ఆర్టీసీ బలోపేతం

Tue,October 8, 2019 03:39 AM

-కొత్త నెత్తురు, జవసత్వాలు రావాలి
-ఆర్టీసీ పూర్తి ప్రైవేటీకరణ ప్రభుత్వానికి ఇష్టంలేదు
-మూడు భాగాలుగా బస్సుల విభజన
-ఆర్టీసీ బస్సులు 50%, అద్దె బస్సులు 30%, ప్రైవేటు బస్సులు 20%
-కొత్తగా అద్దెకు తీసుకునేవి 9%
-ఆర్టీసీ చార్జీలతో సమానంగా ప్రైవేట్ బస్సుచార్జీలు
-ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయం: సీఎం కేసీఆర్
-ఇష్టంవచ్చినరీతిలో సమ్మె చేస్తామనటం దురహంకారం
-భవిష్యత్‌లో ఆర్టీసీలో యూనియనిజం ఉండదు
-ప్రభుత్వం ఎవర్నీ డిస్మిస్ చేయలేదు
-విధుల్లోకి రానివారు సెల్ఫ్‌డిస్మిస్ అయినట్టే
-రాయితీ పాసులు కొనసాగుతాయి
-ప్రభుత్వ చర్యలను ప్రశంసిస్తున్న ప్రజలు
-ఆర్టీసీపై సమీక్షలో సీఎం కే చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించడం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టంలేదని, ఆర్టీసీ ఉండి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలుగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. తదనుగుణంగానే ఆర్టీసీని పటిష్ఠపర్చేందుకు అనేకచర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొత్తం ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడం వివేకమైన చర్యకాదనికూడా అన్నారు. క్రమశిక్షణను తు.చ. తప్పకుండా అమలుచేసి, ఆర్టీసీని లాభాలబాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునిల్‌శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆర్టీసీకి సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అందజేసింది. వాటిపై సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. వీటిని భవిష్యత్‌లో మూడురకాలుగా విభజించి నడపాలి. 50% బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవై, ఆర్టీసీ యాజమాన్యంలోనే ఉంటాయి.

30%.. అంటే 3100 బస్సులు అద్దె రూపేణా తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడుపుతారు. వాటిని ఆర్టీసీ డిపోల్లోనే ఉంచుతారు. మరో 20%.. అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రైవేట్‌వి. ప్రైవేట్ స్టేజ్‌క్యారేజ్‌విగా అనుమతి ఇస్తారు. ఈ బస్సులు పల్లెవెలుగు సర్వీసు కూడా నడపాలి. అద్దెకు తీసుకున్న బస్సులు, స్టేజ్‌క్యారేజ్ బస్సులు ఇతర రూట్లతోపాటు నగరంలోనూ నడపాలి అని చెప్పారు. ఆర్టీసీ చార్జీలు, ప్రైవేట్ బస్సుల చార్జీలు సమానంగా, ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయి. ఆర్టీసీ చార్జీలను పెంచినప్పుడే వాళ్ల చార్జీలు కూడా పెంచాలి. స్వల్పంగా పెంచడం కూడా ఆర్టీసీ కమిటీ నిర్ణయం మేరకు, అవసరమని భావించినప్పుడు చేయాలి. ఇప్పటికే 21% అద్దె బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. అంటే, ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా మరో 9% మాత్రమే. అదనంగా 9% అద్దె బస్సులను పెంచడం అంటే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లే అని సీఎం తెలిపారు.

యూనియన్ల అతి ప్రవర్తనే..

ఈ చర్యలన్నీ చేపట్టడానికి ప్రధానకారణం ఆర్టీసీ యూనియన్ల అతిప్రవర్తనేనని సీఎం కేసీఆర్ అన్నారు. తాము ఎక్కిన చెట్టుకొమ్మను తామే నరుక్కున్నారు. గత 40 ఏండ్లుగా జరుగుతున్న దాష్టీకంవల్ల ఇదంతా చేయాల్సి వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో సమ్మెచేసిన ఆర్టీసీ యూనియన్లు, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా సమ్మెకు దిగాయి. ప్రభుత్వం ఏది ఉన్నా వీళ్ల అతిప్రవర్తనలో మార్పులేదు. పకడ్బందీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మేనేజ్‌మెంట్‌కు ఈ యూనియన్లు ఇవ్వవు. ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయం. పండుగలకు, విద్యార్థుల పరీక్షలకు ఎవరూ కష్టపడకూడదని ప్రభుత్వ ఉద్దేశం. సమ్మె ఉధృతం చేస్తామనటం హాస్యాస్పదం అని చెప్పారు.

cm-kcr2

సెల్ఫ్ డిస్మిస్..

ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1200 మాత్రమేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మిగతావారిని డిస్మిస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేనేలేదు. ఎవరూ ఎవర్నీ డిస్మిస్ చేయలేదు. వాళ్ళంతట వాళ్లే తొలగిపోయారు. గడువు లోపల విధుల్లో చేరకపోవటంతో వాళ్లు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లే. ప్రభుత్వ, ఆర్టీసీ యాజమాన్య విజ్ఞప్తులకు వారు స్పందించలేదు. తొలగిపోయినవారు డిపోల దగ్గర, బస్‌స్టేషన్ల దగ్గర గొడవచేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేయాలని డీజీపీని ఆదేశించాను. విధుల్లో ఉన్న 1200 మంది తప్ప ఎవరు వచ్చినా, దురుసుగా ప్రవర్తించినా డీజీపీ సరైన చర్యలు తీసుకుంటారు అని ముఖ్యమంత్రి చెప్పారు.

రాయితీ పాస్‌లు కొనసాగుతాయి

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్య్ర సమరయోధులు, పాత్రికేయులు, పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెందినవారు, ఉద్యోగులు, తదితరుల సబ్సిడీ బస్‌పాసులు ఇక ముందు కూడా కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ఇవన్నీ ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయని, సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. దానికి కావాల్సిన నిధులు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునిల్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌సుల్తానియా, అదనపు డీజీపీ జితేంద్ర, ఆర్టీసీ, రవాణాశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో చర్చించిన, నిర్ణయం తీసుకున్న మరికొన్ని అంశాలు:

-దురహంకారపూరితంగా సమ్మెకు పోవటానికి కారణం యూనియన్ల మోనోపలీ భావనే.
-ఇష్టం వచ్చినరీతిలో సమ్మె చేస్తామనటం దురహంకారం.
-ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ సంస్థలో ఏది జరిగినా అది ప్రభుత్వ అనుమతితోనే జరగాలి.
-విధుల్లోకి రానివారిని ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు ఇక యూనియన్ల ప్రసక్తేలేదు. యూనియన్లు వాటి అస్తిత్వాన్ని కోల్పోయాయి.
-భవిష్యత్‌లో ఇక ఆర్టీసీలో యూనియనిజం ఉండదు.
-భవిష్యత్‌లో ఆర్టీసీ అంటే ఒక అద్భుతమైన సంస్థగా రూపుదిద్దుకోవటమే.
-ఆర్టీసీ భవిష్యత్‌లో లాభాలకు వచ్చి, కార్మికులకు (కొత్తగా చేరేవారికి) బోనస్ ఇచ్చే పరిస్థితికి రావాలి.
-సంస్థ లాభాల్లో నడవాలి.. నష్టాల్లోకి పోకూడదు.
-ఆర్టీసీకి కొత్త నెత్తురు, జవసత్వాలు రావాలి.
-రవాణారంగంలో రోజురోజుకు పెరుగుతున్న పోటీ నేపథ్యంలో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థగా దేశంలోనే పేరుగాంచిన రాష్ట్ర ఆర్టీసీ.. తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూనే ఆర్థిక పరిపుష్టిని సాధించుకుని లాభాల బాటలో పయనించటానికి తీసుకోవాల్సిన చర్యలపై సూక్ష్మ దృష్టి సారించాల్సిన అవసరమున్నది.
-ఆర్టీసీ నిరంతరం చైతన్యంతో ప్రజలకు సేవలు అందించే సంస్థ.
-పండుగలు, పరీక్షలు వంటి కీలక సమయాల్లో కార్మికసంఘాలు సమ్మెలకు పిలుపునిచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే పరిస్థితులు కొనసాగుతున్నాయి. వాటిని రూపుమాపి, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.
-ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారు.

ashwathama-reddy

మా సమ్మె న్యాయబద్ధమే

-ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
-ఆర్టీసీ నేతల అరెస్ట్.. విడుదల

తాము చేస్తున్న సమ్మె న్యాయసమ్మతమేనని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపడుతామనటం సమంజసం కాదన్నారు. సోమవారం ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించడానికి చేరుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలను.. అనుమతి లేకపోవటంతో పోలీసులు అడ్డుకొన్నారు. అసెంబ్లీ చుట్టుపక్కల నాలుగు కిలోమీటర్ల పరిధిలో ర్యాలీలు, నిరసనలు నిర్వహించడంపై నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఈ విషయాన్ని పోలీసులు జేఏసీ నాయకులకు తెలిపినా.. వారు దురుసుగా ప్రవర్తించడంతో అదుపులోకి తీసుకొని వారిని సమీప పోలీస్‌స్టేషన్లకు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై వదిలివేశారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు తీసుకోకుండా ఆర్టీసీ ఉద్యోగులు అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్కుకు చేరుకోవాలనే యోచనలో ఉండగా తప్పనిసరి పరిస్థితిలో అరెస్టులు చేయవలసి వచ్చిందని ఏసీపీ వేణుగోపాలచారి చెప్పారు. విడుదల అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని, కార్మికులకు రావాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించాలని కోరారు. భవిష్యత్ కార్యాచరణను బుధవారం ప్రకటిస్తామని తెలిపారు.

5153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles