మాది పేదల సర్కారు

Tue,March 21, 2017 03:00 AM

కేసీఆరే అసలు సిసలు కమ్యూనిస్టు..
మేం అమలు చేస్తున్నది కమ్యూనిస్టు ఎజెండానే
-డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో మనం ప్రత్యేకం
-మన కార్యక్రమాలు కేరళవారికి నచ్చినా.. ఇక్కడి వారికి నచ్చలేదు
-వరంగల్ అర్బన్‌లోని గుడిసెవాసులకు పట్టాలు
-మీ ముఖాల్లో చిరునవ్వులు రావాలి : మంత్రి కేటీఆర్
-టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు.. వరంగల్ జిల్లా సీపీఎం ఖాళీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ రూ.1.49లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్టే ఇందుకు నిదర్శనమన్నారు. ఏ సమసమాజం కోసం ఇన్నాళ్లు పోరాటం చేశారో అది ఇవాళ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని నమ్మి మీరు వచ్చారు. అసలు సిసలు కమ్యూనిస్టు సీఎం కేసీఆరే. పార్టీ పేరులో కమ్యూనిస్టు అనే పదం లేకున్నా.. కమ్యూనిస్టు ఎజెండానే అమలు చేస్తున్నాం అన్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల నుంచి సీపీఎంకు రాజీనామా చేసి భారీగా తరలివచ్చిన నాయకులు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. టీడీపీ హయాంలో ఎవరైనా చనిపోతేనే వారి స్థానంలో మరొకరికి కొత్తగా వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఉండేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన 200 రూపాయలు వృద్ధులకు మందులకు కూడా సరిపోయేవి కావని అన్నారు. మన సీఎం కేసీఆర్ వెయ్యి రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు.
K_T_RAO
రాష్ట్రంలో 40లక్షల మంది పెన్షనర్లకు రూ.5300కోట్లు ఖర్చుచేస్తున్నారు అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మనిషికి నాలుగు కిలోలు, కుటుంబానికి గరిష్ఠంగా 20కిలోలు రేషన్ బియ్యం ఇస్తే మన ప్రభుత్వం మనిషికి 6కిలోల చొప్పున ఎంత మంది ఉన్నా అందరికీ ఇస్తున్నదని కేటీఆర్ వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ పేరిట ఇరుకు గది కడితే.. దానికి ఏడు ఇండ్లతో సమానమైన ఇంటిని కడుతున్నామని చెప్పారు. విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టాలని ఏ తమ్మినేనీ మాకు లేఖ రాయలేదు. ముఖ్యమంత్రి మనుమడు, మనుమరాలు ఏ బియ్యం తింటున్నారో ఇవాళ స్కూళ్లలో చదువుతున్న పిల్లలు కూడా ఆ బియ్యమే తింటున్నారు అని కేటీఆర్ అన్నారు. మేనమామ కట్నం పెడుతడో లేదో కానీ సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడబిడ్డలకు రూ.75వేలు ఇస్తున్నారు. పేద గర్భిణులకు మూడు దఫాల్లో 12వేలు ఇచ్చేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. పుట్టిన పిల్లల ఆరో గ్యం కోసం కేసీఆర్ కిట్ అందించేందుకు రూ.600 కోట్లు కేటాయించాం.. అని చెప్తూ ఇది పేదల ప్రభుత్వమో పెద్దల ప్రభుత్వమో మీరంతా చెప్పాలని సభకు వచ్చిన వారిని కోరారు.
K_T_RAO0
తమ్మినేనికి నడక మంచిదే. ఆయుష్షు కూడా పెరుగుతుంది. కేరళ సీఎం పినరయి విజయన్ కేసీఆర్‌ను కలిసి, తెలంగాణలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆ తరువాత సీపీఎం బహిరంగ సభకు పోయి రెండు మాటలు మాట్లాడి పోయారు. ఇక్కడ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని కేరళవారికి అర్థమైంది కానీ మీకు మాత్రం అర్థం కాలేదు అని సీపీఎం నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. సీపీఎం జెండా ఎరుపుకానీ, వా రి గుండెల్లో అంతా నలుపు, కోపమే ఉందని మండిపడ్డారు. నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంటే అడ్డం పడిన సీపీఎం.. ఇవాళ బంగారు తెలంగాణకు అడ్డం పడుతున్నదని కేటీఆర్ విమర్శించారు. గుడిసెల్లో ఉన్నవారికి పట్టాలివ్వాలని నేతలు కోరారు. ఎల్లుండే ఆ జిల్లా కలెక్టర్‌ను, అధికారులను పిలిచి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం అని కేటీఆర్ తెలిపారు. మనది పేదల జెండా.. గులాబీ జెండా. మీ ముఖాల్లో చిరునవ్వులు చూడాలి. తప్పకుండా త్వరలోనే చిరునవ్వులు చూస్తాం అన్నారు.

మిమ్మల్ని నమ్మలేదు: కడియం


వరంగల్ జిల్లా ప్రజలు తమ్మినేని వీరభద్రాన్ని నమ్మలేదు కనుకే ఇవాళ సీపీఎంకు చెందినవారు పెద్ద ఎత్తు న తరలివచ్చి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పాదయాత్రలో తమ్మినేని చేసిన విమర్శలు తప్పని ఇవాళ్టి సభతో తేలిపోయిందని, ఇప్పటికైనా సీపీఎం నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణను సీపీఎం పెద్దలు అడ్డుకున్నారుకానీ, క్యాడర్ మాత్రం ఉద్యమానికి మద్దతిచ్చిందని ఎంపీ సీతారాం నాయక్ చెప్పా రు. ఏండ్ల తరబడి పనిచేసిన పార్టీని బంగారు తెలంగాణ కోసం మీరంతా వదిలిరావడం సంతోషంగా ఉం దని ఎంపీ పీ దయాకర్ అన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే కొండా సురేఖ తదితరులు కూడా మాట్లాడారు.

సీపీఎంలో అణిచివేత: మెట్టు శ్రీనివాస్


సీపీఎంలో అణిచివేత ఉంది కనుకే ప్రజల్లో ఆదరణ లభించడం లేదని టీఆర్‌ఎస్‌లో చేరిన సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యుడు మెట్టు శ్రీనివాస్ అన్నారు. నాలుగువేల కిలోమీటర్లు నడవడం ఆరోగ్యానికి చాలా మంచిదని, కానీ సీపీఎం ధోరణి మారకపోతే 2019 నాటికి పార్టీ కనుమరుగవుతుందన్నారు. 28ఏండ్లు సీపీఎంలో పనిచేసి ఎన్నో దెబ్బలు తిన్నానని, కేసులున్నాయని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలో నాటి ప్రమాణాలు లేవని, కార్పొరేట్ కంపెనీగా మారిపోయిందని విమర్శించారు. బంగారు తెలంగాణ కోస మే టీఆర్‌ఎస్‌లో చేరామన్నారు. ఇవ్వాళే తెలంగాణ తల్లి ఒడిలో పుట్టాను. బంగారు తెలంగాణ కోసమే జీవితాన్ని అంకితం చేస్తాను అని ఆయన ప్రకటించారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధిలో మందుకు వెళ్తున్నదని, అందుకే 10వేలమందితో కదిలొచ్చి టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు కొండా మురళి, శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ యాదవరెడ్డి, మాజీ ఎంపీ గుండు సుధారాణి, పూర్వ వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, గుడిమెల్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎంలో చేరింది వీరే


K_T_RAO2
టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మెట్టు శ్రీనివాస్, వరంగల్ కార్పొరేటర్ సోమిశెట్టి శ్రీలతాప్రవీణ్, జిల్లాకమిటీ సభ్యుడు దు బ్బ శ్రీనివాస్, ఖిలా వరంగల్ మండల కార్యదర్శి మర్రి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు పల్లం రవి, కొప్పుల శ్రీనివాస్, జిల్లాకమిటీ, నగరకమిటీ సభ్యు లు సురేశ్, మల్లేశం, చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆడెపు భిక్షపతి, నగరకమిటీ సభ్యుడు కా రు ఉపేందర్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు మెట్టు రవి, ఐద్వా జిల్లాఉపాధ్యక్షురాలు కాసు మా ధవి, నేత బూర మంజుల, డీవైఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు సంపత్, ప్రైవేటురంగంలో రిజర్వేషన్స్ సాధన కమిటీ కార్యదర్శి యాకయ్య, ప్రజానాట్య మండలి నగర కార్యదర్శి నరేశ్, మాజీ ఎంపీటీసీలు భిక్షపతి, రవీందర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శులు మేరుగు అశోక్, గడ్డం రవి, ఐనవోలు మండల కార్యదర్శి రవీందర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు శ్రీకాంత్, హోల్‌టైమర్లు కమలాకర్, రాజేందర్, గ్రేయిన్ మార్కెట్ గుమస్తాల సంఘం అధ్యక్షుడు మల్లేశం, హన్మకొండ మండల కార్యదర్శి అల్వాల రాజు, నగర మహిళా కార్యదర్శి రజిత, నాయకులు శైలజ, రేణుక, సుజిత, శంకర్, స్వామి, గాదే కుమార్, సులగం గోపాల్‌తో పాటు వేలమంది కార్యకర్తలు ఉన్నారు.

1074
Tags

More News

మరిన్ని వార్తలు...