ఐకమత్యానికి నిదర్శనం ఈడిగోనిపల్లి!


Sat,January 13, 2018 11:07 AM

Collective farming for 70 years

70 ఏండ్లుగా ఉమ్మడి సేద్యం
-65 కుటుంబాల ఆదర్శ జీవనం
-తరాలుమారినా చెక్కుచెదరని చైతన్యం
-తగాదాలు లేకుండా ధాన్యం పంపకం
-భూరికార్డుల ప్రక్షాళనలోనూ అదే స్ఫూర్తి

jonnalu
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరు గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నగ్రామమే ఈడిగోనిపల్లి. ఈ గ్రామం మొత్తం జనాభా 1,350 మంది. ఇక్కడ 70 ఏండ్ల క్రితం 65 కుటుంబాలుండేవి. ఇప్పుడు 260 కుటుంబాలయ్యాయి. వీరందరికీ ఎవరిపొలాలు వారికి ఉన్నాయి. గ్రామం పరిధిలో దాదాపు 1,800 ఎకరాల సాగుభూములున్నాయి. సొంత భూములతోపాటు 81.25 ఎకరాల ఉమ్మడి భూమి ఉన్నది. పూర్వం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ వంశీయుల ఆధీనంలో ఆ భూమి ఉండేది. దాదాపు 70 ఏండ్ల క్రితం అప్పటి ఉత్తనూరు సర్పంచ్ బుగ్గారెడ్డి చొరవచేసి, ఎకరానికి వెయ్యి రూపాయల చొప్పున ఈ భూమిని గ్రామస్థుల చేత కొనుగోలు చేయించి, రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తం 65 కుటుంబాలు కలిసి ఈ భూమిని కొనుగోలుచేశాయి. అప్పటినుంచి ఈ పొలాన్ని 65 కుటుంబాలు, వారి వారసులు కలిసి ఉమ్మడిగా సాగుచేస్తుండటం విశేషం. ఇందులో పశువుల మేత భద్రపర్చుకోవటానికి 9.36 ఎకరాలను వినియోగిస్తుండగా, ఇండ్ల స్థలాల కోసం మరికొంత భూమిని కేటాయించారు. మిగిలిన 70 ఎకరాల్లో ఉమ్మడి సేద్యం చేస్తున్నారు. ఊరంతా సమావేశమై ఏ పంట వేయాలో ముందుగానే నిర్ణయించుకొంటారు. 70 ఏండ్ల నుంచి పప్పుశనగ, తెల్లజొన్న సాగుచేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే యాసంగిలో పుచ్చకాయ పండిస్తున్నారు. అంతా కలిసి భూమిని దున్నుతారు. 65 కుటుంబాలకు చెందిన గెడాలు దున్నడానికి వెళ్తాయి. విత్తనాలు చల్లడం, కలుపు తీయడం, క్రిమి సంహారక మందులు చల్లడం, కోతకోయడం.. ఇలా అన్నిపనుల్లో అందరూ పాల్గొంటారు. పండిన పంటను అంతా కలిసి సమంగా పంచుకొంటారు. 70 ఏండ్లలో ఎప్పుడూ నష్టం రాలేదని గ్రామస్థులు చెప్తుంటారు. మూడు తరాల క్రితం చేసుకొన్న ఒప్పందం ప్రకారం ఈతరం కూడా ఉమ్మడిగా సాగుచేస్తుండటంతో జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా ఈడిగోనిపల్లి నిలుస్తున్నది.

భూ రికార్డుల ప్రక్షాళనలోనూ చెక్కుచెదరని స్ఫూర్తి


భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా ఈడిగోనిపల్లి గ్రామానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు అక్కడి ఐకమత్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గ్రామస్థుల కోరిక మేరకు 70 ఎకరాల భూమిపై 65 కుటుంబాలవారికీ సమానహక్కులు ఉండేవిధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకొన్నారు. 70 ఏైండ్లెనా ఐకమత్యంతో ఉండటం గొప్ప విషయమని పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అభినందిస్తున్నారు.

ఉమ్మడిగా సాగు చేయటం అభినందనీయం


70 ఏండ్లుగా గ్రామంలోని రైతులు ఉమ్మడిగా సాగు చేయడం అభినందనీయం. కొన్ని గ్రామాలలో ఒకే కుటుంబంలోనే ఎన్నో అవాంతరాలు మొదలై భూములను పంచుకొనే పరిస్థితి ఉంటుంది. ఈడిగోనిపల్లిలో గ్రామస్థులందరూ సమానంగా పనిచేస్తూ ఉమ్మడిగా సాగుచేసుకుని ఐకమత్యంగా ఉండటం గర్వకారణం. ఈ భూమిపై గ్రామంలో 65 మందికి సమానహక్కు కల్పించటం జరిగింది.
- యాదగిరి, తహసీల్దార్, అయిజ

కూలీల కొరత సమస్యలేదు


ఉమ్మడిసాగు వల్ల కూలీల కొరత సమస్య రావటం లేదు. ప్రతి ఒక్కరూ పనిలోకి దిగితే పని పూర్తయ్యేవరకు ఇంటికి వచ్చేది ఉండదు. దీనివల్ల పనిభారం కనిపించటం లేదు. మాకు సొంత భూములు ఉన్నాయి. వాటిని సాగుచేస్తూనే ఉమ్మడి పొలాన్ని కూడా సాగుచేస్తున్నాం.
- తిమ్మయ్య, రైతు ఈడిగోనిపల్లి

ఐకమత్యంతోనే సాగు


గ్రామంలోని అన్ని కుటుంబాలు ఐకమత్యంతో ఉండటంతోనే ఉమ్మడిసాగు సాధ్యమవుతున్నది. 70 ఏండ్లుగా మా తాతముత్తాల నాటి నుంచి ఇదే భూమిని అందరం కలిసి సాగు చేస్తూ, పంట దిగుబడిని పెంచుతున్నాం.
- గోపాలకృష్ణ, రైతు ఈడిగోనిపల్లి

పెట్టుబడి స్వల్పమే


55 ఏండ్లుగా తాత, తండ్రితోపాటు నేను ఈ భూమిలో ఉమ్మడిగా సాగుచేస్తున్నా. ఇది నల్లరేగడి భూమి. నీటికి ఇబ్బందిలేదు. పెట్టుబడి కింద స్వల్పంగా మాత్రమే ఖర్చు చేస్తాం. దిగుబడి ఎక్కువగానే వస్తున్నది.
- ఉరుకుందు, రైతు ఈడిగోనిపల్లి

1197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles