ఎర్రవల్లి యజ్ఞవాటికలో వేదోక్తంగా యాగం ప్రారంభం


Tue,January 22, 2019 03:02 AM

CM KCRs five day Sahasra Chandi Yagam begins at erravalli

-300కుపైగా రుత్విక్కుల వేదపారాయణాలు
-పూజల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
-ఐదురోజులపాటు కొనసాగనున్న యాగం
-శుక్రవారం మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగింపు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సర్వజనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో మహారుద్రసహిత సహస్ర చండీయాగం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో సోమవారం వేదమంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైంది. రాష్ట్రంతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన 300 మందిపైగా రుత్విక్కుల వేదపారాయణాలు, వేదమంత్రాలు ఎర్రవల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతిధ్వనించాయి. వ్యవసాయక్షేత్రంలో నిర్మించిన చండీ యాగవాటికలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సోమవారం ఉదయం 11 గంటలకు వేదోక్తంగా అంకురార్పణ చేశారు. విశాఖనుంచి ప్రత్యేకంగా వచ్చిన శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీస్వామి సమక్షంలో మేళతాళాలలో, మంత్రోచ్చారణతో యజ్ఞం ప్రారంభమైంది. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గోపూజ చేశారు. వేదపండితులు, రుత్విక్కుల కోసం చుట్టూ ప్రత్యేకంగా నిర్మించిన యాగశాలల్లో చతుర్వేద హవనం, రాజశ్యామల హవనం, నవగ్రహ హవనాలు చేశారు. ఇంకోవైపు మహారుద్రసహిత సహస్ర చండీయాగానికి సంబంధించిన పారాయణాలు, రుద్రపారాయణాలు చేశారు.

cm-kcr4
బగళాముఖిదేవి స్థాపన, జపాలు కూడా చేశారు. రాత్రివరకు కార్యక్రమాలు కొనసాగాయి. కర్ణాటకలోని జగద్గురు శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థస్వామి ఆశీస్సులతో ఈ పీఠానికి చెందిన మాడుగుల మాణిక్య సోమయాజులు, తంగిరాల సీతారామశాస్త్రి, రుగ్వేద పండితులు నరేంద్రకాప్రే తదితర ప్రముఖులు యాగానికి వైదిక సారథ్యం వహించారు. సుమారు 300 రుత్విక్కులు దుర్గాసప్తశతి పారాయణ క్రతువును ప్రారంభించడానికి ముందుగా యాగం నిర్విఘ్నంగా కొనసాగాలనే తలంపుతో 1000 మోదుగులతో ప్రత్యేక హవనాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా రుత్విక్కులు వేదమంత్రాలు వల్లిస్తుండగా ముఖ్యమంత్రి దంపతులు యజ్ఞవాటిక చుట్టూ ప్రదక్షిణం జరిపి చండీ యజ్ఞవాటికలో పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం శాస్ర్తోక్తంగా గోపూజ, గురుపూజ జరిగింది. అరణి నుంచి అగ్నిని మధించడం ద్వారా రగిలిన నిప్పుతో యాగ క్రతువును ప్రారంభించారు. సుమారు మూడుగంటలపాటు ముఖ్యమంత్రి దంపతులు యాగవాటికలోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా వైవాహిక స్వర్ణోత్సవాలు జరిగిన వయోవృద్ధ దంపతులకు దంపతీపూజలు, కన్యాకుమారి పూజలను ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని, రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురువాలని, వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని రుత్విక్కులు పూజలుచేశారు.

cm-kcr8
రాష్ట్రంతోపాటు దేశం సుభిక్షంగా ఉండాలని, దేశపౌరులకు సుపరిపాలన అందాలని భగవంతుడిని ప్రార్థించారు. ఐదురోజులపాటు జరిగే ఈ యాగం శుక్రవారం మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతితో ముగుస్తుంది. ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో గతంలో రాజశ్యామల యాగంచేసిన ప్రదేశంలోనే ప్రత్యేకంగా యాగశాలలు నిర్మించారు. రుత్విక్కుల కోసం ప్రత్యేకంగా వసతి, భోజన ఏర్పాట్లుచేశారు. బయటివారిని అనుమతించడంలేదు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, కల్వకుంట్ల కవిత, జోగినిపల్లి సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మండలిలో విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, బాల్క సుమన్, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

murali-mohana-rao

ఆధ్యాత్మిక శోభలతో వెల్లివిరిసిన ఎర్రవల్లి

నిన్న రాత్రి 11:32 గంటలకు నా మొబైల్ మోగింది. పేరు డిస్‌ప్లే కాలేదు. ఎవరా? అని లిఫ్ట్ చేశాను. నేను సంతోష్‌ను. ఎంపీని. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపటినుంచి అయిదు రోజులపాటు చండీయాగం చేస్తున్నారు. మీరు తప్పకుండా రావాలి అన్న మాటలు వినిపించగానే నాకు నిద్రమత్తు ఎగిరిపోయింది. సంతన్న అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే జోగినిపల్లి సంతోష్‌కుమార్ టీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయన పేరు వినడమే తప్ప ముఖ పరిచయం లేదు. అక్కడికి నాబోటి సామాన్యులను రానిస్తారా? అందునా అది ముఖ్యమంత్రిగారి కుటుంబం మొత్తం పాల్గొనే క్రతువు? అని అడిగాను అమాయకంగా. మీరు ధరణి కులకర్ణి (నా మిత్రుడు)తో కలిసిరండి. ఎవరు ఆపినా నా పేరు చెప్పండి అని అన్నారు సంతన్న. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగారు దైవభక్తి పరాయణులు అని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ నేను రాజకీయాలను ఏమాత్రం ప్రస్తావించను. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలోని దేవాలయాలకు మహర్దశ పట్టిందని గతంలో చాలాసార్లు రాశాను. అయిదేండ్ల క్రితం యాదగిరిగుట్టకు వెళ్ళినవారు ఇప్పుడు వెళ్తే అసలు గుర్తుపట్టలేరు.

cm-kcr2
యాగాలు, యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు, ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక భాగం. గతంలో అయుత చండీయాగాన్ని దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా నిర్వహించిన ఘనత ఆయన కీర్తికిరీటంలో ఉన్నది. స్వామీజీలు, పీఠాధిపతులు అంటే కేసీఆర్‌కు ఎనలేని భక్తిప్రపత్తులు. నేను, కులకర్ణి పదకొండున్నరకు ఎర్రవల్లికి చేరుకున్నాము. అక్కడ ముఖ్యమంత్రిగారి వ్యవసాయక్షేత్రం ఉన్నది. దాని లోపలికి అడుగుపెట్టగానే మేము ఈ భూప్రపంచంలోనే ఉన్నామా లేక పురాణకాలానికి వెళ్లిపోయామా అన్న సందేహం కలిగింది. పురాణాల్లో లేదా పాత పౌరాణిక సినిమాల్లో మనం చూసినట్టుగా మహర్షుల ఆశ్రమాలు, యాగశాలలు, గోమాతలు, పర్ణశాలలు, స్వామీజీలు, ఋత్విక్కులు.. అంతా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. మేము వెళ్లేసరికే సహస్ర మహా చండీయాగం ప్రారంభమైంది. కేసీఆర్ పట్టువస్ర్తాలు ధరించి యజ్ఞగుండంలో గోఘృతాన్ని సమర్పిస్తూ వశిష్టమహర్షిలా కనిపించారు. వేదమూర్తులైన బ్రాహ్మణులు ఏడెనిమిది పర్ణశాలల్లో సిద్ధంచేసిన హోమగుండాల్లో సమిధలు వేస్తూ మంత్రోచ్చారణ చేస్తున్నారు.

cm-kcr6
కేసీఆర్ తమ ధర్మపత్నితో పరమనిష్ఠగా యాగంచేస్తున్న దృశ్యాన్ని కన్నులపండువగా తిలకించాము. ఈ యాగం కేవలం కేసీఆర్ వ్యక్తిగతం. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ఉద్యోగులు ఎవ్వరూ కనిపించలేదు. కుటుంబ కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోని కేసీఆర్‌ను అభినందించడానికి మాటలు చాలవు. మధ్యలో డైనమిక్ లీడర్ కేటీఆర్, రాజకీయ సివంగి శ్రీమతి కవిత తమ కుటుంబాలతోసహా కనిపించారు. ధరణి నన్ను వారికి పరిచయం చేయబోతుండగా వీరు ఇలపావులూరి మురళీమోహనరావు.. వారి పోస్టింగ్స్ అన్నీ మేము చదువుతుంటాము అని కేటీఆర్ చెప్పడంతో నాకు నోట మాట రాలేదు. శ్రీమతి కవిత కూడా నవ్వుతూ నేను రాసేవి వారి దృష్టికి వస్తుంటాయని చెప్పడం వారి నిరాడంబరతకు నిదర్శనం.

cm-kcr5
మరొక మిత్రబాంధవుడు శ్రీ శేరి సుభాష్‌రెడ్డి గారు కడు ఆప్యాయంగా పలకరించి నా పోస్టింగ్స్ అన్నీ తాను చదువుతానని చెప్పడం ఎంత సంతోషం కలిగించిందో చెప్పలేను. ముఖ్యమంత్రి గారి కుడిభుజం.. వారి కార్యదర్శి శ్రావణ్‌రెడ్డి గారు నన్ను పలకరించిన తీరు, మర్యాదించిన వైనం నన్ను పులకాంకితుడిని చేశాయి అని వినయంగా చెబుతున్నాను. ఇక మధ్యాహ్నం అతిథులకు అత్యంత రుచికరమైన భోజనాలను ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి తర్వాత కేసీఆర్ దంపతులు యాగాన్ని పునఃప్రారంభించారు. ఆ సమయంలో కేసీఆర్‌ను సందర్శించే భాగ్యం కల్పించారు సంతన్న. ఎప్పుడో తెలుగు మహాసభల ముగింపు రోజున నేను కేసీఆర్‌ను వేదికమీద చూశాను. ఇంతవరకు వారిని సమీపంగా చూసే అవకాశం రాలేదు. నన్ను పరిచయం చేయబోతుండగా వారు నాకెందుకు తెలియదు? ప్రముఖ జర్నలిస్ట్ అనే మాటలు కేసీఆర్ నోటినుంచి పీయూషబిందువుల్లా జాలువారడంతో నన్ను నేను గిల్లి చూసుకున్నాను. మై గాడ్! ఆయన ఒక రాష్ర్టానికి సర్వాధికారి.. రాచరికపుటెత్తులతో రణతంత్రపుజిత్తులతో నిరతము సతమతమైపోతుండేవారు.

cm-kcr3
అలాంటి గొప్ప నాయకుడు నన్ను గూర్చి అలా చెప్పడం, విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వాములవారికి కూడా పరిచయం చెయ్యడం నా పూర్వజన్మ సుకృతం. నేను స్వాములవారికి పాదప్రణామం చేసి తరించాను. వచ్చేటపుడు సంతన్నను ప్రశ్నించాను.. మీరంతా ఇంత గొప్ప హోదాల్లో, పదవుల్లో ఉంటూ కూడా ఇంత నిరాడంబరంగా ఎలా ఉండగలుగుతున్నారు? అని. సంతన్న నవ్వుతూ మాకు ఆయన (కేసీఆర్) నేర్పించిన సంస్కారం ఇది. మాదేమీ లేదు. పదవులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. కానీ మనమంతా మామూలు మనుషులమే.. అతని వయసుకు అది ఎంత గొప్ప జవాబు. అందుకే ఆ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు అమితంగా ప్రేమిస్తారు. తెలంగాణలో కేసీఆర్‌ను మించినవారు ఎందరో ఉండవచ్చు. కానీ, కేసీఆర్ లాంటివారు కేసీఆర్ ఒక్కరే! దట్ ఈజ్ కేసీఆర్! నేను అసలు ఊహించని ఆ చండీయాగానికి వెళ్లగలిగే మహత్తరమైన అవకాశాన్ని నాకు ఎవరు కలిగించారు? నేను పెద్ద భక్తుడిని కాను.

పూజలు అవీ చెయ్యను. కానీ, నాకు అమ్మవారి దర్శనభాగ్యం ఎలా కలిగింది? మహత్తరమైన చండీయాగాన్ని ఎలా దర్శించగలిగాను? ఎవరు కారకులు? ముఖ్యమంత్రిగారా? అమ్మవారా? ఎంత అదృష్టం! ఎన్ని జన్మల భాగ్యం?. నా దగ్గర సమాధానం లేదు. లోకకల్యాణార్థం ముఖ్యమంత్రి తలపెట్టిన ఈ సహస్ర మహా చండీయాగం దేవతల ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తయ్యి, ముఖ్యమంత్రిగారి కామితాలు తీరాలని, ప్రజలంతా సుఖశాంతులతో, వర్షభాగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని మాత్రమే మనం కోరుకోగలిగింది!
- ఇలపావులూరి మురళీమోహనరావు

1768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles