జగ్గారెడ్డి అరెస్ట్


Tue,September 11, 2018 02:19 AM

Congress Leader Jagga Reddy Arrested in Patancheru for Fake Passport Case

-నకిలీ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు..
-అమెరికాకు మనుషుల అక్రమ రవాణా
-కుటుంబసభ్యుల పేర్లతో ఇతరులకు పాస్‌పోర్టు
-పద్నాలుగేండ్లుగా తిరిగిరాని గుజరాతీ కుటుంబం
-ఆరాతీసిన అమెరికన్ కాన్సులేట్
-హైదరాబాద్ నార్త్‌జోన్ పోలీసుల దర్యాప్తులో గుట్టురట్టు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మనుషుల అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని హైదరాబాద్ నార్త్‌జోన్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. 2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సంపాదించారు. వాటి ఆధారంగా నకిలీ డాక్యుమెంట్లతో వీసాలు పొంది.. ముగ్గురినీ తన వెంట అమెరికాకు తీసుకెళ్లారు. వారిని అక్కడ దించిన జగ్గారెడ్డి.. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు.

ఈ ముగ్గురు అమెరికాకు వెళ్లి పద్నాలుగేండ్లయినా ఇంతవరకు తిరిగిరాలేదు. దీనిపై అనుమానం వచ్చిన అమెరికన్ కాన్సులేట్ అధికారులు.. ఈ విషయంపై ఆరా తీయాలంటూ నార్త్‌జోన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు.. జగ్గారెడ్డి 2004లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన సిఫారసుతో ఇప్పించిన పాస్‌పోర్టుల డాక్యుమెంట్లను పరిశీలించగా.. విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. అందులో కొడుకు, కూతురు, భార్య పేర్లు ఉన్నా.. ఫొటోలు మాత్రం వేరేవారివిగా గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తుచేశారు. అందులో.. గుజరాత్‌కు చెందిన ఒక కుటుంబాన్ని అమెరికాకు అక్రమంగా రవాణా చేసినట్టు నిర్ధారణ అయింది.
Family
దీంతో సోమవారం రాత్రి నార్త్‌జోన్ పోలీసులు పటాన్‌చెరులో జగ్గారెడ్డిని అరెస్టుచేశారు. ఈ మేరకు నార్త్‌జోన్‌లోని మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని డీసీపీ సుమతి తెలిపారు. ఈ కేసుతో మరో ముగ్గురికి సంబంధం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. సంగారెడ్డికి చెందిన జెట్టి కుసుమకుమార్, నిజామామాద్‌కు చెందిన మధుసూదన్‌రావు, హైదరాబాద్‌కు చెందిన రషీద్ అనే వ్యక్తులు కూడా జగ్గారెడ్డితోపాటు అమెరికాకు వెళ్లివచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొందరు మాజీ ఎంపీలకు కూడా ఈ దందాలో భాగం ఉందనే అనుమానాలను పోలీసులు వ్యక్తంచేస్తున్నారు.

కమీషన్ల కోసం జగ్గారెడ్డి దందా!

2004లో జగ్గారెడ్డి విప్‌గా కూడా ఉన్నారు. ఆయన వద్దకు తరచూ ఇటువంటి కేసులు వస్తుండేవని తెలుస్తున్నది. ఇక్కడివారిని నకిలీ పాస్‌పోర్టులపై అమెరికాకు పంపించినప్పుడు ఒక్కో డీల్‌లో పది లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు కమీషన్ లభించేదని సమాచారం. పైగా, ప్రజాప్రతినిధులు తమ వెంట తీసుకెళ్లేవారికి ఎక్కువకాలం వీసా వస్తుందని చెప్తున్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి పలువురిని స్వయంగా అమెరికాకు తీసుకెళ్లి దిగబెట్టివచ్చేవారని సమాచారం. గతంలో 2007 మే 3న తప్పుడు ధ్రువపత్రాలతో పాస్‌పోర్టులు పొందారనే ఆరోపణలతో అప్పటి ఎమ్మెల్యేలు సోయం బాపూరావు, కాసిపేట లింగయ్యపై కేసు నమోదైన విషయం తెలిసిందే. గుజరాత్‌కు చెందిన నలుగురిని అమెరికాకు అక్రమంగా తరలించారని వారిపై కేసు నమోదుచేశారు.

3935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles