ధర్మారెడ్డి దౌర్జన్యం


Wed,June 12, 2019 02:29 AM

Congress Leader Two acres land Kabza In Nalgonda District

-నల్లగొండ జిల్లా వనిపాకలో రెండెకరాలు కబ్జా
-ఆయన కనుసన్నల్లోనే రెవెన్యూ, పోలీస్ సిబ్బంది
-పదకొండేండ్లుగా బాధితుల పోరాటం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆయన పేరు ధర్మారెడ్డి. చేసేది కోళ్ల వ్యాపారం. పైగా కాంగ్రెస్ నేత. పేరులో ధర్మం ఉన్నదే తప్ప చేసేవన్నీ అధర్మ పనులే. తన గ్రామంలోని భూములన్నీ ఆయనే కొంటుంటాడు. తను చెప్పిన రేటుకు అమ్మాల్సిందే. లేకపోతే, ఆ ఊర్లో గుంట భూమి కూడా ఎవరూ అమ్మడానికి వీల్లేదు. ఇలానే వందెకరాల దాకా సంపాదించాడని గ్రామస్థులు చెప్తారు. ఆయనకున్న రాజకీయ, ధనబలం కారణంగా సర్వేయర్లు సర్వేకూ రారు. ఒకవేళ వచ్చినా నివేదిక ఇవ్వడానికి జంకుతారు. స్థానిక రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని తన అంగ, అర్థబలంతో అదుపులో ఉంచుకున్నాడు. ధర్మారెడ్డి తన పాలోళ్ల పొలాలనూ వదల్లేదు. అతనికి ఉన్న తొమ్మిది ఎకరాల పక్కనే ఉన్న భానుప్రకాశ్‌రెడ్డికి చెందిన రెండెకరాల భూమిని కబ్జా చేశాడు. ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ అధికారులకు.. పదకొండేండ్ల నుంచి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని భానుప్రకాశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అతని ఆగడాలతో విసుగు చెం దిన బాధితుడు నమస్తే తెలంగాణ కార్యాలయానికి లేఖ రాశాడు.

ఆ లేఖలోని సారాంశం భానుప్రకాశ్‌రెడ్డి మాటల్లోనే..

మాది నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామం. సర్వేనంబర్లు 439, 440, 450లలో 11.21 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమి మా తాత కొన్‌రెడ్డి నారాయణరెడ్డి నుంచి మా నాన్న మల్లారెడ్డికి వారసత్వంగా వచ్చింది. నాకు ఏడాది, మా అక్కకు మూడేండ్ల వయసున్నప్పుడు మా అమ్మ మరణించింది. మాకు భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకూడదన్న ఉద్దేశంతో మా తాత ఇద్దరి పేరిట 5.31 ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. 1989 నుంచి అన్ని రికార్డులు, పట్టా, పహాణీ, కాస్తు ఆరోజు నుంచి ప్రభుత్వం ఇటీవల జారీచేసిన కొత్త పాస్‌పుస్తకం (2018) వరకూ మా పేరిట ఉన్నాయి. ఇందులో మా అక్కకు చెందిన 5.31 ఎకరాల భూమిని మా పెద్దమ్మ కొనుగోలుచేశారు. నా భూమిని మా నాన్న సాగుచేసేవారు. 2009లో నాన్న మరణించారు. అప్పుడు, మేం భూమి సేద్యం కోసం వెళ్లగా.. అందులోని రెండెకరాలను ధర్మారెడ్డి కబ్జా చేశారని తెలిసింది. వెంటనే చిట్యాల తాసిల్దార్ కార్యాలయంలో భూమి సర్వే చేయించాలని దరఖాస్తు చేసుకొన్నాం. అప్పటి ఎమ్మార్వో సర్వేచేయమని సర్వేయర్ మజీద్‌కు అప్పగించినప్పటికీ ఆయన సర్వే చేయలేదు. తర్వాత ఆయన స్థానంలో మరో సర్వేయర్ శ్రీధర్ వచ్చారు.

ఎంతగానో ప్రాధేయపడ్డాక.. సర్వేనంబర్ 450లో ధర్మారెడ్డి కబ్జాలో ఉండటం వల్ల పూర్తి సర్వే చేయలేనని చెప్పి వెనుతిరిగి వెళ్లారు. సర్వే రిపోర్టు ఇవ్వమన్నా ససేమిరా అన్నారు. ఈ లోపు మరో సర్వేయర్ శ్రీహరి వచ్చారు. తనూ పట్టించుకోలేదు. అప్పట్నుంచి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రెవెన్యూ సిబ్బంది సర్వేచేయడం లేదు. 2007 నుంచి సర్వేయర్, వీఆర్వో, ఆర్‌ఐ, తాసిల్దార్, ఆర్డీవో, జిల్లా ల్యాండ్ సర్వే సంచాలకుడు, కలెక్టర్ల చుట్టూ పదకొండేండ్లుగా తిరుగుతున్నా పరిష్కారం కాలేదు. చివరగా డీఐ సర్వేచేసి హద్దు రాళ్లు చూపించి సర్వే పంచనామా నివేదిక ఇచ్చి ధర్మారెడ్డి రెండెకరాలు కబ్జాచేశారని నిర్ధారించారు. దీంతో భూమి సాగు కోసం వెళ్లగా ధర్మారెడ్డి అడ్డుకున్నారు. సర్వేయర్ చూపించిన రాళ్లు తొలిగించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. స్థానిక పోలీసులను తన ఆర్థిక బలంతో లొంగదీసుకొని బెదిరించారు. మా భూమిని తక్కువ రేటుకే అమ్మాలని, లేకపోతే ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరిస్తున్నారు. ధర్మగంట ద్వారా రెవెన్యూ అధికారులు మా బాధను విని.. ఇప్పటికైనా పరిష్కరిస్తారని ఆశిస్తున్నా

కబ్జాచేశాడని తేలితే..

భానుప్రకాష్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా పరిశీలిస్తే.. వారి పేరిటే రికార్డులున్నాయని తెలిసింది. వచ్చే సోమవారం నోటీసులిచ్చి సర్వేచేయాలని నిర్ణయించాం. సర్వేలో ధర్మారెడ్డి కబ్జాచేశాడని తేలితే ఆర్డీవోకు సమాచారం అందజేసి.. తర్వాతి చర్యల్ని చేపడతాం. బాధితుడికి తగిన న్యాయంచేస్తాం.
- విశాలాక్షి, ఎమ్మార్వో, చిట్యాల

1835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles