ప్రణాళికాయుత అభివృద్ధి


Fri,July 19, 2019 02:15 AM

CM KCR Slams Congress Leaders At Telangana Assembly

-అందుకోసమే సరికొత్త మున్సిపల్ చట్టం
-రాష్ట్రంలో కొత్తగా ఆరు కార్పొరేషన్లు
-సకాలంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ
-రాష్ట్ర ఏర్పాటు తర్వాత విప్లవాత్మక సంస్కరణలు
-అనేక సాహసోపేత నిర్ణయాలు
-మున్సిపల్ బిల్లులు ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్
-కొత్త మున్సిపల్ చట్టంపై నేడు సభకు వివరించనున్న సీఎం
-చర్చ తర్వాత సభ ఆమోదానికి
-అనంతరం మండలిలో చర్చించి ఆమోదం
-రైతు మిగులు సాధించాలి
-అవసరమైతే 15వేల కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధం
-రైతుబాధలు తెలిసిన వ్యక్తిని నియమించాలనే సవరణ
-అన్నదాతలు అప్పులపాలు కావొద్దు: సీఎం కేసీఆర్
-తెలంగాణ రుణవిముక్తి కమిషన్ చట్టం సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
టీచింగ్ ప్రొఫెసర్లు రెడీమేడ్ కాదు
-రాష్ట్ర ప్రయోజనాలకోసమే బోధన వైద్యుల వయోపరిమితి పెంపు
-అన్ని రాష్ట్రాల్లానే 65 ఏండ్లకు పెంచాం
-వయోపరిమితి క్రమబద్ధీకరణ బిల్లును ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్
-హెరిటేజ్ ఒక జోక్‌లా మారిందని వ్యాఖ్య

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా సాగేందుకే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. గతంలో ఏర్పాటుచేసిన మునిసిపాలిటీల్లో, హైదరాబాద్ నగర శివార్లలో అక్రమ లేఅవుట్లు ఏవిధంగా పుట్టుకొచ్చాయో, ల్యాండ్ మాఫియా ఎలా విజృంభించిందో అందరికీ తెలిసిందేనన్న సీఎం.. కొత్త చట్టంతో అటువంటి దుష్టకార్యక్రమాలకు తెరపడుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులకు ఉద్దేశించిన పురపాలక శాసనాల (సవరణ) ఆర్డినెన్స్ బిల్లును, కొత్తగా తీసుకువస్తున్న తెలంగాణ పురపాలకసంఘాల బిల్లు-2019ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. వీటి వెనుక ఉద్దేశాలను, లక్ష్యాలను, ప్రాధాన్యం, అవసరాన్ని వివరించారు. తెలంగాణ పురపాలకసంఘాల బిల్లుపై శుక్రవారం పూర్తిస్థాయిలో వివరిస్తానని తెలిపారు.

శుక్రవారం చర్చ అనంతరం పురపాలక చట్టం బిల్లును సభ ఆమోదించనున్నది. అనంతరం మండలిలో ఇదే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు. వీటితోపాటు రైతు రుణవిముక్తి కమిషన్ ఆర్డినెన్స్, బోధన దవాఖానల్లో వైద్యుల వయోపరిమితి పెంపునకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించే బిల్లులను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఇటీవల ముగిసిన మండల, జిల్లా ప్రజాపరిషత్తు తొలి సమావేశాల విషయంలో జారీచేసిన ఆర్డినెన్స్‌కు చట్టరూపం కల్పించే బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టారు. మున్సిపల్ చట్టం బిల్లు మినహా మిగిలిన నాలుగు ఆర్డినెన్స్‌లపై సభ చర్చించి, ఆమోదం తెలిపింది. మున్సిపల్ చట్టంపై శుక్రవారం చర్చించనున్నారు. పురపాలక శాసనాలు, మున్సిపల్ చట్టం బిల్లులను ప్రతిపాదిస్తూ మాట్లాడిన సీఎం.. ప్రజల సౌలభ్యాన్ని కాంక్షించి రాష్ట్రంలో అనేక విప్లవాత్మక పాలనా సంస్కరణలను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. దీనిలో భాగంగానే 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటుచేశామన్నారు.

పోలీసు, రెవెన్యూ, పంచాయతీ తదితర అనేక విభాగాల్లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు అమలుచేసి 5000 పైచిలుకు నూతన పరిపాలన విభాగాలను రాష్ట్రంలో ఏర్పాటుచేసినట్టు చెప్పారు. వీటిద్వారా ఎలాంటి సమస్య లేకుండా ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. ఈ మధ్యనే పంచాయతీరాజ్ ఎన్నికలు పూర్తిచేసుకున్నామన్న సీఎం.. కొత్తగా ఎన్నికైన యువత ప్రజాసేవ చేసేందుకు ఉర్రూతలూగుతున్నారని చెప్పారు. మున్సిపాలిటీలు గతం లో చాలా తక్కువగా ఉండేవని, రాష్ట్రం ఏర్పడేనాటికి 65 దాకా పెరిగాయన్నారు. తర్వాత కార్పొరేషన్ల సంఖ్య ఏడుకు, మున్సిపాలిటీల సంఖ్య 136కు పెంచుకున్నామని, మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థలు ఏర్పాటయ్యేలా కృషిచేశామని చెప్పారు. గతంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా గ్రామపంచాయతీ, వార్డు, జెడ్పీ, మున్సిపాలిటీలను ఏర్పాటుచేసేవారని, దాన్ని పూర్తిగా మార్చేసి చట్టసభల్లోనే ఆ ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

దేశంలోనే దీన్నొక అరుదైన ఘటనగా అభివర్ణించిన సీఎం కేసీఆర్.. దేశంలోనే ఇలాంటి చర్య మరెక్కడా తీసుకోలేదని చెప్పారు. గ్రామ, మున్సిపల్ వార్డు ఇలా ఏదైనా అదనంగా పెరుగాలంటే ముందుగా శాసనసభలో చర్చ జరుగాల్సిందేనని అన్నారు. చట్టరూపంలో చేస్తే అనవసరంగా వచ్చే స్టేల బాధ తప్పుతుందని చెప్పారు. అయితే ప్రగతినిరోధక శక్తులు దీనిమీద కూడా కేసులు వేశాయని, కానీ, కోర్టులకు స్పష్టంగా చెప్పడంతో కోర్టువారు కూడా మన్నించారని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన మున్సిపాలిటీల్లో, హైదరాబాద్ నగర శివార్లలో ఏ విధంగా లేఅవుట్లు పుట్టుకొచ్చా యో, ల్యాండ్ మాఫియా ఏ విధంగా విజృంభించిందో అందరికీ తెలుసు. దుష్టకార్యకలాపాలకు పాల్పడ్డారు. అలాంటి బాధలు పోవాలనే ఉద్దేశంతో కొత్త మున్సిపల్ చట్టం తీసుకువస్తున్నాం అని సీఎం కేసీఆర్ వివరించారు.

దీనిపై శుక్రవారం పూర్తిగా వివరిస్తానని వెల్లడించారు. చట్టంలో భాగంగా అనేక గ్రామాలను మున్సిపాలిటీల్లో చేర్చామని, అనేక మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చామని తెలిపారు. కొత్తగా మరో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. కొత్తవి కలుపుకొంటే రాష్ట్రంలో మొత్తం కార్పొరేషన్లు 13కు చేరుకోనున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో ఉన్నామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ఎన్నికలు పూర్తయితే 20-25 రోజుల్లో వెసులుబాటు వస్తుందన్నారు. వార్డుల రిజర్వేషన్ ఖరారు కావాలంటే, వార్డుల సంఖ్య నిర్ణయం కావాలి కాబట్టి జిల్లా కలెక్టర్లకు చెప్పి పంచాయతీరాజ్ ఎన్నికల్లో అనుసరించిన విధానం పాటించి రిజర్వేషన్లు చేపట్టే వెసులుబాటు కల్పించేందుకు ఆర్డినెన్స్ తెచ్చామని తెలిపారు. ప్రస్తుతం రిజర్వేషన్లు ఖరారయ్యాయని చెప్పారు. సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా సభను కోరారు.

తొలిరోజు 4 ఆర్డినెన్సులకు ఆమోదం

ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభమైంది. తొలుత.. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పుట్టినరోజు కావటంతో సభ తరఫున స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే బొమ్మా వెంకటేశ్వర్, ఆంగ్లో ఇండియన్ సభ్యులుగా పనిచేసిన డెల్లా గాడ్‌ఫ్రే, కనకారెడ్డి, బండారి శారారాణి, గట్టు భీముడు, కృష్ణమూర్తి మృతికి సభ సంతాపం వ్యక్తంచేసింది. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మృతుల స్మృత్యర్థం రెండు నిమిషాలు సభ మౌనం పాటించింది. అనంతరం సీఎం కేసీఆర్ తెలంగాణ పురపాలకసంఘాల బిల్లు-2019ని ప్రవేశపెట్టారు. దీనిపై శుక్రవారం ఉభయసభల్లో చర్చ జరిగిన తర్వాత ఆమోదం పొందనుంది. నాలుగు ఆర్డినెన్స్‌లకు చట్టరూపం తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లులను ప్రవేశపెట్టారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ ఆర్డినెన్స్, పురపాలక శాసనాల ఆర్డినెన్స్, రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ ఆర్డినెన్స్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. తెలంగాణ పంచాయతీరాజ్ ఆర్డినెన్స్‌ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టారు. వీటిపై చర్చ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.

నేడు అసెంబ్లీ, మండలిలో మున్సిపల్ బిల్లుపై చర్చ

మున్సిపల్ బిల్లుపై అసెంబ్లీ శుక్రవారం చ ర్చించి ఆమోదించనున్నది. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన తర్వాత మున్సిపల్ బిల్లును చర్చకు చేపట్టనున్నారు. బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత సభ వాయిదా పడనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు శాసనమండలి సమావేశం ప్రారంభమై, అసెంబ్లీలో గురువారం ఆమోదం పొందిన 4 ఆర్డినెన్స్‌లతోపాటు కొత్త మున్సిపల్ చట్టంపై చర్చించి, ఆమోదించనున్నారు.
CMKCR3

పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం

పంచాయతీరాజ్ చట్టం రెండో సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లు ఉద్దేశాలను సభ్యులకు వివరించారు. రెండో ఆర్డినెన్స్‌కు బదులుగా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 147లో సబ్‌సెక్షన్ (11), సెక్షన్ 176లో సబ్‌సెక్షన్ 9కి చట్టసవరణ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మండల, జిల్లా ప్రజా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించిన తర్వాత కౌంటింగ్ తేదీకి (కొత్త పాలకవర్గం) మొదటి సమావేశం తేదీకి మధ్య 40 రోజుల వ్యవధి ఉన్నది. దీనితో కొత్త పాలకవర్గం మొదటి సమావేశం ముందస్తుగా జరుపడం వీలుకాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ 147(11) సెక్షన్, 170(9) సెక్షన్లకు సవరణ చేశారు. అందుకు అనుగుణంగా మొదటి సమావేశం బదులుగా ప్రత్యేక సమావేశం ద్వారా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలకు నోటీసు జారీచేసి, ఎన్నికలు నిర్వహించారు. దీనికోసం తెచ్చిన ఆర్డినెన్స్‌కు సభ ఆమోదంతో చట్టంరూపం రానున్నది.

ఉన్న ఆరుగురినన్న కాపాడుకో!

టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనంపై భట్టివిక్రమార్క పలుమార్లు వాదన లేవనెత్తడంతో నిర్దేశించిన అంశాలు తప్ప.. సభను పక్కదారి పట్టించే అంశాలు లేవనెత్తవద్దని స్పీకర్ పదేపదే విజ్ఞప్తిచేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవరణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో కూడా భట్టి అదే అంశాన్ని లేవనెత్తడంతో కూర్చోండి భట్టిగారు.. ఉన్నోళ్లు కూడా పోయేటట్టు ఉన్నరు. ఉన్నోళ్లలో ఇద్దరు లోపల కూసుంటే. ఇద్దరు బయట ఉన్నరు. ఆ ఉన్న ఆరుగురినన్నా కాపాడుకో. అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా అంతా నవ్వేశారు. చివరకు కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి బాయ్‌కాట్‌చేశారు. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం సభలోనే కూర్చుండిపోయారు. మొత్తంగా నాలుగు ఆర్డినెన్స్‌లు ఆమోదం పొందటం, ఒక బిల్లు ప్రవేశపెట్టడం పూర్తయింది. స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

లాబీ ముచ్చట్లు

రాజగోపాల్‌రెడ్డి.. గోపి: కేటీఆర్
గోపాల్ అనే పేరున్నవారిని గోపీ అని పిలువడం సాధారణం! గురువారం అసెంబ్లీ లాబీల్లో అదే జరిగింది. అసెంబ్లీ ముగిసిన తర్వాత బయటకు వస్తున్న టీఆర్‌ఎస్ సభ్యుడు కే తారకరామారావుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎదురయ్యారు. ఆయనను ఉద్దేశించి కేటీఆర్.. గోపిఅని సంబోధించారు. ఒక్క క్షణం ఏమీ అర్థంకాని రాజగోపాల్‌రెడ్డి.. ఏమిటి? అని ఆశ్చర్యపోతూ కేటీఆర్‌ను అడిగారు. అదే నీ పేరు రాజగోపాల్‌రెడ్డి కదా.. అందుకే గోపి అన్నాను అంటూ వివరణ ఇచ్చారు. ఏ పార్టీలో ఉన్నావు? ఎక్కడ ఉన్నావో తెలుసా? అంటూ కేటీఆర్ ప్రశ్నించడంతో రాజగోపాల్‌రెడ్డి సరైన సమాధానం చెప్పుకోలేక కొంత ఇబ్బంది పడ్డారు.

మీతో చాయ్! వద్దు బాబు!

మీతో చాయ్ పే చర్చనా? వద్దు బాబు.. అన్నారు కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్‌బాబు. అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం టీఆర్‌ఎస్ సభ్యులు కేటీఆర్, పద్మా దేవేందర్‌రెడ్డి, బాల్క సుమన్ బయటికి వస్తున్న సందర్భంగా శ్రీధర్‌బాబు ఎదురయ్యారు. ఈ సందర్భంగా చాయ్ తాగుదాం రా.. అంటూ శ్రీధర్‌బాబును కేటీఆర్ ఆహ్వానించడంతో మీతో చాయ్‌పే చర్చనా? ఇంకా ఏమైనా ఉందా? వద్దు బాబు.. అన్నారు. ఇటీవల అన్నారం బరాజ్ వద్ద బాల్క సుమన్ నిర్వహించిన జలజాతరను ప్రస్తావించిన శ్రీధర్‌బాబు.. ఏవో వనభోజనాలు పెట్టించినట్టున్నావు.. అంటూ పలుకరించారు.

కాంగ్రెస్‌లో విభేదాలు!

కాంగ్రెస్‌లోని విభేదాలు శాసససభ సమావేశాల సందర్భంగా మరోసారి బయటపడ్డాయి. మొత్తం ఆరుగురు సభ్యుల్లో భట్టి విక్రమార్క నేతృత్వంలో నలుగురు సభ్యులు నల్ల కండువాలు కప్పుకొని రాగా రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి వాటిని వేసుకోలేదు. సభ ప్రారంభం అయిన తర్వాత నలుగురు సభ్యులు నిరసన తెలుపగా.. జగ్గారెడ్డి బయటికి వెళ్లిపోయారు. రాజగోపాల్‌రెడ్డి మాత్రం సీట్లోనే కూర్చొని కాంగ్రెస్ సభ్యులతో తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు.

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌దే గెలుపు..

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విశ్వాసం వ్యక్తంచేశారు. గురువారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంత పెద్ద నాయకులను నిలబెట్టుకున్నా విజయం తమదేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్నారని, ఉప ఎన్నికలోనూ ఆదరిస్తారని అన్నారు. ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని ధీమాగా చెప్పారు.

1611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles