సింగరేణిలో భారీగా బొగ్గు ఉత్పత్తిMon,June 19, 2017 01:56 AM

-ప్లేడే రోజున పెద్ద సంఖ్యలో కార్మికుల హాజరు
-నాల్గో రోజూ కన్పించని సమ్మె ప్రభావం

Singareni
గోదావరిఖని/ కొత్తగూడెం నమస్తే తెలంగాణ, మంచిర్యాల నమస్తే తెలంగాణ ప్రతినిధి: సింగరేణిలో సమ్మె ప్రభావం ఏ మాత్రం కన్పించడం లేదు. ఐదు జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మె ఆదివారం నాల్గో రోజుకు చేరింది. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఆదివారం సెలవు దినం (ప్లేడే) రోజున భారీగా కార్మికులు హాజరైనట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సెలవు రోజు పనిచేసే కార్మికులకు రెండు మస్టర్లు ఇస్తారు. దీనినే ప్లేడే అంటారు. ఈ ప్లేడే రోజున భారీగా కార్మికులు విధులకు హాజరైనట్టు వారు పేర్కొన్నారు. ఆదివారం మామూలు రోజు మాదిరిగానే బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. సమ్మె ప్రభావం తగ్గిపోతున్న క్రమంలో సోమవారం నుంచి కార్మికులు యథావిధిగా హాజరుకావాలని కోరారు. సోమవారం నుంచి 3 రోజుల పాటు దేశ వ్యాప్తంగా తలపెట్టిన మూడు రోజుల సమ్మెను జాతీయ కార్మిక సంఘలు విరమించుకున్న క్రమంలో కేవలం వారసత్వ ఉద్యోగాల కోసం సింగరేణిలో సమ్మెను కొనసాగించడం సరైంది కాదని యాజమాన్యం పేర్కొంటుంది.

వంద శాతం హాజరు


సింగరేణి బొగ్గు ఉత్పాదన పరిశ్రమలో తొలిసారి సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఆదివారం కూడా ఉద్యోగులు పనిచేసి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు. సింగరేణి సంస్థ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటివరకు కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం, హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో పనిచేసే ఉద్యోగులకు ఆదివారం వర్కింగ్ డేను ప్రకటించి ప్లేడేను (వేతనంతో కూడిన సెలవు, డబుల్ మస్టర్) అమలు చేయడంతో వంద శాతం ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. సింగరేణి వ్యాప్తంగా 11ఏరియాల్లోని అన్నీ జీఎం కార్యాలయాలు, స్టోర్స్, వర్క్‌షాప్‌లు కూడా ప్లేడే ఇవ్వడంతో నూటికి నూరుశాతం కార్మికులు, ఉద్యోగులు హాజరయ్యారు. కొత్తగూడెం, హైదరాబాద్ ప్రధాన కార్యాలయాల్లోని ఉద్యోగులతోపాటు అధికారులు కూడా విధులకు హాజరయ్యారు. కోల్‌బెల్ట్ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో మొదటి షిప్ట్‌లో 55శాతం మంది, సెకండ్ షిఫ్ట్‌లో 63శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఏదీ ఏమైనప్పటికీ సమ్మె ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

15శాతం అధికంగా బొగ్గు ఉత్పత్తి..


సాధారణ హాజరుశాతంతో పోలిస్తే ఆదివారం 77శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. సమ్మె జరిగిన మొదటిరోజుతో పోలిస్తే హాజరుశాతం 45శాతం అధికంగా పెరిగింది. ఆదివారం ప్లేడేగా ప్రకటించడం, డబుల్ మస్టర్ అవకాశాన్ని కల్పించడంతో కార్మికులు ఎక్కువ సంఖ్యలో విధులకు హాజరయ్యారు. సాధారణ సగటు బొగ్గు ఉత్పత్తి కన్నా గడిచిన మూడురోజుల సమ్మె కాలంలో 15శాతం అధికంగా సగటు బొగ్గు ఉత్పత్తి జరిగిందని, బొగ్గు రవాణా కూడా 13శాతం ఎక్కువగా చేశామని సింగరేణి యాజమాన్యం తెలిపింది. వారసత్వ ఉద్యోగాలపై సింగరేణి సంస్థ ఇచ్చిన వివరణతో కార్మికులు ఎక్కువ శాతం విధులకు హాజరవుతున్నారని, హాజరైన కార్మికులు తమ పూర్తిసామర్థ్యంతో పనిచేస్తూ అధికోత్పత్తి, రవాణా సాధిస్తున్నారని యాజమాన్యం పేర్కొంది. దీనివల్ల సంస్థకు, రాష్ర్టాభివృద్ధికి కార్మికులు ఎక్కువ శాతం సంఘీభావం తెలియజేశారని యాజమాన్యం వెల్లడించింది. సమ్మెకు ముందు సగటున రోజుకు లక్షా 52వేల 186 టన్నుల బొగ్గుత్పత్తి జరగ్గా, మూడు రోజుల సమ్మె కాలంలో సగటున సరాసరి ఉత్పత్తి లక్షా 75వేల 450టన్నులుగా నమోదైందని, ఇది సాధారణ రోజువారీ సగటు కన్నా 15శాతం అధికమని పేర్కొంది.

మంచిర్యాలలో పెరిగిన ఉత్పత్తి..


మంచిర్యాల జిల్లాలోని మూడు ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి పెరిగింది. ఒకటి, రెండు రోజులు సమ్మె ప్రభావం కాస్తంత కనిపించినా శని, ఆదివారాలు పెద్దగా కనిపించలేదు. సమ్మె ప్రభావం ఉత్పత్తిపై పడకుండా యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకుంది. ఏరియాల వారీగా జీఎంలు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుండటంతో ఉత్పత్తి పెరుగుతోంది.

1138

More News

VIRAL NEWS