అద్దంలా రహదారులు


Sun,January 20, 2019 02:17 AM

CM KCR Says Roads are preferred after irrigation projects

-అన్ని పంచాయతీలకు బీటీ రోడ్లు
-సాగునీటి ప్రాజెక్టుల తర్వాత రోడ్లకే ప్రాధాన్యం
-రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు బడ్జెట్ సిద్ధం
-రాజకీయాలకు అతీతంగా పనులు జరుగాలి
-ఎమ్మెల్యే కార్యాలయాలు త్వరగా పూర్తవ్వాలి
-రాష్ట్ర రహదారులపై సమీక్షలో సీఎం కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలోని అన్ని రహదారులను అద్దంలా మార్చాలని అధికారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సూచించారు. కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలతోసహా రాష్ట్రంలోని మొత్తం 12,751 పంచాయతీలకు బీటీ రహదారి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత రహదారులకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఎలా ఉంది? వాటిని అద్దంలా తయారుచేయడానికి ఏం చేయాలనే విషయంపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు అవసరమైన బడ్జెట్ కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యే కార్యాలయాల నిర్మాణాలు చేపట్టామని, వాటిని త్వరగా పూర్తిచేయాలని కోరారు. హైదర్‌గూడలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేల నివాస గృహాలను త్వరలో కేటాయించనున్నట్టు తెలిపారు.

ఆర్‌అండ్‌బీ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం ద్వారా రికార్డుస్థాయిలో జాతీయ రహదారులను సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖల ఆధ్వర్యంలో భారీ గా రోడ్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. అవసరమైన చోట రహదారులకు, శిథిలావస్థకు చేరిన వంతెనలకు మరమ్మతులు, ఇరుకు వంతెనలను వెడల్పు చేయాలని ఆదేశించారు. దీనికోసం ఈఎన్సీ స్థాయి నుంచి ఏఈ స్థాయి వరకు రాష్ట్రస్థాయి ఆర్‌అండ్‌బీ అధికారుల సదస్సు నిర్వహించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి ప్రతి రహదారి పరిస్థితిని సమీక్షించి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. జిల్లా, మండలం అనే తేడా లేకుండా, అక్కడ ఏ పార్టీ ప్రజాప్రతినిధి ప్రాతినిథ్యం వహిస్తున్నారనే విషయాన్ని పక్కనబెట్టి.. అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా దగ్గరుండి మరమ్మతులు చేయించుకోవాలని కోరారు. పంచాయతీరాజ్ నుంచి ఆర్‌అండ్‌బీకి, ఆర్‌అండ్‌బీ నుంచి జాతీయరహదారులకు రోడ్లు బదిలీ అయిన సందర్భంలో వాటి నిర్వహణ, మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. కొత్త రోడ్లు నిర్మాణం అయ్యే వరకు పాత రోడ్లు పాడైపోయినా పట్టించుకోవడంలేదని, దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడాల్సి వస్తున్నదని చెప్పారు. సమీక్షలో ఆర్ అండ్‌బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్‌ఈ చంద్రశేఖర్, సీఎంవో కార్యదర్శులు స్మితాసబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
CMKCR1

రైతులకు వెంటనే పరిహారం ఇవ్వండి

కాళేశ్వరం ప్రాజెక్టులో కాల్వల నిర్మాణం కోసం భూమి ని కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముథోల్ నియోజకవర్గ పరిధిలోని రైతులకు పరిహారం ఇప్పించాలని సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే జీ విఠల్‌రెడ్డి శనివారం ప్రగతిభవన్‌లో కలిసి విజ్ఞప్తిచేశారు. చిన్న సుద్దవాగు ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురైన ప్రజలకు పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. స్పందించిన సీఎం కేసీఆర్ ఆర్థికశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

2503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles