చురుకుగా టీఆర్‌ఎస్ కార్యాలయాల నిర్మాణం


Mon,August 26, 2019 01:19 AM

Construction of TRS offices In Telangana

-దసరానాడు ప్రారంభించేదిశగా కార్యాచరణ
-తుదిదశకు చేరిన పార్టీ కమిటీల ఎన్నికలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాల భవనాల నిర్మాణం చురుకుగా కొనసాగుతున్నది. దసరా పండుగనాడు పార్టీ కార్యాలయాల్లోకి అడుగుపెట్టాలని.. అందుకు అనుగుణంగా నిర్మాణం పనులు పూర్తిచేయాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయాల నిర్మాణం పనులను వేగవంతం చేశారు. 30 జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణం జోరుగా కొనసాగుతున్నది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మినహా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే పార్టీకి కార్యాలయం ఉంది. హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో స్థలం కేటాయించాల్సి ఉన్నది. పార్టీ కార్యాలయాల భవనాల నిర్మాణానికి రాష్ట్ర పార్టీ నిధుల నుంచి ఒక్కొ జిల్లాకు రూ.60 లక్షలు కేటాయించారు.

అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాలు ఒకే విధంగా ఉండేలా భవనాల డిజైన్ తయారుచేసి ఇచ్చారు. ఇటీవలే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భవనాల నిర్మాణాలపై సమీక్ష జరిపారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో భవనాల పనుల్లో పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల్లో స్లాబ్ దశకు చేరుకొన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఎకరం చొప్పున భూమిని ప్రభుత్వం కేటాయించింది. పార్టీ సమావేశాలు నిర్వహించుకునేలా సమావేశమందిరం నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు పూర్తయిన తరువాత పార్టీ నాయకులకు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేందుకు యోచిస్తున్నారు. నిర్మాణం పనులను పర్యవేక్షించడానికి పాత జిల్లాల ప్రాతిపదికన నలుగురు ఇంచార్జీలను నియమించారు.

క్రియాశీల కార్యకర్తలకు కార్డులు

తక్కువ సమయంలో సమగ్ర వివరాలతో సభ్యత్వం నమోదుచేసిన పార్టీగా టీఆర్‌ఎస్ రికార్డుల్లోకెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వాలు 60 లక్షలు దాటాయి. సభ్యత్వ పుస్తకాలను వెంటనే కేంద్ర కార్యాలయంలో సమర్పించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల ఇంచార్జీలను ఆదేశించారు. డాటా ఎంట్రీ పూర్తికాని సభ్యత్వాలను హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కంప్యూటరీకరణ చేసేలా ఏర్పాట్లుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు పనులు పూర్తికావడంతో తర్వాతి కార్యక్రమంగా బూత్, గ్రామ, మండల, వార్డు కమిటీలకు ఎన్నికలు జరిపేందుకు చర్యలు ప్రారంభించారు. అత్యధిక నియోజకవర్గాల్లో కమిటీలు కూడా చివరి దిశకు చేరుకొన్నాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామస్థాయి నుంచి అనుబంధ కమిటీలను ఎన్నుకొంటున్నారు. కమిటీల్లో సామాజిక న్యాయం జరిగేలా బడుగు, బలహీనవర్గాలకు చెందినవారు 51 శాతం ఉండేలా చూడాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. కమిటీలవారిగా అందుతున్న వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటరీకరిస్తున్నారు. ప్రతి క్రియాశీల కార్యకర్తకు గుర్తింపుకార్డు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు తుది అనుమతి అనంతరం 20 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలకు గుర్తింపుకార్డులు అందజేయనున్నారు. గ్రామ, మండల కమిటీల నియామకం పూర్తికాగానే ఆయా కమిటీల సభ్యులతో కలిపి నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించాలన్న కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటినుంచే చర్యలు తీసుకొంటున్నారు.

430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles