బాలిక భూమిపై రాబందుల కన్ను


Sun,July 21, 2019 03:08 AM

Conspiracy to defraud an orphan girl

-అనాథ బాలిక ఆస్తి కాజేసే కుట్ర
-రూ.3 లక్షల అప్పు పేరిట కోట్ల విలువైన భూమి స్వాహాకు యత్నం
-మోసపూరితంగా 3.10 ఎకరాలు రిజిస్ట్రేషన్
-అయినవారూ బయటివారికే వత్తాసు
-సాకినందుకు రూ.50 లక్షలు కావాలన్న తాత
-సినిమాకథను తలపిస్తున్న బాధితురాలి కన్నీటి వ్యథ
అన్నెంపున్నెం ఎరుగని అమాయకురాలు. ఇంకా మైనారిటీ కూడా తీరలేదు. ఐదేండ్ల వయసులోనే తండ్రిని.. ఆ తర్వాత కొన్నాళ్లకు తల్లిని పోగొట్టుకొన్న అభాగ్యురాలు. ఆసరాగా ఉండాల్సిన అయినవాళ్లే ఇప్పుడు ఆ బాలిక పాలిట రాబందుల్లా మారారు. తల్లిదండ్రులనుంచి బాలికకు సంక్రమించిన కోట్లు విలువచేసే భూమిపై కన్నేశారు. మారు అమ్మమ్మ మూడు లక్షలు అప్పుచేస్తే.. దానికి వడ్డీ పేరుతో మొత్తం ఇవ్వాల్సింది రూ.40 లక్షలుగా లెక్కగట్టారు. బాకీ తీర్చేందుకు అప్పు ఇచ్చిన వ్యక్తి పేరిట బాలికకు చెందిన భూమిని మాయమాటలతో రిజిస్ట్రేషన్ చేసేశారు. బాలిక ఫిర్యాదుతో సదరు భూమి మ్యుటేషన్‌ను తాసిల్దార్ నిలిపివేశారు. మరోవైపు చిన్నప్పటినుంచి పెంచాను కాబట్టి.. తనకు రూ.50 లక్షలు ఇవ్వాలంటూ కాటికి కాళ్లుచాపిన తాత డిమాండ్ చేస్తున్నాడు. అటు బయటివారు, ఇటు అయినవాళ్లు కలిసి చేస్తున్న కుట్రలను ఎదిరిస్తుంటే.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో దిక్కుతోచని ఆ బాలిక నమస్తే తెలంగాణను ఆశ్రయించి.. తన గోడు వెళ్లబోసుకున్నది.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అస్పల్లిపేటకు చెందిన జోగమ్మగూడెం అంజమ్మకు పుట్టినప్పటి నుంచీ కష్టాలే. ఐదేండ్ల వయసులోనే కరంట్ షాక్ కొట్టి తండ్రి మరణించాడు. తర్వాత అంజమ్మ తల్లి గ్రామంలో తమకు ఉన్న 3.10 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అమ్మాయిని సాకింది. ఇంతలోనే తల్లి అనుమానాస్పదంగా మరణించింది. అనాథశవం అనుకొని పోలీసులు దహన సంస్కారం చేసేశారు. కొన్ని రోజుల తర్వాతగానీ ఆ అనాథశవం తన తల్లిదేనన్న సంగతి తెలియలేదు. అప్పట్నుంచీ తాత, మారు అమ్మమ్మ దగ్గరే పెరిగింది. రాజధాని శివార్లలో అంజమ్మకు తల్లిదండ్రులనుంచి సంక్రమించిన కోట్లు విలువచేసే భూమి ఉండటంతో అందరి కండ్లూ దానిపై పడ్డాయి. కుట్రలకు తెరలేచింది. మోసంచేసి ఆమెతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొన్నారు. జరిగిన అన్యా యంపై కన్నీటిపర్యంతమవుతూ అంజమ్మ వెళ్లబోసుకున్న గోడు ఆమె మాటల్లోనే.. మాది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అస్పల్లిగూడ.

బాలమ్మ-బాలయ్యలకు నేనొక్కదానినే. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. మా అమ్మ పేరు మీద అస్పల్లిగూడ గ్రామ పరిధిలోని 524/లూ 3/1 సర్వే నంబర్లో 1.20 ఎకరాలు, 534/అ/1 సర్వే నంబర్లో 1.30 ఎకరాలు చొప్పున మొత్తం 3.10 ఎకరాల భూమి ఉన్నది. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ నన్ను నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం బొమ్మరాసుపల్లెలోని మా తాత ఇంటి దగ్గర ఉంచి చదివించింది. తాతకు ఇద్ద రు భార్యలు. వాళ్ల పిల్లలతోపాటే నేనూ బొ మ్మరాసిపల్లెలోనే ఆరోతరగతి వరకు, ఏడు నుంచి ఇంటర్‌వరకు కల్వకుర్తిలో చదువుకున్నా. 2009 డిసెంబర్‌లో మా అమ్మ కనబడటంలేదని తెలిసింది. అదేనెల 20న అంతారంగడ్డ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, అనాథ శవమని దహన సంస్కారాలు పూర్తిచేశారు. తర్వాత మా తాత అనుమానంతో వాకబుచేస్తే చీర, ఇతర గుర్తుల ప్రకా రం ఆ శవం మా అమ్మదేనని గుర్తించారు. అమ్మ పేరుమీద ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు మా తాతను గార్డియన్‌గా ఉంచి నా పేరుమీద చేశారు.

అప్పుతోనే భూమి మీద కన్ను..

మా మారు అమ్మమ్మ భారతమ్మ అస్పల్లిగూడకు చెందిన ఎల్గొండ గంగాధర్‌రెడ్డి దగ్గర 2013లో రూ.3 లక్షల అప్పు తీసుకొన్నది. అందుకు నాకు మైనార్టీ తీరిన తర్వాత నాకు న్న భూమిని గంగాధర్‌రెడ్డికి రిజిస్ట్రేషన్ చేయిస్తానని కాగితం రాసిచ్చింది. అప్పట్నుంచీ నా పాస్‌పుస్తకం గంగాధర్‌రెడ్డి దగ్గరే ఉన్నది. అందులో నా పేరు జోగమ్మగూడెం అంజమ్మగా ఉంటే.. పాఠశాల రికార్డుల్లో మా తాత ఇంటిపేరు పబ్బాల పేరుతో అనూష అని నమోదైంది. విషయం తెలుసుకొన్న గంగాధర్‌రెడ్డి.. రికార్డుల్లో నా పేరు తిరిగి జోగమ్మగూడెం అంజమ్మగా మార్పించి.. ఆధార్‌ను మార్పించారు. నా పుట్టిన తేదీ 20-6-2002 అయితే.. ఆధార్‌లో 01-01-2001గా నమోదు చేయించారు. నా ఆధార్, పాస్‌పుస్తకం అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. అవసరమై అడిగితే జిరాక్స్ ఇచ్చేవాడు. కొత్త పాస్‌బుక్ కూడా తనదగ్గరే ఉంచుకొన్నాడు. ఆధార్ ప్రకారం ఈ ఏడాది జనవరిలో నా మైనార్టీ తీరినందున నా భూమి కోసం గంగాధర్‌రెడ్డి మా మారు అమ్మమ్మపై ఒత్తిడి తీసుకొచ్చాడు. 2013లో రూ.3 లక్షలు ఇస్తే.. మిత్తితో కలిపి రూ.40 లక్షలు అప్పు ఉన్నదని అందుకోసం భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని గంగాధర్‌రెడ్డి అనడంతో మా తాత, మారు అమ్మ మ్మ అతనికి వత్తాసు పలికారు. చివరకు ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న 1.30 ఎకరాలు కాకుండా లోపలివైపు ఉన్న 1.20 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పుకొన్నారు.

జనవరి 30న చేవెళ్ల సబ్‌రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తీసుకెళ్లారు. డాక్యుమెంట్ రైటర్ దగ్గర 1.20 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించి సంతకం తీసుకొన్నారు. సబ్‌రిజిస్ట్రార్ ముందుకు పోయాక చాలా సంతకాలు పెట్టించుకొన్నారు. నేను 1.20 ఎకరాలే రిజిస్ట్రేషన్ చేశానని అనుకొన్నా.. మూణ్ణెళ్ల తర్వాత ఇంట్లో మా తాత, మారు అమ్మమ్మ మొత్తం భూమి రిజిస్ట్రేషన్ అయిందని మాట్లాడుకుంటుంటే విని సబ్‌రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి అడిగితే.. ఆయన నిజమేనని నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు. నాకు మైనారిటీ తీరలేదని పదో తరగతి మెమోను చూపిస్తే ఎమ్మార్వో ఆఫీసులో ఫిర్యాదుచేయాలని సూచించారు. నేను చేవెళ్ల తాసిల్దార్‌కు ఫిర్యాదుచేశాను. దీంతో గంగాధర్‌రెడ్డి అస్పల్లిగూడ సర్పంచ్‌ను రంగంలోకి దింపాడు. ఆయన వచ్చి రూ.1.25 కోట్లకు నీ భూమిని కొంటానని బేరం పెట్టాడు. మరోవైపు ఇన్నేండ్లు సాకినందుకు రూ.50 లక్షలు ఇవ్వాలని మాతాత, మారు అమ్మమ్మ డిమాండ్‌చేశారు. డాక్యుమెంట్‌లో నాకు చెక్కుల ద్వారా రూ.16.75 లక్షలు ఇచ్చినట్టు ఉండటంతో ఆ మొత్తాన్ని జడ్చర్లలో ఉన్న నా బ్యాంకు ఖాతాలో వేసేందుకు ప్రయత్నించారు. జడ్చర్ల వెళ్లి నా బ్యాంకు ఖాతాను రద్దు చేసుకొన్నా. అందరూ నా భూమిపై కన్నేసి వేధిస్తున్నారు. నాకు ప్రాణభయం ఉన్నది.

మ్యుటేషన్‌ను నిలిపేశాం

బాధితురాలు జోగమ్మగూడెం అంజమ్మ నాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందుకే గంగాధర్‌రెడ్డి మ్యుటేషన్‌కు పెట్టుకున్న దరఖాస్తును నిలిపేశాం. గ్రామంలో సమగ్ర విచారణ చేశాక తగువిధంగా చర్యలు తీసుకుంటాం.
- మదన్‌మోహన్, చేవెళ్ల తాసిల్దార్

అన్యాయం నిజమే

బాధితురాలికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే. గంగాధర్‌రెడ్డితో కుమ్మక్కయిన డాక్యుమెంట్ రైటర్‌ను వాకబు చేయగా తన కుట్రను ఒప్పుకొన్నాడు. అందుకే బాధితురాలితో సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయించాలని గ్రామస్థులతోపాటు నేను కూడా వెళ్లాను. ఆ సమయంలో కమిషనర్ కార్యాలయంలో లేకపోవడంతో మరుసటి రోజు వెళ్లాలనుకున్నాం. కానీ బాధితురాలు తిరిగి నా దగ్గరకు రాలేదు.
- మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల జెడ్పీటీసీ సభ్యుడు

4298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles