండికి పంక్చర్‌వేయించుకొని వస్తామని మాయమాటలు చెప్పి.. ఆమెను కిడ్నాప్‌చేసి లైంగికదాడికి పాల్పడ్డారని, అనంతరం హతమార్చి.. మృతదేహాన్ని లారీలో 28 కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్లి.. చటాన్‌పల్లి అండర్‌పాస్ వద్ద దహనం చేశారని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న షాద్‌నగర్, శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు.. 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్‌చేసి 30వ తేదీన కోర్టులో హాజరుపరిచారని వెల్లడించారు. కోర్టు అనుమతితో నిందితులను 3వ తేదీన చర్లపల్లి జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకొని విచారించారని తెలిపారు. ఈ విచారణలో దిశ ఫోన్, వాచ్, పవర్‌బ్యాంక్ దాచిపెట్టిన స్థలంలోపాటు మరిన్ని ఆధారాలను చూపిస్తామంటూ చెప్పడంతో నిందితులను పదిమంది సాయుధ స్పెషల్ పార్టీ సిబ్బంది దిశను దహనంచేసిన ప్రాంతానికి తీసుకెళ్లారన్నారు. ఈ సమావేశంలో శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ డీసీపీలు ప్రకాశ్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, పద్మజ, క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, షీ టీమ్స్ డీసీపీ అనసూయ, ఎస్వోటీ అదనపు డీసీపీ సందీప్ పాల్గొన్నారు.

24రౌండ్ల కాల్పులు

నిందితులు షార్ట్‌గన్స్ లాక్కుని కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 24 రౌండ్ల కాల్పులు జరిగినట్టు వెల్లడించారు. ఘటనాస్థలంలో ఎనిమిది బుల్లెట్ సెల్స్ స్వాధీనంచేసుకున్నారు. మిగతా బుల్లెట్లు నిందితుల శరీరంలోకి, మరికొన్ని పొలాల్లోకి దూసుకెళ్లి ఉంటాయని భావిస్తున్నారు. కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు సీపీ సజ్జనార్ వివరించారు.

మహిళలు ఆత్మరక్షణ చిట్కాలు నేర్చుకోవాలి: సత్యం, పాల వ్యాపారి

నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంలో ఎలాంటి తప్పులేదని దిశ దహనం కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పాల వ్యాపారి సామ ల సత్యం అన్నారు. మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా, ఆత్మరక్షణ చిట్కాలు నేర్చుకోవాలని సూచించారు. తనకు కరాటేలో బ్లాక్‌బెల్ట్ ఉన్నదని, చాలామందికి ఆత్మరక్షణ చిట్కాలను నేర్పించానని తెలిపారు.

స్థిరంగా ఎస్సై, కానిస్టేబుల్ ఆరోగ్యం

-కేర్‌లోని ఐసీయూలో చికిత్స బులెటిన్ విడుదలచేసిన వైద్యులు
శేరిలింగంపల్లి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనలో గాయపడిన ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నదని గచ్చిబౌలి కేర్ దవాఖాన యాజమాన్యం తెలిపింది. దవాఖాన మెడికల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ డాక్టర్ గోపీకృష్ణ శుక్రవారం మెడికల్ బులెటిన్‌ను విడుదలచేశారు. షాద్‌నగర్‌లో నిందితుల దాడిలో గాయపడిన వీరిద్దరినీ కేర్ దవాఖానకు తరలించగా.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెంకటేశ్వర్లుకు రాయి తగలడంతో తల ముందుభాగంలో, అరవింద్‌గౌడ్‌కు కర్ర తగలడంతో ఎడమచేయి, భుజాలకు గాయాలయ్యాయని, ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం స్థిరంగానే ఉన్నదని వైద్యులు తెలిపారు.

2708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles