2.25 లక్షల కోట్లు.. 1.25 కోట్ల ఎకరాలు

Sat,January 19, 2019 03:03 AM

-రైతులకు సాగునీరు ప్రథమ ప్రాధాన్యం
-మరింత వేగంగా తమ్మిడిహట్టి బరాజ్ పనులు
-పెద్దవాగు నీటి సద్వినియోగానికి వ్యూహం
-వచ్చేనెలలో పాలమూరు, డిండి పనులు పరిశీలిస్తా
-వర్షాకాలం వచ్చేవరకు పనులకు అనువైన సమయం
-కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో మొదట చెరువులు నింపాలి
-సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో సీఎం కేసీఆర్
-ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదని వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేందుకుగాను రూ.2.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించడానికన్నా మించిన ప్రాధాన్యం మరొకటి లేదని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరతలేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. వెంట వెంటనే బిల్లులు చెల్లించనున్నట్లు వెల్లడించారు. తమ్మిడిహటి వద్ద బరాజ్ నిర్మించడంతోపాటు పెద్దవాగు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి సమగ్ర వ్యూహం రూపొందించుకొని నిర్మాణాలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణపనులపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు రూ.77,777 కోట్లు ఖర్చు చేశాం. భూసేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, ఆర్‌ఆర్ ప్యాకేజీల కోసం మరో రూ.22వేల కోట్లు ఖర్చయింది. మొత్తంగా ఇప్పటివరకు రూ.99,643 కోట్ల వ్యయం చేశాం. ఈ ఏడాది మార్చినాటికి మరో రూ.7వేల కోట్లకు పైగా ఖర్చవుతుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం వరకు రూ.1.07 లక్షల కోట్లకుపైగా వ్యయం జరుగుతుంది. గోదావరి, కృష్ణా బేసిన్లలోని ప్రాజెక్టులతోపాటు మిషన్ కాకతీయ పనుల కోసం మరో రూ.1.17 లక్షల కోట్లు ఖర్చవుతాయని అంచనా. రాబోయే ఐదేండ్లలో ఈ నిధులు ఖర్చుచేసి, ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి, మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం అధికారులు, ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీలు కృషిచేయాలి. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇ స్తున్న ప్రాధాన్యం గుర్తించి, వెంటవెంటనే నిధులు విడుదలచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ జిల్లా చరిత్ర మార్చాలి

సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులు ఓ జోక్‌గా మారాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలప్పుడు ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఓట్లు అడుక్కోవడమే తప్ప ప్రాజెక్టులు కట్టి నీళ్లియ్యలేదు. అత్యధిక వర్షపాతం, పుష్కలమైన నీటి లభ్యత ఉన్న ఆదిలాబాద్ జిల్లా చరిత్ర మార్చాలి. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలి. ఆ బరాజ్ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో 56,900 ఎకరాలు, ఆసిఫాబాద్‌లో 38,830 ఎకరాలు, చెన్నూరులో 31,500 ఎకరాలు, బెల్లంపల్లి నియోజకవర్గంలో 72,770 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించి, 20 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి కేంద్ర జలసంఘం అంగీకారం తెలిపింది. ఈ నీటిని సద్వినియోగం చేసుకొని, ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వడానికి సమగ్ర వ్యూహం రూపొందించాలి. ఆదిలాబాద్ జిల్లాలో పారే పెద్దవాగుకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. చాలా నియోజకవర్గాల గుండా ఈ వాగు పోతుంది. ఈ పెద్దవాగు నీటిని వినియోగించుకోవడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి. పెన్‌గంగ ప్రాజెక్టుపై నిర్మిస్తున్న చనాఖా-కొరాటా ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి. కుప్టి రిజర్వాయర్ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

గోదావరి ప్రాజెక్టులపై నెలాఖరులోగా కార్యాచరణ

తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం, చనాఖా-కొరాటా ప్రాజెక్టు, పెద్దవాగు సద్వినియోగం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో చాలావరకు సాగునీరు అందనుందని సీఎం కేసీఆర్ అన్నారు. మిగిలిన భాగానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు పారుతుందని చె ప్పారు. కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా గోదావరి బేసిన్‌లో తెలంగాణకు ఉన్న నీటి వాటాను పూర్తిగా వినియోగించుకోవాలి. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించాను. నీటిపారుదల శాఖ అధికారులు, రిటైర్డ్ ఇంజినీర్లు కూడా ఈ ప్రాజెక్టు పనులను సందర్శించారు. మొత్తం గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చేయాల్సిన పనులపై పూర్తి అవగాహన వచ్చింది. ఈ అవగాహనతో ఈ నెలాఖరులోగా కార్యాచరణ ఖరారు చేయాలి. ఫిబ్రవరిలో నేనే స్వయంగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను పరిశీలిస్తాను. ఫిబ్రవరి మాసంలో కృష్ణాబేసిన్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేయడంపై కార్యాచరణ రూపొందిస్తాం. వర్షాకాలం వరకు పనులుచేసుకునే అవకాశం ఉన్నందున వెంటనే కార్యరంగంలోకి దిగాలి అని సీఎం చెప్పారు.
CMKCR1

చెరువులకు మళ్లించండి

ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని మొదటగా చెరువులకు మళ్లించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు మిడ్‌మానేరు నుంచి ఎస్సారెస్పీ వరకు, ఇటు మల్లన్నసాగర్ వరకు నీరు అందుతుందన్నారు. ఆ నీటిని చెరువులకు మళ్లించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఏదైనా చెరువుకు ఫీడర్ చానల్ లేకుంటే కొత్తగా తవ్వాలని ఆదేశించారు. ఎస్సారెస్పీ రెండోదశ వరకు చెరువులు నింపాలని సీఎం స్పష్టంచేశారు. సమావేశం లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, సీఈలు హరిరాం, శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈలు విష్ణుప్రసాద్, వేణు, ఈఈ రామకృష్ణ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

ఐదేండ్ల లక్ష్యం.. 1.25 కోట్ల ఎకరాలు సస్యశ్యామలం

-ఇప్పటివరకు ప్రాజెక్టుల కోసం వెచ్చించింది రూ.77,777 కోట్లు.
-భూసేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం, ఆర్‌ఆర్ ప్యాకేజీల కోసం వ్యయం రూ.22 వేల కోట్లు.
-మొత్తంగా ఇప్పటివరకు జరిగిన వ్యయం..రూ.99,643 కోట్లు.
-ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి (మార్చి వరకు) వ్యయం మరో రూ.7వేల కోట్లు.
-2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మొత్తం వ్యయం రూ.1.07 లక్షల కోట్లకు పైగా.
-మిషన్ కాకతీయ పనుల కోసం వెచ్చించేది మరో రూ.1.17 లక్షల కోట్లు.
-మొత్తంగా రాష్ట్రంలో రూ.2.25 లక్షల కోట్ల వ్యయంతో 1.25 కోట్ల ఎకరాలు సస్యశ్యామలం.

3645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles