సాగు తక్కువ.. వినియోగం ఎక్కువ


Tue,August 13, 2019 03:48 AM

Consumption of 1240 tonnes of onion per day

- రోజుకు 1,240 టన్నుల ఉల్లి వినియోగం
- మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి ఉల్లి దిగుమతి
- అవగాహనాలోపంతో దృష్టిసారించని రైతులు
- మరో ఐదువేల ఎకరాల్లో సాగు అవసరాన్ని గుర్తించిన ఉద్యానశాఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వినియోగానికి సరిపడ ఉల్లి ఉత్పత్తి జరుగడం లేదు. మన రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా తాండూరు, మెదక్ జిల్లా నారాయణఖేడ్, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్, అలంపూర్‌తోపాటు నల్లగొండలో ఉల్లి సాగు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో సాగు తక్కువగా ఉండటం, వినియోగం ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. నవంబర్ నుంచి మార్చి వరకు ఉల్లి దిగుమతి అవుతున్నది. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన నాసిక్‌లోని లాసల్వ్ నుంచి నిత్యం హైదరాబాద్ మార్కెట్‌కు ఉల్లిగడ్డ దిగుమతి అవుతున్నది. రోజువారీగా మలక్‌పేట గంజ్‌కు 60వేల నుంచి 70వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డ దిగుమతి అవుతున్నది. వీటిలో 10వేల క్వింటాళ్లు నగర అవసరాలకే వినియోగిస్తున్నారు. 2018-19లో మలక్‌పేట మార్కెట్‌కు 28,66,702 క్వింటాళ్ల ఉల్లిగడ్డ వచ్చింది. ఇక్కడ దాదాపు రూ.203 కోట్ల 25 లక్షల వ్యాపారం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఉల్లిసాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నది. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఉల్లి పంట సాగు వైపు దృష్టి సారించడం లేదు. ఉల్లి నిల్వకు సరైన కోల్డ్‌స్టోరేజీలు లేకపోవడం వల్ల నష్టపోతుండటం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో నిజామాబాద్ జిల్లాలో ఉల్లి నిల్వకు ఏర్పాటుచేసిన గోదాములు ప్రస్తుతం పనిచేయడం లేదు. ఈ ఏడాది కొల్లాపూర్, అలంపూర్ ప్రాంతాలతోపాటు రాష్ట్రంలో ఉల్లిసాగు అనుకొన్న స్థాయిలో లేకపోవడంతో ఉల్లిగడ్డ ధరలు పెరిగే అవకాశాలు ఉంటున్నాయి.

మరో 55వేల టన్నులు కావాలి

దేశీయ ఉల్లిలో ఘాటు ఎక్కువగా ఉండటం వల్ల గ్రామాల్లో ఎక్కువగా ఇష్టపడతారు. యూరప్‌లో పెద్దసైజు, తక్కువ ఘాటున్న ఉల్లికి డిమాండ్ ఉన్నది. స్టార్ హోటళ్లలో ఘాటు తక్కువగా ఉండే రకాలను ఎక్కువగా కోరుకొంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పూణెలోని రాజ్‌గురునగర్ పరిశోధన కేంద్రం ఘాటు తక్కువగా ఉన్న ఉల్లిని రూపొందించింది. రాష్ట్రంలో తలసరి ఉల్లిగడ్డ వాడకం రోజుకు 36 గ్రాములు ఉండగా.. రోజుకు 1,240 టన్నులు వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38,940 ఎకరాల్లో 4,02,373 మెట్రిక్ టన్నుల ఉల్లిసాగు జరుగుతున్నట్టు ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర అవసరాలు తీరాలంటే మరో 5,500 ఎకరాల్లో 55,427 మెట్రిక్ టన్నుల మేర సాగుచేయాల్సిన అవసరం ఉన్నదని గుర్తించారు. తక్కువ నీటి అవసరమున్న ఈ పంట సాగును మరింతగా ప్రోత్సహిస్తే యాసంగి, వానాకాలంలో కూడా సాగుచేయవచ్చు. ఉల్లి ఉత్పత్తిలో మహారాష్ట్ర 30.48 శాతంతో మొదటిస్థానంలో ఉండగా.. తెలంగాణ 0.80 శాతం ఉత్పత్తితో 17వ స్థానంలో ఉన్నది.
onion2

1905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles