తెలంగాణను బానిస కానివ్వ


Thu,December 6, 2018 03:49 AM

CM KCR Speech At Gajwel Praja Ashirvada Sabha Telangana Elections 2018

-తెలంగాణ గెలిచి నిలువాలి.. నవ్వెటోని ముందట జారిపడొద్దు
-దాచిదాచి దయ్యాల పాలుచేయొద్దు
-తెలంగాణలో కీలుబొమ్మ ప్రభుత్వం చంద్రబాబు లక్ష్యం
-కేసీఆర్ ఇక్కడుంటే ఆటలు సాగవనే కుట్రలు
-కృష్ణాలో నీళ్లు లేవంటవా?.. గోదావరి నీళ్లు పంచుతావా?
-చంద్రబాబుకు ఎంత ధైర్యం?.. తలకాయలూపిన కాంగ్రెస్ గొర్రెలు
-గులాబీతో కాళేశ్వరం.. కూటమితో శనేశ్వరం..
-గజ్వేల్‌లో గెలిచిందే గవర్నమెంటు
-దొంగ సర్వేలను చూసి గోల్‌మాల్ కావద్దు
-నా కంఠంలో ప్రాణమున్నంతవరకూ ఇది జరగదు..
-వలసశక్తులకు చోటియ్యొద్దు.. ఢిల్లీ గులాంల ప్రభుత్వం రావొద్దు: సీఎం కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తన కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణను బానిస కానివ్వబోనని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. దశాబ్దాలుగా బానిసగా ఉన్న తెలంగాణను.. కొట్లాడి సాధించుకున్నామని, నాలుగేండ్లుగా దేశానికే ఆదర్శంగా పాలించుకుంటున్నామని అన్నారు. ఇప్పుడు మళ్లా తెలంగాణ ప్రజలను బానిసలను కానివ్వనని స్పష్టంచేశారు. 58 ఏండ్లు తండ్లాడి, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాకులకు, ఇనుపమూతి గద్దలకు ఇస్తే ప్రమాదమని హెచ్చరించారు. ఏండ్ల తరబడి గోసపెట్టినోళ్లే మళ్లీ వస్తున్నారన్న సీఎం.. తెలంగాణ గెలిచి నిలువాలని ప్రజలకు సూచించారు. యావత్తు తెలంగాణ ఈరోజు ఏమరపాటుకు గురికాకుండా, నక్కజిత్తులకు, మాయగాళ్లకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలి. 2018 ఎన్నికల చివరిసభ నుంచి తెలంగాణ ప్రజలకు మీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్న. మనలోమనకు చిన్నచిన్న విభేదాలుంటే పరిష్కారం చేసుకుందం. అదో పెద్ద సమస్య కాదు. కానీ వలసశక్తులకు చోటియ్యొద్దు. చంద్రబాబు పెత్తనం నడిచే ప్రభుత్వం రావద్దు. ఢిల్లీ గులాంల ప్రభుత్వం రావద్దు. దరఖాస్తు పట్టుకొని విజయవాడకు పోయే దుస్థితి మనకు రావద్దు అన్నారు. పేదల కంట కన్నీరు చూడని తెలంగాణ నా స్వప్నం. దుఃఖంలేని తెలంగాణ నా ఆశ. ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం. కోటి ఎకరాలకు కచ్చితంగా నీరుపారేది నేనుచేస్తున్న యజ్ఞం. ఇది నెరవేరాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ యజ్ఞం ఆగొద్దు. ఈ ప్రయాణం ఆగొద్దు. తెలంగాణ గెలిచి నిలువాలి.
KCR-MEETING
నవ్వెటోనిముందట జారిపడొద్దు. ఓట్లు అనంగనే గాలిగాలి గత్తరగత్తర కావొద్దు. మనం గాలిగాలి ఓటువేస్తే అంత గాలిగాలే ఉంటది. ఓటు వేసినోడు మల్ల కనిపించడు. ఐదేండ్లు గట్లనే ఉంటం. మీ బిడ్డగా యావత్ ప్రజానీకానికి నా విజ్ఞప్తి. దాచిదాచి దయ్యాల పాలుచేయొద్దు. ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే ఇగురంగా మొగ్గ తొడిగేటువంటి ప్రయత్నం. నేను చల్లిన విత్తనాలు మొలకెత్తి.. పూతపూసి.. కాయగాసే సమయం వస్తాఉన్నది అని సీఎం చెప్పారు. ఇప్పుడిప్పుడే తెలివికొస్తున్నం. దీన్ని చెడగొట్టుకోవద్దు అని విజ్ఞప్తిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయాలని కృషిచేస్తుంటే.. మన భూముల్లో పారాల్సిన గోదావరి నీళ్లు పంచుకుపోయేందుకు చంద్రబాబు కుట్రచేస్తున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణను మళ్లీ వలస పెత్తందార్ల పాలుచేసేందుకు వస్తున్న కూటమికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. తాను పోటీచేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు.

కేసీఆర్ ఇక్కడుంటే తన ఆటలు సాగవని, దద్దన్నలు, మొద్దన్నలు ఉంటే గోల్‌మాల్ చేయొచ్చని అనుకుంటున్నారని విమర్శించారు. కృష్ణానదిలో నీళ్లులేవు.. గోదావరి నీళ్లు పంచుకుందాం.. అంటూ కాంగ్రెస్ సన్నాసులను పక్కనబెట్టుకుని మాట్లాడుతున్నాడని, ఆయన మాటలకు కాంగ్రెస్ గొర్రెలు తలకాయలు ఊపుతున్నాయని మండిపడ్డారు. కృష్ణాబేసిన్‌లో ఉన్న కోదాడలో నిలబడి.. కృష్ణాలో వాటా లేదంటవా? నీకెంత ధైర్యం? అని ప్రశ్నించారు. చాలా కష్టపడి, అనేక పోరాటాలు చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నామని సీఎం చెప్పారు. 58 ఏండ్ల తండ్లాట. అనేక మరణాలు ఫైరింగులు, జైళ్లు, క్షోభ అనుభవించి భగవంతుని దయవల్ల 2014లో రాష్ట్రాన్ని సాధించుకున్నం. చిన్నమాట కాదు. ఎంత మంది చనిపోయారో, తల్లుల బాధ ఏందో అందరం చూశాం. త్యాగాల మీద వచ్చిన తెలంగాణ ఇది. ఎవడో బిస్కెట్‌లాగా మనకు ఇయ్యలే. తెలంగాణలో ఏం జరుగుతున్నదో మీకు తెలుసు. డంబాచారం డబ్బాలు కొట్టుకోవటం అవసరం లేదు అని చెప్పారు. దేశంలో రైతాంగానికి 24 గంటల ఉచిత కరంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని సీఎం చెప్పారు.
KCR1
ప్రధాని నరేంద్రమోదీ డబ్బా కొట్టే గుజరాత్‌లో కూడా ఇవ్వటంలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతుల అప్పులు తీరిపోవాలనే వారికోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అమ్మవారి దీవెనతో కొండపోచమ్మసాగర్, కొమురెల్లి మల్లన్న దయతో మల్లన్నసాగర్ పూర్తవుతున్నయి. అవి నిండాలే.. మన కలలు పండాలే. సిద్దిపేట జిల్లా మొత్తం ఆకుపచ్చగా.. హెలికాప్టర్ ఎగిరితే బెత్తెడు జాగకూడా ఖాళీలేని పరిస్థితి రావాలి. యావత్ తెలంగాణ ఆ విధంగా కావాలి అని ఆకాంక్షించారు. తెలంగాణ మేధావులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, రచయితలు, కవులు, కళాకారులు అందరూ తెలంగాణకు రక్షణకవచంగా నిలువాలని కోరారు. ఈరోజు తెలంగాణ ఆర్థికాభివృద్ధి 17.17%. ఈ విషయంలో మనకు దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదు. ఏటా పెరిగే ఆదాయం రూ.12-16వేల కోట్లు. అదనపు ఆదాయం వస్తున్నది. పదేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మీద ఆదాయం రూ.9.56 కోట్లు. ఈరోజు నాలుగేండ్లలో ఇసుక మీద సంపాదించినది రూ.2,057 కోట్లు. ఎక్కడ తొమ్మిదిన్నర కోట్లు? ఎక్కడ రూ.2,057 కోట్లు? దొంగతనాలు, స్మగ్లింగ్, అరాచకాలను బంద్‌చేసినందువల్లే సాధ్యమైంది.
Metting
ఒక్క టర్మ్‌లో పదివేల కోట్లు పెరుగతది రాష్ట్ర ఆదాయం. సంపద పెంచాలె.. పేదలకు, రైతులకు, ప్రజలకు పంచాలె అని చెప్పారు. పట్టాదార్ పాస్‌పుస్తకాలు మీ ఊళ్లకే తెచ్చి ఇచ్చామని, రైతుబంధు చెక్కులు అందుతున్నాయని, ఎవరూ అడుగకుండానే 24గంటలపాటు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని, గోదాముల సామర్థ్యం పెంచామని సీఎం వివరించారు. అందుకే ఇవాళ ఎరువులు, విత్తనాల కొరత లేదని, ఎరువుల దుకాణాల ముందు చెప్పుల లైన్లు లేవని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు.. కేసీఆర్ బతికున్నంతవరకు రైతాంగానికి కచ్చితంగా 24 గంటల కరంటు ఉచితంగా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉన్న అప్పులన్నీ తీరి.. నీళ్లు వచ్చి.. ప్రతి రైతు దగ్గర పది లక్షలు.. పదిహేను లక్షలు నిల్వ ఉన్నపుడే అది బంగారు తెలంగాణ అవుతుందని చెప్పారు. అది సాధించిననాడు మనం గొప్పోళ్లమన్నారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించిన సీఎం.. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి పథకాలు అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. దీన్నిచూసి బయటివాళ్లకు కండ్లు కుడుతున్నాయని ఎద్దేవాచేశారు. మళ్లీ గెలిపిస్తే వెయ్యి ఉన్న పింఛను రెండువేలు, దివ్యాంగులకు రూ.1500 నుంచి మూడువేలు చేసుకుందాం.
KCR2
నిరుద్యోగ సోదరులకు నెలకు మూడువేలు భృతి ఇచ్చుకుందాం అని చెప్పారు. రైతులకు పంట పెట్టుబడి ఏడాదికి ఎకరానికి ఇప్పుడిస్తున్న ఎనిమిదివేల నుంచి పదివేలకు పెంచుకుందామన్నారు. బీడీ కార్మికులకు పీఎఫ్ కటాఫ్ డేట్ 2014 వరకు ఉందని, దానిని 2018 వరకు పెంచుతామని చెప్పారు. కేంద్రప్రభుత్వం 29 రాష్ర్టాల్లోని ముస్లిం మైనార్టీలకు రూ.4వేల కోట్ల బడ్జెట్ పెడితే.. తెలంగాణ ఒక్కటే రూ.2వేల కోట్ల బడ్జెట్ పెట్టి, ఖర్చు చేస్తున్నదని సీఎం చెప్పారు. దీనిని ముస్లిం సోదరులు అర్థంచేసుకుని మద్దతివ్వాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న కంటివెలుగు పథకం పుట్టిందే గజ్వేల్‌లో అని సీఎం గుర్తుచేశారు. తదుపరి ఈఎన్‌టీ వైద్యులు వచ్చి ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన పరీక్షలు చేస్తారని, తదుపరి దంతవైద్యులు వస్తారని చెప్పారు. చివరికి పాథలాజికల్ టీం వచ్చి, తెలంగాణలోని నాలుగు కోట్ల మందికి రక్తపరీక్షలు నిర్వహించి, హెల్త్ ప్రొఫైల్ తయారుచేస్తారని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణకావాలన్న సీఎం.. కంటి వెలుగు ఈ క్రమంలో తొలి అడుగని చెప్పారు. ఇంకా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

చంద్రబాబుకు కీలుబొమ్మ ప్రభుత్వం కావాలి

తెలంగాణలో ఆయన చేతిలో ఉండే కీలుబొమ్మ ప్రభుత్వం చంద్రబాబుకు కావాలి. చంద్రబాబుకు ఎవ్వడున్నా మంచిదే కానీ కేసీఆర్ ఉండొద్దు. ఎందుకంటే కేసీఆర్ దెబ్బకొడితే కరకట్టల పడ్డడు! కేసీఆర్ నడువనియ్యడు కదా.. ప్రాణం పోయినాసరే హక్కులు కోల్పోనియ్యడు కదా! ఇక్కడ బాబు ఆటలు సాగవు కదా! ఇక్కడ దద్దన్నలు, మొద్దన్నలు ఉంటే గోల్‌మాల్ చేయొచ్చు. దానికోసం అక్రమంగా సంపాదించిన వేలకోట్ల సొమ్మును, ఆంధ్రా నుంచి నాయకులను, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఇక్కడ మోహరించారు. మనమంతా అమాయకులమని, గోల్‌మాల్ చేయొచ్చని, డబ్బుతో మనల్ని కొనుక్కోవచ్చని చంద్రబాబు విర్రవీగుతున్నడు. దానికి మన దద్దమ్మగాల్లు బాజా కొడుతున్నరు. కాంగ్రెస్‌కు ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి చాతనైతలేదట. ఆంధ్రాకు పోయి చంద్రబాబును భుజాల మీద మోసుకొచ్చారు.

గోదావరి నీళ్లు పంచుతడట చంద్రబాబు

కోదాడలో రాహుల్‌గాంధీ, చంద్రబాబు మాట్లాడారు. పక్కకు మన కాంగ్రెస్ దద్దన్నలు, మొద్దన్నలు! కృష్ణానదిలో నీళ్లులేవు.. గోదావరి నీళ్లు పంచుకుందాం అన్నడు చంద్రబాబు. కృష్ణాలో నీళ్లులేవంటే మన కాంగ్రెస్ గొర్రెలు తలకాయలు ఊపుతున్నయి. లెవ్వా కృష్ణాలో నీళ్లు? మన వాటాలేదా? హరీశ్‌రావు పటపట పండ్లు కొరుకాలి. బిడ్డా వాటా లేదంటవా! నీకెంత ధైర్యంరా? అంటూ యావత్ తెలంగాణ ఓటుతో చెప్పాలి. మా గడ్డమీద.. కృష్ణాబేసిన్‌లో ఉన్న కోదాడలో నిలబడి కృష్ణలో నీళ్లు లేవు.. గోదావరి నీళ్లు పంచుకుందామంటూ మాయమాటలు మాట్లాడుతున్నవు. ఎంత ధైర్యం నీకు? అసలు ఏం కావాలె చంద్రబాబుకు?

పవర్‌ప్లాంట్ గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు

చిమ్మచీకటి రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు.. ఆ బాధ నాకు తెలుసు. హైకోర్టు విభజన కానియ్యరు. ఉద్యోగులను నియమించరు. కేంద్రం సహకరించది. ఏడు మండలాలు గుంజుకున్నరు. సీలేరు పవర్‌ప్లాంట్ గుంజుకున్నడు.. ఇదే దుర్మార్గుడు చంద్రబాబు. ఎన్నిరకాల బాధలు పెట్టిండ్రు! పునర్విభజన చట్టం ప్రకారం మనకు కేటాయించిన విద్యుత్ ఇయ్యరు. ఎంత లంగతనం అంటే విద్యుత్ ఇయ్యడు చంద్రబాబు. ఇగ ప్రధానమంత్రి నరేంద్రమోదీ! మీరు విభజన చట్టం అమలుచేయాలె అంటే ముసిముసి నవ్వులు నవ్వుతడు. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలేమో బ్రోకర్‌గాండ్లు. అవన్నీ భరించినం.. తట్టుకున్నం.

ప్రాజెక్టులపై కేసులేసిన బాబు వస్తుండు జాగ్రత్త..

కొండపోచమ్మసాగర్ నిండి గజ్వేల్, దుబ్బాక, ఆలేరు, మేడ్చల్ పొలాలు పండుతయి. శామీర్‌పేట్ చెరువు నిండుతది. మనం ఈ ఆశతో ఉంటే.. అది వద్దు అని కేసులు వేసిండు చంద్రబాబు. ఢిల్లీకి ఉత్తరాలు రాసిండు. పంచాయితీలు పెట్టిండు. అడుగడుగున అడ్డం పడ్డడు. గా చంద్రబాబును కాంగ్రెసోళ్లు భుజాల మీద మోసుకొస్తరా? అధికారం పోయిందన్న కసి, దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది. చేతులకెళ్లి తెలంగాణ జారిపోయిందని, కేసీఆర్ కొరకరాని కొయ్యగా తయారైండని చంద్రబాబు గులగుల.. వెరసి రెండు కత్తులు మన మీదకు వస్తున్నయి. ప్రమాదం పొంచి ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. నేను కొట్లాడిన ఒక్కడిని. ఎవరికీ నమ్మకంలేనినాడు మొదలుపెట్టిన. ఏ.. పిచ్చోడు వీడు.. యేడ పోతడో.. వీన్నెవడో బొండిగ ఇరిసి పడేస్తరు.. వీడెక్కడ బతుకుతడు? అన్నరు. భగవంతుని దయ, మీరందించిన సహకారం.. ఇయ్యాల తెలంగాణ గడ్డకు పడి ఊపిరి పీల్చుకున్నది. గట్టిగుంటే అట్లయింది.

భారీ మెజార్టీతో గజ్వేల్ గౌరవాన్ని పెంచుకుందాం..

వచ్చే ఐదేండ్లలో గజ్వేల్‌లో ఎన్ని వేల కుటుంబాలున్నా సరే.. అందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిచ్చే బాధ్యత నాది. ప్రతి ఇంటికి రెండు బర్రెలు వందశాతం సబ్సిడీపై ఇచ్చుకుందాం. రెండున్నర లక్షల ఎకరాలు పారాలి. నియోజకవర్గం మొత్తం పాడి పంటలతోటి బ్రహ్మాండంగ ఉండాలి. ఏ ఇల్లు చూసినా పాలుపోయాలి. అవసరమొస్తే ఇంకో డెయిరీ పెట్టుకుందాం. మండలానికో చిల్లింగ్ సెంటర్ పెట్టుకుందాం. మనం కూరగాయలు ఎక్కువ పండిస్తం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకుందాం. హార్టికల్చర్ యూనివర్సిటీ మన దగ్గరనే ములుగులో వచ్చింది. ఫారెస్టు కాలేజీ కూడా వచ్చింది. ఏమేం చేసిననో నేను చెప్ప.. మీ కండ్ల ముందలనే ఉన్నయి. ఎలాగూ కేసీఆర్ గెలుస్తడని అర్థమైయింది కాబట్టి.. వేరేవానికి ఓటేస్తే మోర్ల పారేసినట్టే. కేసీఆర్‌ను గెలిపించేదేదో బ్రహ్మాండంగ గెలిపిస్తే రాష్ట్రంలో మన గజ్వేల్ గౌరవం పెరుగుతది. ఇదే మాట టీఆర్‌ఎస్ కార్యకర్త ప్రతి ఊర్ల చెప్పాలి. మీ మధ్యనే నేనుంట. ఇంకా జరగాల్సినయి చాలా ఉన్నయి. దిష్టి కొడతది.. అందుకే నేను ప్రకటించను. గెలిచిన తెల్లారి ప్రకటించుకుందాం. మన అవసరాలన్నీ తీర్చుకుందాం. గజ్వేల్ పట్టణంలోని భూముల ధరలు ఆకాశాన్నంటుతయి. చాలా పరిశ్రమలు రాబోతున్నయి. కాలుష్యంలేని పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టుకుందాం. మన పిల్లలకు ఉద్యోగాలు బాగా దొరుకుతయి. అందరం బాగుపడతం. గజ్వేల్‌కు కేసీఆర్ ఏం చేసిండో మీకు తెలుసు. భవిష్యత్తుల ఏం చేస్తడో మీకు తెలుసు. కాబట్టి నేను డంబాచారం కొట్టను. మీ కండ్లముందే నేనున్న.. మీరే ఆలోచించాలి.. మనం పెద్ద మెజార్టీతోటి గెలువాలి.

ఇక తెలంగాణ ప్రజలే పోరాడాలె

నేను చాలారోజులు కొట్లాడిన. మీరు అధికారం ఇస్తే నా కంఠంలో ప్రాణం ఉండగా, తెలంగాణను మల్ల బానిస కానివ్వను. కానీ ఇప్పుడు కొట్లాడాల్సింది నేను కాదు. మీరు. మీ ఓటుతోని తెలివిగా దెబ్బకొట్టాలి. నేనెంత ఆరాటపడ్డనో, ఎంత పోరాటపడ్డనో.. చివరికి నిజాం దవాఖానలో చావునోట్లో తలకాయపెట్టే పరిస్థితి. చివరికి డాక్టర్లు కోమాలకు పోతావు కేసీఆర్.. వింటలేవు.. మొండిగ ప్రవర్తిస్తున్నవు అన్నారు. నేను బాధపడలేదు. భయపడలేదు. నేను దేవున్ని నమ్ముత.. ఒక్కరోజు ఆగురాబై అన్న. అదేరోజు రాత్రి ప్రకటన వచ్చింది. మీరంతా ఊపిరి పీల్చుకున్నరు. అంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాకులకు, ఇనుప మూతి గద్దలకు ఇస్తే చాలా పెద్ద ప్రమాదం వస్తది.

కాళేశ్వరంతో ఆకుపచ్చ తెలంగాణ

మనకు కాళేశ్వరం నీళ్లు తయారయితున్నయి. జూన్ తర్వాత వస్తయి. రెండు, మూడు నెలలు యెనకనో, ముందో వచ్చే వర్షాకాలంల వస్తయి. బ్రహ్మాండంగా మనమంతా ముందు దశలో చెరువులు నింపుకోవాలి. తర్వాత కాల్వలు చకాచకా పూర్తి చేసుకోవాలి. అప్పుడు బాగుపడతం. తెలంగాణ మొత్తం కోటి ఎకరాల పైచిలుకు నీళ్లు వస్తయి. దీనికి అడ్డం పెట్టి, మాయామశ్చీంద్ర చేయాలని చంద్రబాబు గొడ్డలి భుజం మీద పెట్టుకుని తిరుగుతుండు. ఈ ఓట్లల్ల కేసీఆర్‌ను నరికేస్తే ఖతమైపోతదిరా బాధ అని చూస్తున్నడు. దానికి దీటైన జవాబు తెలంగాణ సమాజం చెప్పాలి. కాంగ్రెస్ అధికార లాలస. అధికారం లేకపోతే బతకలేరు. కిరణ్‌కుమార్‌రెడ్డి నేను తెలంగానకు ఒక్క రూపాయి కూడా ఇయ్య.. రాస్కో.. ఏం చేస్కుంటవో చేస్కో పో అన్నడు. ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యేనన్న రాజీనామా చేసిండా? అరె.. గట్ల ఎట్ల మాట్లాడతవు అని అడిగిండ్రా? నాటినుంచి నేటిదాకా అదేకదా! ఇప్పుడు చంద్రబాబు, రాహుల్‌గాంధీ షేక్‌హ్యాండ్ ఇచ్చుకొని వస్తే.. వాళ్ల ఎమ్మడి గొర్రెలు తిరిగినట్టు తిరుగుతున్నరు. కృష్ణాలో నీళ్లు లేవంటే.. అరె అట్ల ఎట్ల మాట్లాడతవురా? అని ఎవడూ మైకు గుంజుకోలే. రోషం లేదు.. మన కండ్ల ముందు కనబడుతుంది చిత్రం. దాన్ని చూసుకుంటూ ఊరుకుందామా! చంద్రబాబు మాటను ఒప్పుకుందామా? కేసీఆర్, టీఆర్‌ఎస్ గెలిస్తే.. తెలంగాణ కోటి ఎకరాలకు నీళ్లు, తెలంగాణకు కాళేశ్వరం. చంద్రబాబు, కూటమి గెలిస్తే తెలంగాణకు శనేశ్వరం. కాళేశ్వరం కావాల్నా? శనేశ్వరం కావాల్నా? తెలంగాణ సమాజం తెలివితోటి ఆలోచన చేయాలి.

4425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles