అద్భుతం కొల్లూరు డబుల్‌ ఇండ్లు


Sun,July 21, 2019 02:51 AM

Construction of 17 thousand houses with Rs 1,355 crore

-దేశానికే సగర్వంగా చూపే ప్రాజెక్టు ఇది
-ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలల సౌధం
-వచ్చే మార్చికల్లా నిర్మాణపనులు పూర్తిచేస్తాం
-రూ.1,355 కోట్లతో 17 వేల ఇండ్ల నిర్మాణం
-గృహనిర్మాణశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రారామచంద్రన్‌

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఇతర రాష్ర్టాలకు, దేశానికే సగర్వంగా చూపించుకొనే అద్భుత ప్రాజెక్టు కొల్లూరు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం. ఆసియాలోనే ఇది ఒక అద్భుత నిర్మాణం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలల సౌధం అని గృహనిర్మాణశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రారామచంద్రన్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొల్లూరులో కొనసాగుతున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని ఆమె శనివారం పరిశీలించి, నిర్మాణ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కొల్లూరు డబుల్‌ ఇండ్ల ప్రాజెక్టు ఆసియాలోనే అద్భుతమని, సీఎం కేసీఆర్‌ కలలకు ప్రతిరూపం ఈ భారీ గృహనిర్మాణ ప్రాజెక్టు అని చెప్పారు. దాదాపు రూ.1,355 కోట్ల వ్యయంతో, 124 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 17 వేల ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నదని తెలిపారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పూర్తిగా అధునాతన హంగులతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడటం లేదని, థర్డ్‌ పార్టీ ఎంక్వైరీ ద్వారా పూర్తిగా పారదర్శకంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే నిర్మాణాలు పూర్తికావచ్చే దశకు చేరుకొన్నాయని, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంత అద్భుత నిర్మాణాలు, ఇంత త్వరగా జరుగుతాయా? అని ప్రజలు, ఇతర వర్గాలు అశ్చర్యపడుతున్నారని, గొప్ప నిర్మాణాలు అంటూ సంతోషిస్తున్నారని చెప్పారు. ప్రజలు కోరుకొన్నట్టుగా మంచి సౌకర్యాలతో ఇండ్ల నిర్మాణం జరుగుతుండటంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నదని అన్నారు.

పేదల సౌధంలో సకల సౌకర్యాలు

కొల్లూరు డబుల్‌ బెడ్‌రూం కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చిత్రారామచంద్రన్‌ తెలిపారు. తాగునీరు, రవాణా, ఫైర్‌, పోలీసు అవుట్‌ పోస్టులు, మెడికల్‌ కళాశాల, పిల్లల పార్కులు ఏర్పాటవుతాయని చెప్పారు. షాపిం గ్‌ మాల్స్‌ కూడా ఇక్కడ ఉంటాయని, ప్రతి బిల్డింగ్‌లో వాచ్‌మన్‌ కోసం ప్రత్యేక క్వార్టర్‌ ఉంటుందన్నారు. కాలనీ నిర్మాణ పనులు చూసేందుకు వస్తున్న ఇతర రాష్ర్టాల అధికారులు ఎలా సాధ్యమవుతున్నదంటూ ఆశ్చర్యపోతున్నారని, సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతున్నదని చెప్పామని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, గృహనిర్మాణ సంస్థలు సగర్వంగా తలెత్తుకొని చూపించుకొనే ప్రాజెక్టు ఇది అని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా కాలనీ మధ్యలో గ్రంథాలయం ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు. చిత్రారామచంద్రన్‌ వెంట డీఈసీ ఇన్‌ఫ్రా ఎండీ అనిరుద్‌గుప్తా, సీఈవో మధుసూదన్‌రావుతోపాటు పలువురు జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు, అధికారులు ఉన్నారు.

602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles