మరోసారి అధికారం టీఆర్‌ఎస్‌దే


Thu,December 6, 2018 03:39 AM

Congress secularism a sham Rahul Gandhi has feudal mindset Asaduddin Owaisi

-ఈస్ట్ ఇండియా కంపెనీ కూటమికి పరాభవం తప్పదు
-మద్దతిస్తాం.. మంత్రివర్గంలో చేరం
-రాహుల్‌గాంధీది ఫ్యూడల్ మైండ్‌సెట్
-ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రజాకూటమికి పరాభవం తప్పదని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి తాము పూర్తి మద్దతిస్తున్నా ప్రభుత్వంలో చేరబోమని ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఫ్యూడలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కూటమికి తెలంగాణలో పరాభవం తప్పదన్నారు. రాష్ట్రంలో ప్రజాకూటమిని ఈస్ట్ ఇండియా కంపెనీ-2018గా ఆయన అభివర్ణించారు. తమది ఏ టీమ్ బీ టీమ్ కాదని తమది హైదరాబాద్ టీమ్ అని చెప్పారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ఎంఐఎం ఎందుకు టీఆర్‌ఎస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నదన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. టీఆర్‌ఎస్ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలను చేపట్టిందని చెప్పారు.

షాదీముబారక్ గరీబుల పెండ్లిళ్లకు బాగా ఉపయోగపడిందని.. దాదాపు 50వేల మందికి సాయం అందిందని వివరించారు. చరిత్రలో మొదటిసారిగా రెండేండ్లలో 900 మంది ముస్లిం యువతకు విదేశాల్లో విద్యనభ్యసించడానికి భారీగాఆర్థికసహాయం అందిందని వివరించారు. ముస్లింలలో నిరక్షరాస్యత సమస్యగా ఉన్నదని.. దానిని అధిగమించడానికి సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేశారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణ, సుపరిపాలనలో సమర్థంగా వ్యవహరించిందన్నారు. ఇన్ని మంచిపనులు చేసినందుకే తాము టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.
Asaduddin-Owaisi

శాంతిభద్రతల్లో అగ్రభాగాన తెలంగాణ

శాంతిభద్రతల విషయంలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నదని, మతకలహాలు లేకుండా అరాచకశక్తులను అణచివేయగలిగిందని ఆయన ప్రశంసించారు. మరోవైపు యూపీ లాం టి రాష్ర్టాల్లో నడిరోడ్డుపైనే పోలీస్ అధికారులను కాల్చిచంపుతున్నారని.. కానీ అక్కడి సీఎం తన రాష్ర్టాన్ని వదిలి ఇక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్‌షా, ఆదిత్యనాథ్ తదితరులు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, మజ్లీస్‌పైకి ఒక వర్గంవారిని ఉసిగొల్పేలా మాట్లాడారని ఆరోపించారు. గోషామహల్ ఎ మ్మెల్యే తన తలకాయ నరుకుతానంటే కూడా వారు వారించలేదని చెప్పారు. తాను సెక్యూరిటీ లేకుండా తిరుగుతానని తన తల ఎప్పుడైనా నరకవచ్చని తాను ఆత్మాహుతికి సిద్ధమని ప్రకటించారు. మోదీ నుంచి రాహుల్ వరకు ఎం ఐఎంను టార్గెట్‌చేసి మాట్లాడారని అది తమకే మంచిదన్నారు.

రాహుల్ అసమర్థుడు

రాహుల్‌గాంధీ అసమర్థంగా వ్యవహరించబట్టే చాలా రాష్ర్టాల్లో బీజేపీ గెలుస్తున్నదని ఒవైసీ విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయాలనుకున్నవారు కూడా రాహుల్ తెలివితక్కువ పనివల్ల బీజేపీకి ఓటువేయాల్సిన దుస్థితి నెలకొంటున్నదని చెప్పారు. రాహుల్ ఫ్యూడలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారని.. ఆయన తన తల్లి సోనియాగాంధీ వద్ద సంస్కారం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు రక్షణ కల్పిస్తుందన్న నమ్మకం పోయిందన్నారు. తాను మహారాష్ట్ర, అసోంలో బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఓడిపోయిందని రాహుల్ అనడంలో అర్థంలేదని పేర్కొన్నారు. తాము మద్దతిచ్చినందుకు అక్కడ ఓడిపోతే మరి మిగతా రాష్ర్టాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాము ఎన్నోసార్లు కాంగ్రెస్‌ను ఆదుకున్నామని కానీ ఆ పార్టీ ముస్లింలకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు.

3832
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles