కమ్యూనిస్టు యోధుడు ఉజ్జిని నారాయణరావు ఇకలేరు


Thu,July 14, 2016 02:21 AM

CPI former MLA Narayana Rao passes away

-ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి
-సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ, దేవరకొండ: స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు నేత, పేదల పెన్నిధి ఉజ్జిని నారాయణరావు(90) ఇకలేరు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో గత కొంత కాలంగా బాధపడుతున్న ఆయన ఎల్బీనగర్ కామినేని దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు.
narayanarao
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి 1985-99 కాలంలో సీపీఐ పార్టీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
రైతు బాంధవుడు: దేవరకొండ తాలూకాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నారాయణరావు తన జీవితానంతా రైతాంగ ఉద్యమాలకే ధారబోశారు. రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. భూస్వాముల చెరల్లో ఉన్న భూములను పేదలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించారు. సాగునీటి భూములపై అప్పటి ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల బకాయిలు, నీటి తీరువా వసూళ్లను రద్దు చేయించడంలో అలుపెరుగని పోరాటం చేశారు. రైతాంగ, కార్మిక, వ్యవసాయ కూలీల సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహించి రైతు బంధువుగా పేరు సంపాదించారు. ప్రస్తుతం నారాయణరావు దేవాదాయ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

ముగిసిన అంత్యక్రియలు: బుధవారం సాయంత్రం ఉజ్జిని నారాయణరావు అంత్యక్రియలను స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని ఘడియగౌరారంలో నిర్వహించారు. అంత్యక్రియల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ, భువనగిరి ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, జెడ్పీచైర్మన్ నేనావత్ బాలునాయక్, మునుగోడు, దేవరకొండ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్‌రెడ్డి ఆదిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు హైదరాబాద్‌లోని నారాయణరావు స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ, కాంగ్రెస్ నేత జానారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు, సీపీఐ కార్యవర్గ సభ్యులు డీజీ నర్సింహారావు తదితరులు నివాళులర్పించారు. సంతాపం తెలిపిన వారిలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ తదితరులు ఉన్నారు.

సీఎం కేసీఆర్ సంతాపం


మాజీ ఎమ్మెల్యే నారాయణరావు మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

970
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles