జోరుగా రైతు సమగ్ర సర్వే


Mon,August 26, 2019 01:09 AM

Comprehensive Farmers Survey in Telangana

-13 జిల్లాల్లో 50% పైగా పూర్తి
-భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో 93 శాతం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా రైతుల పూర్తి వివరాలతోపాటు సాగు విస్తీర్ణం, నీటి వసతులు తదితర సమాచార సేకరణ (బిగ్ డాటా) కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ప్రధానంగా ఈ ఏడాది వానకాలం రైతులవారీగా పంటల సాగు విస్తీర్ణం వివరాలను సేకరించి ఆన్‌లైన్లో నమోదు 13 జిల్లాల్లో 50 శాతం మేర పూర్తయ్యాయి. దీని ఆధారంగా రానున్నరోజుల్లో పంట ఉత్పత్తులను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది. దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుత వానకాలం నుంచే రైతులవారీగా సాగు చేసిన పంటల విస్తీర్ణం ఆధారంగా మద్దతు ధరకు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్నారు. దీనికి రైతుల సమాచారంతోపాటు సాగైన పంటల వివరాలను జతచేయాల్సి ఉం టుంది. అయితే క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు వివిధ పనులతో తీరిక లేకుండా ఉండటంతో సర్వే పనులు వెంటనే పూర్తిచేయలేకపోతున్నట్టు చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరుకు ముగించాలని అధికారులు ఆదేశిస్తున్నారు.

ఆన్‌లైన్లో 25లక్షల రైతుల వివరాలు నమోదు

రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో రైతు సమగ్ర సర్వే కొనసాగుతున్నది. 10,880 గ్రామాల్లో 56,80,694 మంది రైతులు సాగుచేస్తున్న పంటల వివరాలను సేకరించి ఏఈవోలు ఆన్‌లైన్లో నమోదు చేయాల్సి ఉన్నది. ఇందులో ఇప్పటివరకు 25,79,590 మంది రైతుల వివరాలు అప్‌డేట్ చేశారు. మరో 31 లక్షల మంది రైతుల వివరాలు సేకరించాల్సి ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 93 శాతం, మంచిర్యాలలో 85, నిర్మల్‌లో 71, వికారాబాద్‌లో 69, మహబూబాబాద్‌లో 67, నారాయణపేట 66, కరీంనగర్ 65, ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో 59 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 51 శాతం రైతులవారీగా పంటల సాగు విస్తీర్ణం వివరాలు నమోదయ్యాయి. ఈ విధానం ద్వారా దళారీ వ్యవస్థను అరికట్టి పంట సాగుచేసే రైతుకు మద్దతు ధర అందించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందులో భాగంగానే ఈ సర్వే చేస్తున్నట్టు సమాచారం. ఈ వివరాల ఆధారంగా ఏ జిల్లాలో ఏ మండలం, ఏ గ్రామంలోని రైతు ఏ సర్వేనంబర్లో ఎంత భూమి సాగుచేస్తున్నది ఒక్క క్లిక్ ద్వారా తెలిసిపోనున్నది. ఈ వివరాల ఆధారంగానే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు పంట కాలనీల ఏర్పాటు ఉండాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తున్నది.

269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles