భద్రాద్రిపై కుట్ర


Tue,March 13, 2018 03:03 AM

Conspiracy on bhadradri

-రామాలయం పై శివస్వామి తీరు స్వార్థపూరితం..
-వైష్ణవ క్షేత్రంతో శైవపీఠాధిపతికి సంబంధమేమిటి?
-మండిపడుతున్న తెలంగాణ ఆలయాల పండితులు, ప్రధాన అర్చకులు

BhadrachalamTemple
శైవపీఠాధిపతి శివస్వామి ఆదివారం భద్రాద్రి అంతరాలయంలో వ్యవహరించిన తీరుపై తెలంగాణ వ్యాప్తంగా అటు భక్తులు, ఇటు అర్చకులు, వేద పండితులు భగ్గుమంటున్నారు. శైవ పీఠాధిపతి వైష్ణవ దేవాలయానికి వచ్చి అనవసర రాద్ధాంతం చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. శైవ-వైష్ణవ తగాదాలు సృష్టించడానికా? అంటూ మండిపడుతున్నారు. రామనారాయణుడు అని పిలువడం ఈ క్షేత్రం ప్రత్యేకత అని దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. భక్తరామదాసు నిర్మించిన భద్రాద్రి పుణ్యక్షేత్రంలో సుమారు 400 ఏండ్ల నుంచి కూడా అదే పద్ధతిలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వారు చెబుతున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి పెరుగుతున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక కొందరు ఉద్దేశపూర్వకంగా సరికొత్త అంశాలను తెరపైకి తెచ్చి వివాదాలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు.
- నమస్తే తెలంగాణ నెట్‌వర్క్

శైవపీఠాధిపతికి సంబంధమేమిటి?


Sthana-Charyulu
వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శైవ పీఠాధిపతికి సంబంధం ఏమిటి?. భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా పిలుస్తాం. కానీ కైలాసం అని సంబోధించం కదా?. ఆలయంపై శిల్పాలు ఉండకూడదని ఎక్కడా లేదు. శిల్పాలన్నీ శిల్పశాస్త్రం ప్రకారమే ఉంటాయి.
- స్థలసాయి, స్థానాచార్యులు, భద్రాచలం

ఆధ్యాత్మిక భావనను దెబ్బతీసేందుకే..

రాష్ట్రంలో ఆధ్యాత్మిక భావనను దెబ్బతీసేందుకే కావాలని కొందరు తెలంగాణలోనే ప్రముఖ ఆలయాలైన భద్రాద్రి, యాదాద్రిలో ఇబ్బందులు కలిగించాలని చూస్తున్నారు. వైష్ణవ క్షేత్రాలలో శైవ పీఠాధిపతి చెప్పే మాటలను వినాలని లేదు. వైష్ణవ ఆలయాలకు జీయర్‌లు దిశాదశ నిర్దేశం చేస్తారు. భద్రాద్రి వైష్ణవ క్షేత్రం.
- నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, యాదాద్రి దేవస్థానం ప్రధానార్చకులు

వైదికపరమైన పద్ధతిలోనే పూజలు

భధ్రాద్రి అంతరాలయం లో అమరావతి శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి బైఠాయించిన ఘటనపై విచారణకు ఆదేశించాం. నివేదిక రాగానే దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపిస్తాం. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వైదిక పరమైన పద్ధతిలోనే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
- ప్రభాకర శ్రీనివాస్, ఈవో, భద్రాచల దేవస్థానం

రామచంద్రుడు నారాయణుడే..

సాక్షాత్తు పరమశివుడే విచ్చేసి రామచంద్రుడిని నారాయణుడని సంబోధించాడు. అలాంటప్పుడు రాముడు నారాయణుడా కాదా? అనే సందేహం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. అనవసరంగా వివాదాలను సృష్టించి శైవ, వైష్ణవ అనే భేదాలు పెట్టి సమాజంలో చిచ్చురేపే ప్రయత్నాలు చేయడం సరికాదు.
- త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌స్వామి

రామనారాయణుడిగా ఓ ప్రత్యేకత..

కలియుగ వైకుంఠంగా పిలువబడుతున్న భద్రాద్రి పుణ్యక్షేత్రంలో విష్ణుమూర్తికి చిహ్నంగా శ్రీరాముడు ధనుర్భాణాలతో శంఖచక్రధారియై నాలుగు హస్తాలతో ద్విభుజం రఘునందనంతో అవతరించాడు. అందువల్ల రామనారాయణుడు అని పిలువడం ఈ క్షేత్రం ప్రత్యేకత.
- పీ జగన్నాథాచార్యులు,ప్రధాన అర్చకులు, భద్రాద్రి ఆలయం

స్వార్థంతోనే భద్రాద్రి అంశం తెరపైకి..

సనాతన సంప్రదాయాలు, ఆచారాలను కాదని కొత్త సంప్రదాయాలను జోడించాలని చూడకూడదు. కొంతమంది స్వార్థం కోసం భద్రాద్రి అంశాన్ని తెరమీదికి తెస్తున్నారు. ఎక్కడైనా చిన్న లోపాలుంటే వాటిని పీఠాధిపతులు, పండితులు కూర్చోని చర్చించుకొని పరిష్కరించుకోవాలి.
-గంగు ఉపేంద్రశర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్, వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకులు

శివస్వామిపై చర్యలు తీసుకోవాలి

భద్రాద్రి అంతరాలయంలో నిరసన తెలిపిన శివస్వామిపై చర్యలు తీసుకోవాలి. భద్రాద్రిపై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడారు. ఒక పీఠానికి అధిపతి మరో క్షేత్రానికి వచ్చి అనాలోచితంగా మాట్లాడడం సబబుకాదు.
- డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు, మహామహోపాధ్యాయ, కవిశాబ్దిక కేసరి, శాస్త్రరత్నాకర

భద్రాద్రి ఆలయ అర్చకులదే తుది నిర్ణయం

తాజాగా నెలకొన్న వివాదంలో భద్రాచల ఆలయం అర్చకులదే తుది నిర్ణయం. ఈ క్షేత్రంలో నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణం అద్భుతంగా నిర్వహించడం ఆనవాయితీ. శంఖచక్రాలు ధరించడం నారాయణమూర్తి స్వరూపంగా మరెక్కడా లేదు.అందుకే ఈ స్వామివారిని వైకుంఠ రాముడిగా పిలుస్తారు. ఇది సంప్రదాయం.
- గోపయ్యగారి శంకరయ్య, వేములవాడ రాజన్న ఆలయ స్థానాచార్యులు

3231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles