ఈబీసీలకూ కార్పొరేషన్


Thu,October 11, 2018 02:14 AM

Congress Leader Uppala Srinivas Gupta Joins TRS Telugu

-పేదరికానికి కులం, మతం తేడా లేదు
-ఆర్యవైశ్యులందరూ తెలంగాణ ప్రజల పక్షాన నిలువాలి
-కాంగ్రెస్ హామీల అమలుకు ఆరు రాష్ట్రాల బడ్జెట్ కావాలి
-ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు
-టీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్యవైశ్య నేత ఉప్పల శ్రీనివాస్‌గుప్తా

పేద బ్రాహ్మణులను ఆదుకోవడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేశాం. ఇదే తరహాలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా న్యాయంచేస్తాం.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పేదరికానికి కులం, మతం తేడా ఉండదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆర్యవైశ్య సంఘం నాయకుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా వేలమందితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. శ్రీనివాస్‌గుప్తా, ఇతరులకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే పేద బ్రాహ్మణులను ఆదుకోవడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేశామని గుర్తుచేశారు. ఇదే తరహాలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈబీసీలకు) ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా న్యాయంచేస్తామని ప్రకటించారు.

వ్యాపార, వాణిజ్యరంగాల్లో ఆర్యవైశ్యులది అందెవేసిన చేయి అని, వారందరూ తెలంగాణ ప్రజల పక్షాన నిలువాలని కోరారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను కేటీఆర్ వివరించారు. తెలంగాణలో గెలిపిస్తే రెండువేలు పింఛను ఇస్తామంటున్న కాంగ్రెస్.. తాను అధికారంలో ఉన్న పంజాబ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. ఆ రాష్ట్రాల్లో కేసీఆర్ లేరు కాబట్టే అక్కడి ప్రజలకు న్యాయం జరుగడంలేదన్నారు. కాంగ్రెస్ హామీలను అమలుచేయాలంటే దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాల బడ్జెట్ కావాలని ఆర్థికరంగ నిపుణులు చెప్పారన్నారు.
SRINIVAS-GUPTA

ప్రజాకోర్టులో తేల్చుకోవటానికే ముందస్తు

రాబోయేతరాల గురించి సీఎం కేసీఆర్ ఆలోచిస్తారని, కానీ కొందరు నాయకులు రాజకీయాల గురించే ఆలోచిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోడానికి కాంగ్రెస్ నాయకులు రెండువందలకుపైగా కేసులు వేశారని విమర్శించారు. కోర్టులు కొట్టేసినా.. కేసులు వేయడం మానడంలేదన్నారు. దీంతో ప్రజాకోర్టులోనే తేల్చుకోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్టు చెప్పారు. తాజాగా ఎన్నికలను ఆపడానికిసైతం కోర్టులకు వెళ్తున్నారంటూ.. వారికి ఓటమి భయం పట్టుకుందని, ఓట్లు తీసివేయడానికి కూడా కేసీఆర్ కారణమన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కూటమిలో ఉన్న చంద్రబాబు తెలంగాణలో ప్రాజెక్టులను ఆపాలంటూ ఇప్పటికి 30 లేఖలు రాశారని, ఒకవేళ కూటమికి అధికారం ఇస్తే ఆ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయా? అని ఆందోళన వ్యక్తంచేశారు. ఢిల్లీ గులాంలు కావాలా? సింహంలాంటి సీఎం కావాలా? అని ప్రశ్నించారు.

బీజేపీ ఇస్తామన్న రూ.15 లక్షలు ఇస్తే బీజేపీ నేతల ఇండ్ల కిరాయిలు ప్రజలే కడుతారని చురకవేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజధానిలో ఆర్యవైశ్య భవనానికి ఐదెకరాల స్థలం కేటాయించిందని, ఆర్యవైశ్యులకు నామినెటెడ్ పదవులు ఇచ్చిందని చెప్పారు. సంఘం నాయకుడు గ్రంథి రాజమౌళిగుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యుల్లో అనేకమంది పేదవారు ఉన్నారని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. ఉప్పల శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కేసీఆర్‌ను మరోసారి సీఎంను చేయాలనేదే లక్ష్యమన్నారు.

రాష్ట్రంలో 25 లక్షలమంది ఆర్యవైశ్యులు ఉన్నారని, అందరూ టీఆర్‌ఎస్ విజయానికి కృషిచేస్తారని తెలిపారు. ఆర్యవైశ్యుల్లోని పేదలకు ప్రభుత్వ పథకాలతో లబ్ధిచేకూరేలా చూడాలని, వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్‌రావు, హస్తకళల అభివృద్ధిసంస్థ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, మాజీమంత్రి పీ రాములు, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ మమతాగుప్తా, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌గుప్తా, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కిశోర్‌గౌడ్, దయానంద్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

2961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles