మహాకూటమిపై మంతనాలు


Wed,September 12, 2018 01:24 AM

Congress has given 29 seats to parties in the alliance

-టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ నేతల వరుస భేటీలు
-కూటమిలోని పార్టీలకు 29 సీట్లు ఇస్తామన్న అభిప్రాయంలో కాంగ్రెస్
-పార్టీల మధ్య కుదురని సయోధ్య

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పరస్పర విరుద్ధభావాలున్న రాజకీయపార్టీలు అనైతికపొత్తులకు విస్తృత మంతనాలు సాగిస్తున్నా వాటిలో పురోగతి మాత్రం కనిపించడంలేదు. వారంరోజులుగా రహస్య ప్రదేశాల్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ నేతలు సాగిస్తున్న చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌లో జరిగిన సమావేశానికి పీసీపీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హాజరై పొత్తులపై చర్చించారు. ఈ మూడు పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడాలని భావించినట్టు ఆయా పార్టీల నేతలు ప్రకటించారు. ఈ కూటమిలోకి సీపీఎంను కూడా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తాజాగా న్యూడెమోక్రసీ పార్టీని సైతం కలుపుకొంటున్నట్టు సమాచారం. కాంగ్రెస్ మొదటినుంచి చెప్తున్నట్టు 29 సీట్లను మహాకూటమిలో కలిసిన పార్టీలకు ఇస్తామనే అభిప్రాయంతో ఉన్నది. ఇందుకు సీపీఐ, టీజేఎస్, న్యూడెమోక్రసీలను మెప్పించే బాధ్యతను టీటీడీపీపై వేసినట్టు కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. మొత్తం 29 సీట్లల్లో ఆ నాలుగు పార్టీలు పంచుకోవాల్సి ఉన్నదని, వారంతా ఒక అవగాహనకు వస్తే దానిపై నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు చర్చల్లో చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే టీజేఎస్ కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించడంతో వారిని మళ్లీ ఉపసంహరించుకునే స్థితిలో ఆ పార్టీ లేకపోవడంతో కొంత సమస్య ఉత్పన్నమవుతున్నది.

బలాబలాలపై చర్చ
కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాల్లోనే టీడీపీ బలంగా ఉన్నదని ఇరు పార్టీల నేతల చర్చల మధ్య బయటపడింది. జగిత్యాలను టీడీపీ కోరుకుంటుండగా, హుస్నాబాద్‌ను సీసీఐ కోరుకుంటున్నది. అయితే ఇక్కడ తామే బలంగా ఉన్నామని కాంగ్రెస్ నేతలు వాదించినట్టు తెలిసింది. హుస్నాబాద్ నుంచి గతంలో సీపీఐ నుంచి చాడ వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం చాడ వెంకట్‌రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. జగిత్యాలలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కొసాగుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ప్రస్తుత టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రాతినిధ్యం వహించారు. జగిత్యాల సీటు టీడీపీకి ఇవ్వాలని పట్టుపడుతున్నట్టు తెలిసింది. ఈ రెండు సీట్లు కూటమిలో ఉన్న ఆయా పార్టీలకు చెందిన అధినాయకులు కావడంతో వాటిని వదులుకోవద్దని వారివారి అనుచరులు చెప్తున్నారు. ఒకవేళ ఈ రెండు సీట్లు సాధించకుంటే ఆయా పార్టీల్లో పనిచేస్తున్న కిందిస్థాయి కార్యకర్తల మనోైస్థెర్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉన్నదని ఆ నేతలు భావిస్తున్నారు. మహాకూటమిగా ఏర్పడుదామని నిర్ణయించినప్పటికీ సీట్ల పంపకాల అంశంపై పలు దఫాలుగా చర్చిస్తే ఫలితం ఉంటుందని ఆయా పార్టీల నేతలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగా మహాకూటమి నేతలు రహస్య ప్రదేశాల్లో రోజువారీగా భేటీ అవుతునే ఉన్నా సీట్ల పంపకాల విషయం మాత్రం ఇంకా తేలడంలేదు.

385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles